KP Chowdary: కేపీ చౌదరి డ్రగ్స్ కేసులో టాలీవుడ్‌తో లింకులు బయటపడుతున్నాయి. కోర్టు అనుమతితో కేపీ చౌదరిని విచారణ కోసం కస్టడీలోకి తీసుకున్న పోలీసులు సంచలన విషయాలు బయటపెట్టారు. కేపీ చౌదరి టాలీవుడ్‌కు చెందిన 16 మంది సెలబ్రిటీలకు, కొందరు నేతల కుమారులకు డ్రగ్స్ అమ్మినట్టు విచారణలో చెప్పాడని పోలీసులంటున్నారు.
బిగ్‌బాస్ ఫేమ్ అషు రెడ్డి, యాక్టర్ సురేఖవాణితో కేపీ చౌదరి వందల సార్లు ఫోన్లు మాట్లాడినట్టు పోలీసులు గుర్తించారు. కేపీ చౌదరీ కాల్ లిస్ట్‌ను పోలీసులు డీకోడ్ చేస్తున్నారు. కేపీ చౌదరీ ఫోన్ సంభాషణపై పోలీసుల ఆరా తీస్తున్నారు. ప్రైవేట్ పార్టీల్లో కేపీ చౌదరి సెలబ్రిటీలతో దిగిన ఫొటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. కేపీ చౌదరితో లింకులున్న వారిలో ప్రొడ్యూసర్లు, ప్రముఖ టెక్నీషియన్లు ఉన్నట్టు గుర్తించామని పోలీసులు చెప్తున్నారు. వీళ్లందరికీ త్వరలోనే నోటీసులు జారీ చేసి విచారణకు పిలుస్తామన్నారు. దీంతో ఒక్కసారిగా ఈ విషయం సంచలనంగా మారింది. మరోపక్క కేపీ చౌదరి బ్యాంక్ అకౌంట్స్ కూడా చెక్ చేప్తున్నారు పోలీసులు.
కేపీ చౌదరితో పార్టీలో పాల్గొన్నవాళ్లు, ఫొటోల్లో ఉన్నవాళ్లు అందరూ అతని దగ్గర డ్రగ్స్ కొన్నారా అనే విషయం త్వరలోనే బయటికి రాబోతోందని చెప్తున్నారు. ప్రస్తుతానికి విచారణ కొనసాగుతోందని, కానీ కేపీ చౌదరి మాత్రం విచారణకు ఏమాత్రం సహకరించడంలేదని చెప్తున్నారు. ఇప్పటికే రెండు రోజులపాటు కేపీ చౌదరిని పోలీసులు విచారించారు. గతంలో కూడా ఇలాగే డ్రగ్స్ కేసు టాలీవుడ్‌లో కలకలం రేపింది. కాపీ అప్పుడు కేసులో పేర్లు బయటికి వచ్చిన సెలబ్రిటీలకు తర్వాత క్లీన్‌చిట్ ఇచ్చారు పోలీసులు. ఇప్పుడు మరోసారి కేపీ చౌదరి అరెస్ట్‌తో టాలీవుడ్ లింకులు బయటికి రావడం సంచలనంగా మారింది. కేపీ చౌదరి లిస్టులో రఘు తేజ, సనా మిశ్రా, సుశాంత్ రెడ్డి, నితినేశ్, బెజవాడ భరత్, శ్వేత, టాగోర్ ప్రసాద్ వంటి కొందరు ప్రముఖుల పేర్లున్నాయి. సినీ రాజకీయ ప్రముఖులే కాకుండా క్రీడాకారుల చుట్టూ కూడా డ్రగ్స్ ఉచ్చు బిగుస్తోంది.
కొన్ని రోజుల క్రితం బ్యాడ్మింటన్ ప్లేయర్ సిక్కిరెడ్డి ఇంట్లో కేపీ చౌదరి ఆధ్వర్యంలో పార్టీ జరిగినట్టు పోలీసులు గుర్తించారు. ఈ పార్టీలో కేపీ చౌదరి చాలా మంది సెలబ్రిటీలకు డ్రగ్స్ సప్లై చేసినట్టు అనుమానిస్తున్నారు. ఆ రోజు పార్టీలో ఉన్న సెలబ్రిటీల లిస్ట్ పోలీసులు రెడీ చేస్తున్నారు. ఈ విచారణ తరువాత వాళ్లకు కూడా నోటీసులు పంపే అవకాశముంది. ఇక కేపీ చౌదరి బ్యాంక్ లావాదేవీలు కూడా ఈ కేసులో కీలకంగా మారాయి. మొత్తం 11 అనుమానాస్పద లావాదేవీలను గుర్తించారు పోలీసులు. బిహార్ నుంచి విజయవాడ నుంచి ఈ లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. అయితే ఇవి డ్రగ్స్ డీల్‌లో భాగంగానే జరిగాయా లేదా అనే కోణంలో పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.