Train Mishap: తెగిపడ్డ కాళ్లు.. విరిగిపోయిన చేతులు.. చెల్లాచెదురుగా అవయవాలు! గుండెల్ని పిండేస్తోన్న రైళ్ల ప్రమాద దృశ్యాలు

అక్కడ శవాలున్నాయి.. చెల్లాచెదురుగా పడిన అవయవాలున్నాయి.. తెగిపడ్డ కాళ్లూ.. విరిగిపోయిన చేతులు.. పగిలిన తలలు..ఎటు చూసిన రక్తమే..! భయకంపితులైన ప్రజల హాహాకారాలు.. తీవ్రంగా గాయపడిన వారి ఆర్తనాదాలతో ఒడిశా బాలేశ్వర్ రైళ్లు ప్రమాద దృశ్యాలు గుండెల్నీ పిండేస్తున్నాయి.

  • Written By:
  • Publish Date - June 3, 2023 / 10:37 AM IST

చీకటి, చీకటి, కటిక చీకటి..కళ్లు తెరవలేని చీకటీ…ఏం జరిగిందో అర్థమయ్యేలోపే ప్రాణాలు పట్టాలు కింద నలిగిపోయాయి. బోగీల కింద నుజ్జునుజ్జయ్యాయి. నిమిషాల, గంటల ముళ్లు ఆగిపోయాయి.. జ్ఞాపకాలు తుళ్లిపడ్డాయి.. మరో నిమిషం తర్వాత తామింక బతకమని తెలుసుకున్న ఆ హృదయాలు కన్నవారిని చివరి సారిగా తలచుకున్నాయి.. కొద్దీ గంటల ముందు వరకు తన నీడల తన వెన్నంటే ఉన్న భార్య గుర్తుకొచ్చింది.. చివరిసారిగా తన పిల్లలతో మాట్లాడిన ఆ ఫోన్‌ కాలే చెవులో మారుమోగుతున్నట్టు అనిపించింది.. తనను ట్రైన్‌ ఎక్కిస్తూ రైలు కదులుతుండగా తన భర్త చెప్పిన ‘టాటా’నే ఆమె కళ్ల ముందు కదలాడింది. మరణం చివరి క్షణం ఎలా ఉంటుందో బాలేశ్వర్‌ రైళ్లు ప్రమాద ఘటన గుర్తుచేస్తోంది.
భర్తను పొగొట్టుకున్న భార్య.. భార్యను నిర్జీవంగా చూసిన భర్త.. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు.. కన్నబిడ్డలు కళ్లముందే కడసారి శవపేటికలోకి వెళ్తుంటో వచ్చే బాధ అనుభవించినవాడికే తెలుస్తుంది.

అప్పటివరకు ఆటపాటలతో.. తమ స్నేహితులతో ఎంతో హుషారుగా ప్రయాణం సాగిస్తున్నారు.. మరికొందరు చంటిబిడ్డలతో..పిల్లాపాపలతో ముచ్చట్లు చెప్పుకుంటూ మురిసిపోతున్నారు.. ఇంకొందరు అప్పటివరకు తోటి ప్రయాణికులతో మాట్లాడి..మాట్లాడి అలసిపోయి కాసేపు కునుకు తీసేందుకు కళ్లు మూశారు.. కానీ వాళ్లకి తెలియదు ఇదే తమ ఆఖరి ప్రయాణమవుతుందని.. అదే తమ చివరి కునుకు అవుతుందని.. ఆ పాటే తమ చివరిశ్వాస అవుతుందని..! మృత్యువు ఎప్పుడు ఏ వైపు నుంచి కబళిస్తుందో ఎవరికి తెలియదు.. అందుకే వాళ్లకి కూడా తెలియలేదు మరణం తమ వెనకే వికటహాసంతో వస్తుందని…! వందల ప్రాణాలను బలిగొన్న బాలేశ్వర్ రైళ్లు ప్రమాదాల దృశ్యాలు కన్నీరు పెట్టిస్తున్నాయి.!

బెంగళూరు నుంచి పశ్చిమ బెంగాల్‌లోని హావ్‌డాకు వెళ్తున్న బెంగళూరు- హావ్‌డా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ బాలేశ్వర్‌ సమీపంలోని బహానగా బజార్‌ వద్ద జూన్ 2 రాత్రి 7 గంటలకు పట్టాలు తప్పింది. దీంతో దాని పలు బోగీలు పక్కనే ఉన్న ట్రాక్‌పై పడిపోయాయి. అయితే అదే ట్రాక్‌పై 120 కిలోమీటర్ల వేగంతో వస్తున్న షాలిమార్‌-చెన్నై సెంట్రల్‌ కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌.. హావ్‌డా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొట్టింది. దీంతో కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 15 బోగీలు ఒక్కసారిగా బోల్తాపడ్డాయి. కోరమండల్‌ కోచ్‌లను పక్కనున్న ట్రాక్‌పై దూసుకొచ్చిన గూడ్సు రైలు ఢీకొంది. ఇప్పటివరకు 300కు పైగా ప్రయాణికులు మరణించారని సమచారం.. ఈ సంఖ్య ఎక్కడ వరకు వెళ్తుందో అధికారులు కూడా చెప్పలేకపోతున్నారు.