Cricket Betting: ఏపీ, విశాఖపట్నంలో భారీ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. నిందితులకు సంబంధించిన రూ.350 కోట్లను పోలీసులు ఫ్రీజ్ చేశారు. విశాఖ వేదికగా అంతర్జాతీయ స్థాయిలో బెట్టింగ్ జరుగుతోంది. దీని ద్వారా వందలాది మంది బాధితులు లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. వారిలో బాధితుతు స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసి వివరాలు వెల్లడించాడు. దీంతో పోలీస్ యంత్రాంగం స్పందించింది. పక్కా ప్లాన్‌తో బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు చేశారు.
నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాల్ని డీసీపీ-1 శ్రీనివాస్ రావు వెల్లడించారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. విశాఖలో అంతర్జాతీయ స్థాయి బెట్టింగ్ జరుగుతోంది. బెట్టింగ్ బాధితుల్లో ఒకడైన ఎర్రా సత్తిబాబు అనే వ్యక్తి ఫిర్యాదుతో సైబర్ పోలీసుల ఆధ్వర్యంలో దర్యాప్తు జరిగింది. ఫిర్యాదు చేసిన బాధితుడు బెట్టింగ్‌లో 8 లక్షల రూపాయల నగదు పోగొట్టుకున్నాడు. సూరిబాబు అనే ప్రధాన బుకీకి నగదు వెళ్తుంది అని గుర్తించారు. ప్రధాన నిందితుడు సూరిబాబు అచ్చుతాపురం ప్రాంతానికి చెందిన వ్యక్తి. దినేష్ అలియాస్ మోను, వాసుదేవరావు ప్రధాన బుకీలుగా గుర్తించారు. కింగ్ పిన్ మోను, వాసుదేవ్, సూరిబాబుతోపాటు 11 మందిని అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచారు. 11 రకాల ఆన్‌లైన్ బెట్టింగ్ సైట్‌లని, యాప్‌లని గుర్తించారు. ఐడీలని పంటర్‌లకి ఇచ్చారు. 63 బ్యాంక్ అకౌంట్లు ఉన్నట్టు గుర్తించిన పోలీసులు వాటిని ఫ్రీజ్ చేసినట్లు తెలిపారు. 36 అకౌంట్స్ నుంచి వచ్చిన డేటా ప్రకారం సుమారుగా రూ.367.62 కోట్ల లావాదేవీలు జరిగినట్టు తేలింది.
ఒక్క మోను అకౌంట్స్ నుంచే రూ.145 కోట్ల ట్రాన్సాక్షన్స్ జరిగింది. బెట్టింగ్ ఉచ్చులో విశాఖ పరిసర ప్రాంతాల్లోని వందలాది మంది అమాయక యువకులు చిక్కుకున్నట్లు పోలీసులు చెప్పారు. అనామక మొబైల్ అప్లికేషన్స్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. కాగా.. అరెస్టైన బెట్టింగ్ రాయుళ్ల కోసం పోలీస్ అధికారులపై విపరీతమైన ఒత్తిళ్లు వస్తున్నట్లు పోలీసులే చెబుతున్నారు. బెట్టింగ్ రాయుల్లను వదిలేయాలని గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన ప్రజా ప్రతినిధులు పలువురు పోలీస్ అధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై సీపీ రవి శంకర్ అయ్యన్నార్ స్వయంగా విచారణ చేస్తున్నారు.