Train Accident: ఒడిశాలో జరిగిన రైలు ప్రమాద ఘటనపై రైల్వే శాఖ ప్రాథమిక నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం.. సిగ్నలింగ్ వ్యవస్థలో లోపం వల్ల, రైలు ట్రాకు మారడంతో ఈ ప్రమాదం జరిగింది. సిగ్నల్‌లో జరిగిన పొరపాటు కారణంగా కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ మరో ట్రాకులోకి మారింది. దీంతో ఆ ట్రాకుపై అప్పటికే ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొంది. చెన్నై వెళ్తున్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు సిగ్నల్ లోపం కారణంగా మెయిన్ లైన్ బదులుగా లూప్ లైన్లోకి మారింది.
నిజానికి ఈ రైలును మెయిన్ లైన్లోనే చెన్నై వెళ్లేందుకు అనుమతించారు. కానీ, సిగ్నల్ లోపం కారణంగా లూప్ లైన్లోకి వెళ్లింది. అప్పటికే అదే లూప్ లైన్లో గూడ్స్ రైలు ఆగి ఉంది. ఇది తెలియని రైలు గూడ్స్ రైలు ఆగి ఉన్న ట్రాకులో వెళ్లి, ఆ రైలును ఢీకొంది. దీంతో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ రైలు బోగీలు పక్కనే ఉన్న మరో ట్రాకుపై పడ్డాయి. కొద్దిసేపటి తర్వాత ఆ ట్రాకుపై వెళ్తున్న బెంగళూరు-హావ్‌డా ఎక్స్‌ప్రెస్ రైలు ఈ బోగీలను ఢీకొంది. దీంతో ఈ రైలు బోగీలు కూడా పట్టాలు తప్పి ప్రమాదం జరిగింది. మొదట కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు.. గూడ్స్ రైలును ఢీకొని పట్టాలు తప్పి, వేరే ట్రాకుపై పడిపోయింది. వేరే ట్రాకుపై వచ్చిన మరో రైలు ఈ రైలు బోగీలను ఢీకొంది. నిజానికి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు గూడ్స్ రైలును ఢీకొట్టే ముందు ఆ విషయాన్ని లోకోపైలట్ గుర్తించాడు.
కానీ, అప్పటికే రైలు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ఉండటంతో వేగాన్ని నియంత్రించలేకపోయాడు. రైలు అతివేగంతో ఉండటం వల్ల కొన్ని బోగీలు గూడ్స్ రైలు పైకి ఎక్కేశాయి. దీంతో కొన్ని బోగీలు గాల్లోకి ఎగిరాయి. ఈ కారణంగానే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు నివేదిక తేల్చింది. సిగ్నలింగ్ లోపానికి కారణం ఏంటనేది తెలియాలి. మానవ తప్పిదం వల్లే సిగ్నలింగ్‌లో పొరపాటు జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ విషయంపై రైల్వే అధికారులు ఆరా తీస్తున్నారు. రెండు రైళ్లలో కలిసి 2,300 వరకు రిజర్వ్‌డ్ ప్రయాణికులున్నారు. జనరల్ ప్రయాణికులు కూడా భారీగానే ఉండొచ్చు. అందువల్లే ప్రమాదంలో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది.