Corporate Suicides : 20 ఏళ్లలో వెయ్యి మందిని చంపిన కార్పొరేట్ కాలేజీలు

విద్యయా లభతే జ్ఞానం అంటారు. ఇక్కడ కొంచెం ఈ వాఖ్యాన్ని మార్చి విద్యయా మృత్యు పయనం అని రాయవల్సి వస్తుంది. ఇలా అనడానికి బలమైన కారణం ఉంది. ఒకప్పుడు చదువుకునే స్థాయి నుంచి చదువును కొనే స్థాయికి కార్పోరేట్ శక్తులు మార్చేశాయి. అందులో ప్రధమంగా నారాయణ, శ్రీచైతన్య. నారాయణలో చేర్పిస్తే మంచి ర్యాంకు ఖాయం అనేలా తల్లిదండ్రుల్లో అపోహను సృష్టించేశారు. అలా ఆశపడి చేర్పించామా పిల్లవాడిపై నారాయణ మంత్రం జపించేయాల్సిందే. అంటే జ్ఞానం ఇవ్వాల్సింది అటుంచి ప్రాణాలు కోల్పోయేలా చేస్తున్నారు. గత రెండు దశాబ్థాల నుంచి తాజాగా నార్సింగ్ శ్రీచైతన్య కళాశాలలో చనిపోయిన సాత్విక్ వరకూ ప్రతిఒక్కరి చావు వెనక ఒక దీన కథ ఉంటుంది. ఆ కథ వెనుక ఈ కార్పోరేట్ కాలేజీల హస్తం తప్పకుండా ఉంది.

  • Written By:
  • Updated On - March 1, 2023 / 06:32 PM IST

అవును. ఇది నిజం. గడచిన 20 ఏళ్లలో చైతన్య.. నారాయణ.. సహా మిగిలిన కార్పొరేట్ కాలేజీలు 1000 మంది పిల్లల్ని హత్య చేసాయి. వాళ్లు ఆత్మ హత్య చేసుకుని ఉండవచ్చు కానీ ఇవి కార్పొరేట్ హత్యలే. ఒక్కో స్టూడెంట్ కి 3 లక్షలు వసూలు చేస్తారు.. కనీసం మంచి తిండి కూడా పెట్టరు.. టాయిలెట్స్ ఉండవు.. గొడ్లను బాదినట్లు బాది చదివిస్తారు.. ముక్కున పట్టి ఎగ్జామ్స్ లో కక్కేయమంటారు. తల్లి తండ్రులకి వేరే దారి లేదు. ఇంజినీరింగులు, మెడిసిన్లు చదివించాలంటే ఇదే మార్గం. గవర్నమెంట్ కాలేజీలు సరిపోవు. లక్షలు కట్టి చివరికి పిల్లల్ని చంపుకొనే పరిస్థితి..

అడ్మిషన్లతో మొదలు…

తల్లిదండ్రులు పిల్లలకు మంచి చదువుకోసం చెప్పేందుకు వెళితే అప్లికేషన్ ఫీజుతో ప్రారంభమౌతుంది సినిమా. తరువాత అడ్మిషన్ ఫీజ్, మెటీరియల్ ఫీజ్, అసైన్మెంట్ ఫీజ్, ప్రాక్టికల్ ఫీజ్, హాస్టల్ ఫీజ్ ఇలా ఫీజులతోనే సగం రక్తాన్ని తాగేస్తాయి కాలేజీ యాజమాన్యాలు. ఫీజులు సకాలంలో చెల్లించకుంటే అందరి ముందు వాళ్లను హేళన చేస్తారు. దీంతో వాళ్లు మనోవేదనకు గురవుతారు. అలాంటి పరిస్థితుల్లోనే చదవాలంటూ ఒత్తిడి. డబ్బులు చెల్లించలేని పరిస్థితుల్లో పిల్లవాడు ఉంటే.. పుండుపై కారం చల్లేందుకు ఆకలి లేని సమయంలో ఫుల్ మీల్స్ లాంటి సిలబస్ ను అతని చేతిలో పెడతారు.

