YS Viveka Murder Case: వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు..! త్వరలో కీలక నేత అరెస్ట్..?

వై.ఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ముఖ్యంగా కడప ఎంపీ అవినాశ్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగిస్తోందని అర్థమవుతోంది. వివేకా హత్య కేసు హైదరాబాద్ కు బదిలీ అయిన తర్వాత పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి.

  • Written By:
  • Updated On - February 24, 2023 / 05:37 PM IST

వై.ఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ముఖ్యంగా కడప ఎంపీ అవినాశ్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగిస్తోందని అర్థమవుతోంది. వివేకా హత్య కేసు హైదరాబాద్ కు బదిలీ అయిన తర్వాత పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఇన్నాళ్లూ ముఖ్యులుగా పేరొందిన అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిని విచారించేందుకు సీబీఐకి అనేక ఆటంకాలు ఎదురయ్యాయి. కానీ హైదరాబాద్ కు షిఫ్ట్ అయిన తర్వాత సీబీఐకి లైన్ క్లియర్ అయినట్లు కనిపిస్తోంది. అందుకే వెంటవెంటనే వాళ్లకు నోటీసులు జారీ చేయడం, విచారించడం చకచకా జరిగిపోతున్నాయి.

వివేకానంద రెడ్డి హత్య కేసు మొదటి నుంచి అనుమానాస్పదమే. ఇది ఇంటిగుట్టేనని బహిరంగంగానే కామెంట్లు వినిపించాయి. ఇంటి మనుషులే ఈ పని చేసి ఉంటారనే అనుమానాలు మొదటి నుంచి వినిపిస్తూ వచ్చాయి. మొదట పోలీసులు కేసు నమోదు చేయడం, ఆ తర్వాత సీఐడీ పరిధిలోకి వెళ్లడం.. అయితే సీబీఐకి ఇవ్వాల్సిందేనని వివేకా భార్య, కూతురు పట్టుబట్టడంతో ఈ వ్యవహారం ఢిల్లీకి చేరింది. సీబీఐ రంగంలోకి దిగిన తర్వాత కేసు విచారణ త్వరగానే తేలుతుందని అందరూ భావించారు. అయితే కడప కేంద్రంగా విచారణ మొదలు పెట్టిన సీబీఐకి సరైన సహకారం అందలేదు. అధికారులు సహకరించట్లేదని.. తమకు కూడా బెదిరింపులు వస్తున్నాయని సీబీఐ అధికారులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారంటే వాళ్ల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. పైగా అధికారంలో ఉన్నది వివేకా కుటుంబసభ్యులే కాబట్టి కేసు విచారణ ముందుకు సాగదని.. దీన్ని వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని సీబీఐ కూడా కోరుతూ వచ్చింది. ఇదే సమయంలో వివేకా కుమార్తె కూడా కేసును పక్క రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుడంతో విచారణ హైదరాబాద్ కు షిఫ్ట్ అయింది.

జనవరిలో హైదరాబాద్ కు కేసు షిఫ్ట్ అయిన తర్వాత సీబీఐ స్పీడ్ పెంచింది. వెంటనే ఎంపీ అవినాశ్ రెడ్డికి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది. విచారణ మొదలు పెట్టింది. ఈ కేసుకు సంబంధించి సాక్ష్యులు ఇచ్చిన ఆధారాల మేరకే వాళ్లిద్దరినీ సీబీఐ విచారించింది. వీళ్లను విచారించిన తర్వాత సీబీఐ మరిన్ని ఆధారాలను సేకరించిందనేది తాజా సమాచారం. ముఖ్యంగా వివేకా హత్యకు ముందు, ఆ తర్వాత నిందితులంతా అవినాశ్ రెడ్డితో టచ్ లో ఉన్నారనేది సీబీఐ చెప్తున్న మాట. మరి ఇది వాస్తవమే అయితే కేసు కొలిక్కి వచ్చినట్లే.! హత్యకు ఎవరు కుట్ర పన్నారు.. ఎవరు అమలు చేశారు.. అన అంశాలపై క్లారిటీ వచ్చినట్లే. త్వరలోనే ఈ అంశాలపై ఛార్జ్ షీట్ నమోదు చేయడంతో పాటు కీలక వ్యక్తులను అరెస్ట్ చేసేందుకు సీబీఐ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.