Cheddi Gang: హైదరాబాద్ పబ్లిక్.. బీ అలెర్ట్.. సిటీలో చెడ్డీ గ్యాంగ్ తిరుగుతోంది జాగ్రత్త..!

ఇటీవల మియాపూర్‌లోని వసంత సిటీ విల్లాల్లో చెడ్డీ గ్యాంగ్ చొరబడింది. నాలుగిళ్లలో దోపిడీలకు పాల్పడింది. ఒక ఇంట్లో 30 తులాలు బంగారం దోచుకుంది. ఆరుగురు ముఠా సభ్యులు ఉన్న ఈ చెడ్డీ గ్యాంగ్ వసంత్ విల్లా కమ్యూనిటీలో గోడలు దూకడం, ఇళ్లల్లో చొరబడటం.. అన్నీ అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డైంది.

  • Written By:
  • Updated On - August 11, 2023 / 02:32 PM IST

Cheddi Gang: అపార్టుమెంట్‌లో ఉంటున్నాం.. హై సెక్యూరిటీ విల్లాల్లో ఉంటున్నాం.. మాకేం కాదు అని సంబర పడకండి. హైదరాబాదులో మళ్లీ చెడ్డీ గ్యాంగుల హంగామా మొదలైంది. సెలవులకి మీరు ఊరు వెళ్లినా, అలా వారం రోజులు తిరిగి వద్దామని టూర్‌కు వెళ్లినా.. తిరిగి వచ్చేటప్పటికి ఇల్లు గుల్లయిపోయి ఉండొచ్చు. ఎందుకంటే.. తాళాలు వేసి ఉన్న ఇళ్లను కొల్లగొట్టడం చెడ్డీ గ్యాంగ్ స్పెషాలిటీ. ఇటీవల మియాపూర్‌లోని వసంత సిటీ విల్లాల్లో చెడ్డీ గ్యాంగ్ చొరబడింది. నాలుగిళ్లలో దోపిడీలకు పాల్పడింది.

ఒక ఇంట్లో 30 తులాలు బంగారం దోచుకుంది. ఆరుగురు ముఠా సభ్యులు ఉన్న ఈ చెడ్డీ గ్యాంగ్ వసంత్ విల్లా కమ్యూనిటీలో గోడలు దూకడం, ఇళ్లల్లో చొరబడటం.. అన్నీ అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డైంది. ఆ విజువల్స్ చూస్తేనే కొందరు భయంతో వణికిపోయారు. ఇది నిజమేనని స్థానిక పోలీసులు కూడా కన్ఫామ్ చేశారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఈ చెడ్డీ గ్యాంగ్‌కి క్రిమినల్ రికార్డ్స్‌లో 60 నుంచి 70 ఏళ్లకు పైగానే నేర చరిత్ర ఉంది. వీళ్లు ఎక్కువగా తాళాలేసిన ఇళ్లను టార్గెట్ చేస్తారు. మధ్యప్రదేశ్ నుంచి చుట్టుపక్కల రాష్ట్రాలకు వస్తారు. దొంగతనం చేసే ముందు షర్టు ప్యాంటు తీసేసి జస్ట్ ఒక చెడ్డీతో రంగంలోకి దిగుతారు. 7-8 అడుగుల గోడ కూడా అవలీలగా ఎక్కి దూకగలుగుతారు. సీసీ కెమెరాలకు దొరక్కుండా ముఖాలకు మాస్కులు వేసుకుంటారు. తాళాలు పగలగొట్టడంలో వీళ్లు సిద్ధహస్తులు. ఇంట్లో చొరబడి తాపీగా దొంగతనం చేస్తారు. తర్వాత ఇంట్లో ఉన్న తినుబండారులు తినడం, ఇంట్లో జనం ఎవరూ లేకపోతే ఎంజాయ్ చేయడం చెడ్డీ గ్యాంగ్ స్పెషాలిటీ. ఎంత దొరికితే అంత తినేస్తారు.

అవసరమైతే రెండు రోజులు తినకుండా కూడా ఉండగలరు. వీళ్ళని అడ్డుకోవాలని ప్రయత్నిస్తే మాత్రం చిన్న సైజు ఐరన్ రాడ్‌తో దాడి చేస్తారు. తలలు బద్దలు కొడతారు. ప్రాణాలూ తీస్తారు. మూడు నాలుగు రోజులు చకచకా 10 నుంచి 15 దొంగతనాలు చేసి జంప్ అయిపోతారు. గతంలో చెడ్డీ గ్యాంగులు దొరికినప్పుడు వాళ్ళ అలవాట్లు స్టడీ చేసి పోలీసులు ఆశ్చర్యపోయారు. హైదరాబాదులో ఇంతకాలం తర్వాత మళ్లీ చెడ్డీ గ్యాంగ్‌ల హంగామా మొదలైంది. దీంతో అలర్ట్‌గా ఉండాలని హైదరాబాద్ వాసులందరినీ పోలీసులు హెచ్చరిస్తున్నారు.