అవమానాలు – సందేహాలు జీర్ణించుకోలేని స్థితి:
అప్పటికే కడుపులో సగం బాధను నింపుకున్న కుర్రాడు ఈ చదువు మైండ్ కు ఎక్కక సతమతమౌతూ ఉంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో పరీక్షల పేరిట, హాస్టల్స్ లో చదివించేందుకు నైట్ స్టడీల పేరిట రాత్రి 10గంటల వరకూ కూర్చోబెడతారు. తిరిగి ఉదయాన్నే లేపి చదువుకోమని పంపిస్తారు. అతని ప్రశ్నల సందేహాలకు సమాధానాలకు దొరకవు. గతంలోని అవమానానికి గురైన బాధను కరిగించేందుకు సమయం ఎక్కడిది. ప్రశాంతంగా ఉండేందుకు వాతావరణం ఎక్కడుంది. తల్లిదండ్రులకు చెప్పలేక, టీచర్లకు చెప్పినా అర్థం చేసుకోని పరిస్థితుల నడుమ మనస్సుతో.. మెదడుతో తీవ్రమైన యుద్దాన్ని చేస్తాడు. ఇలాంటి సంఘర్షణల నడుమ ఆత్మహత్యకు పాల్పడతాడు.

sri chaitanya narsing student satwit

చావు వెనుక చాలా మంది హస్తం:
ఈ ఆత్మహత్య వెనుక కారణం ఒక్కరు కాదు చాలామందే ఉంటారు. ఫీజులు కట్టలేని స్థితిలో ఆశతో పెద్దకాలేజీలలో చేరిపించే తల్లిదండ్రుల నుంచి డబ్బు కట్టకపోతే సూటిపోటి మాటలతో అతని మానసిక స్థితిని కృంగదీసే కళాశాల యాజమాన్యం వరకూ అందరికీ పాత్ర ఉంది. అయితే ఇందులో మరికొంత మంది పాత్రదారులు వస్తూ పోతూ ఉంటారు. క్లాస్ రూంలో పాఠాలు చెప్పే టీచర్ నుంచి చదువుకోవాలని టార్చర్ పెట్టే క్లాస్ ఇంఛార్జ్ వరకూ అందరూ ఈ హత్యలో భాగస్వాములుగానే చెప్పాలి.

సరైన కౌన్సిలింగ్ లేక – ధనార్జనే లక్ష్యంగా:
సాధారణంగా ఇంటర్ చదివే విద్యార్థుల వయస్సు 16-18 సంవత్సరాలు ఉంటుంది. వీరి వయసురిత్యా మానసిక పరిపక్వత కూడా చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి విద్యను చెప్పే కళాశాల యాజమాన్యాలు ఒక సరైన పక్రియలో ప్రణాళికా బద్దంగా నిర్వహించాలి. అలా కాదని ధనార్జనే లక్ష్యంగా, మార్కులు, ర్యాంకులే ధ్యేయంగా ఇలా ఒత్తిడికి గురిచేస్తే చివరకు మిగిలేది ర్యాంకు కాదు. ఆత్మహత్యలె మిగులుతాయి. లక్షలకు లక్షలు ఫీజులు దండుకున్నప్పుడు విద్యార్థి మానసిక స్థితి గతులను అంచనా వేయగలగాలి. కోర్స్ ప్రారంభంలోనే అతడు ఈ సబ్జెక్టును హాండిల్ చేయగలడా లేదా అనే విషయాన్ని గమనించగలగాలి. ఒకవేళ తల్లిదండ్రులకు ఆశ ఉండవచ్చు. తమ పిల్లవాడిని మంచి ర్యాంకులో పేపర్లో చూడాలని. కానీ అలాంటి వారికి సైతం ఒక అవగాహన కల్గించేలా కౌన్సిలింగ్ ఇచ్చేందుకు కౌన్సలర్స్ ని ఏర్పాటు చేయాలి.

వ్యాపార వనరుగా విద్య – అందుకే ఇది కార్పోరేట్ హత్య:
పైన తెలిపిన విధంగా ఆలోచించకుండా కేవలం ఆదాయ వనరుగానే విద్యార్థిని చూడటం వల్ల ఇలాంటి దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు ఇంట్లో సూసైడ్ చేసుకునే వారు. తరువాత హాస్టల్స్ లో ఆత్మహత్యలకు పాల్పడేవారు. ఇప్పుడు ఏకంగా సరస్వతీ నిలయమైన తరగతి గదిలోనే బలవన్మరణానికి పాల్పడ్డారంటే ర్యాంకుల పేరుతో కార్పోరేట్ ముసుగులో ఎంతటి దారుణమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారో ఈ కళాశాలలు ఆలోచించాలి. పిల్లవాడి మేధస్సును అంచనా వేసి తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం వల్ల అతడు ర్యాంకరుగా కాకపోయినా ఒక పౌరుడిగా అయినా మనందరి మధ్య తిరగగలుగుతాడు. అలా కాకుండా డబ్బే ప్రపంచం, వ్యాపారమే ప్రదానం అనే ఉద్ధేశ్యంతో కళాశాలలను నడిపితే ఇలాంటి ఆత్మహత్యలకు తప్పకుండా బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇవన్నీ కార్పోరేట్ హత్యలుగా పరిగణించాల్సి ఉంటుంది.

 

 

 

T.V.SRIKAR