ANDHRA PRADESH: భారతీల వైవాహిక వ్యవస్థకు ప్రపంచంలోనే గొప్ప గుర్తింపు ఉంది. ఒక్కసారి చేయిపట్టుకుని ఏడు అడుగులు నడిస్తే.. ప్రాణం పోయేవరకూ ఆ బంధాన్ని కాపాడుకుంటారు భారతీయులు. జీవిత భాగస్వామే జీవితంగా బతికేస్తుంటారు. ఇంత గొప్ప వ్యవస్థను వివాహేతర సంబంధాలు చిన్నాభిన్నం చేస్తున్నాయి. కొద్దిపాటి ఆనందం కోసం కుటుంబాలను రోడ్డున పడేసిన ఘటనలు, ప్రాణాలు తీస్తున్న సంఘటనలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి.
రీసెంట్‌గా కడప జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. ఏ పాపం తెలియని ఇద్దరు చిన్నారులతో పాటు.. నలుగురి ప్రాణం తీసింది ఓ వివాహేతర సంబంధం. కడప జిల్లా పులివెందుల టూ టౌన్ పోలీస్ స్టేషన్లో వెంకటేశ్వర్లు కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. కొంత కాలం క్రితం అతనికి రమాదేవి అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కొద్దిరోజులకు వివాహేతర సంబంధంగా మారింది. భార్య పిల్లలు ఉన్నా.. రమాదేవి మాయలో మునిగిపోయాడు వెంకటేశ్వర్లు. కుటుంబాన్ని పట్టించుకోవడం మానేశాడు. ఇదే విషయంలో భార్య మాధవితో చాలాసార్లు వెంకటేశ్వర్లుకు గొడవ జరిగింది.
ఎన్ని గొడవలు జరిగినా భార్యను హింసించాడే తప్ప.. రమాదేవిని మాత్రం విడిచిపెట్టలేదు. ఆమెతో ఎంత పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాడు అంటే.. రీసెంట్‌గా 20 లక్షలు విలువ చేసే భూమిని రమాదేవి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడు వెంకటేశ్వర్లు. ఈ విషయం తెలిసి మాధవి గొడవకు దిగింది. కుటుంబం పరువు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించకుండా జీవితాలు నాశనం చేస్తున్నావంటూ భర్తతో గొడవకు దిగింది. భార్య అడ్డు తొలగించుకోవాలి అనుకున్నాడో.. లేక ప్రేయసికి ఎలాంటి ఇబ్బందులు రాకూడదు అనుకున్నాడో తెలియదు కాని.. భార్య పిల్లల్ని చంపేసి తాను కూడా చనిపోవాలనుకున్నాడు వెంకటేశ్వర్లు. తాను చనిపోయిన తరువాత తన ఆస్తి, పెన్షన్, తన కానిస్టేబుల్ ఉద్యోగం కూడా రమాదేవికి వచ్చే విధంగా వీలునామా రాశాడు.
ఆ పనులు పూర్తవ్వగానే భార్య మాధవిని, ఇద్దరు పిల్లలు లాస్య, అభిజ్ఞను తుపాకీతో కాల్చి చంపేశాడు. తరువాత తాను కూడా షూట్ చేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు ఈ విషయం కడపలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రేయసి మాయలో పడి కుటుంబాన్ని పట్టించుకోకపోవడమే పాపం అంటే.. ఏ పాపం తెలియని ఇద్దరు పిల్లల్ని చంపి తన ప్రాణం కూడా తీసుకున్నాడు వెంకటేశ్వర్లు.