సరూర్‌నగర్‌లో అత్యంత దారుణంగా హత్యకు గురైన అప్సర కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. నిన్నటి వరకూ నిందితుడు సాయికృష్ణకు మాత్రమే వ్యతిరేకంగా ఉన్న ఈ కేసు.. ఇప్పుడు నెమ్మదిగా అప్సరకు కూడా వ్యతిరేకంగా మారుతోంది. ఎందుకంటే గతంలోనే ఓ వ్యక్తితో అప్సరకు పెళ్లైనట్టు పోలీసులు తమ విచారణలో గుర్తించారు.
అప్సర తన మొదటి భర్తతో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కానీ ఇప్పటి వరకూ అప్సర తల్లిదండ్రులు కానీ, నిందితుడు సాయికృష్ణ గానీ అప్సర మొదటి పెళ్లి గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. కొంత కాలం క్రితం చెన్నైకి చెందిన ఓ వ్యక్తిని పెళ్లి చేసుకున్న అప్సర.. అతనితో గొడవల కారణంగా పుట్టింటికి వచ్చేసిందని పోలీసులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే సాయి కృష్ణతో పరిచయం ఏర్పడి.. ఆ పరిచయం ప్రేమగా మారిందంటున్నారు. తనను పెళ్లి చేసుకోవాలంటూ సాయికృష్ణను అప్సర ఇబ్బంది పెట్టిన కారణంగానే తాను ఆమెను చంపినట్టు నిందితుడు విచారణలో పోలీసులకు చెప్పాడు.
కానీ అప్సర తల్లిదండ్రులు మాత్రం ఆమె మొదటి పెళ్లి గురించి ప్రస్తావించకుండా దాచేయడం పలు అనుమానాలకు దారితీస్తోంది. చనిపోయిన సమయంలో అప్సర గర్భంతో ఉందని పోలీసులు చెప్తున్నారు. అయితే ఆ గర్భానికి తాను కారణం కాదని చెన్నైకి చెందిన వేరే వ్యక్తితో తను రిలేషన్‌లో ఉందని సాయికృష్ణ చెప్పాడు. ఇలాంటి సిచ్యువేషన్‌లో ఇప్పుడు అప్సరకు వేరే పెళ్లి జరిగిందనే నిజం బయటికి రావడంతో సాయికృష్ణ చెప్పింది కూడా నిజమేనేమో అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ ఫొటోల వెనక నిజానిజాలు బయటికి లాగే పనిలో ఉన్నారు పోలీసులు. ప్రస్తుతం విచారణ కొనసాగుతున్న ఈ కేసులో ఇంకా ఎన్ని ట్విస్ట్‌లు వెలుగులోకి వస్తాయో చూడాలి.