Cyber crime: తస్మాత్ జాగ్రత్త – ఏమరుపాటుగా ఉంటే మీ నగదు మాయం..!

కంపూటర్ ద్వారా మోసాలకు పాల్పడటం ఇప్పుడు పెద్ద ట్రెండ్ గా మారింది. క్రైం అనేది ట్రెండ్ గా మారటం చాలా విషపూరితమైన చర్య. దీని చిక్కుల్లో పడి ప్రాణాలు కోల్పోయిన వారు చాలా మందే ఉన్నారు. ప్రస్తుత కాలంలో పరువు పోతున్న పరిస్థితులు కూడా చాలానే కనిపిస్తున్నాయి. వీటి బారిన పడకుండా ఎలా రక్షణ పొందాలి.. ఎలా జాగ్రత్తపడాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

  • Written By:
  • Updated On - February 23, 2023 / 12:24 PM IST

ఆన్ లైన్ ఈ పదం ఇప్పుడు అందరినోట జపంలా మారిపోయింది. ఎవరి ఫోన్ ఓపెన్ చేసినా మెసెజెస్ ఇన్ బాక్స్లో ఏదో ఒక ఓటీపీ ప్రతిరోజూ ఉండనే ఉంటుంది. ఇక ఆన్లైన్ లావాదేవీలు జరిపే వారి గురించైతే చెప్పనవసరం లేదు. అన్నీ మెసేజ్ లు ఓటీపీలతో దర్శనమిస్తాయి. ఈ వ్యవస్థ మంచిదే అయినప్పటికీ ప్రతి మంచికి ఒక చెడు పుట్టుకొని వస్తుంది అనే నానుడి ఎప్పటి నుంచో ఉంది. అలాగే ఓటీపీ అనేది నగదు లావాదేవీలు సజావుగా జరిపేందుకు ఎంపిక చేసిన ఒక ప్రత్యేకమైన విధానం. దీనిద్వారా లావాదేవీలు జరిపినప్పుడు ఎవరికైతే ఏదైనా వస్తువు కావచ్చు, సమాచారం కావచ్చు అవసరం అవుతుందో వారికి మాత్రమే సదరు సర్వీస్ ప్రొవైడర్ నుంచి అందుతుంది. అప్పుడు వారికి మనం షేర్ చేస్తే మన పని సులభతరం అవుతుంది.

ఓటీపీలనే ఎరగా:

ఈ ఓటీపీలనే పావుగా వాడుకొని సైబర్ నేరగాళ్లు ఆన్లైన్ క్రైం లకు పాల్పడుతున్నారు. దర్జాగా కూర్చున్న చోట నుంచే డబ్బును కాజేస్తున్నారు. దీనికి అవసరమైంది కేవలం సాంకేతిక పరిజ్ఞానం, మాటకారితనం ఉంటే చాలని భావిస్తున్నారు. అదేవిధంగా మోసపోయేవారిని మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. వారే అమాయకులు, అత్యాశాపరులు, అత్యుత్సాహాపరులను ఎరగా చేసుకొని ఇలాంటి వాటికి పాల్పడుతున్నారు. మీకు ఈమూడు లేకపోతే సైబర్ కేటుగాళ్ల బారిన పడే అవకాశం ఉండదు. సైబర్ నేరాలు దాదాపు 12 రకాలు ఉన్నాయి. వీటిలో తరచూ మోసపోయే ఏడింటి గురించే అవగాహన ఉంటుంది. మిగిలిన ఐదు సామాన్యులకు పెద్దగా అవసరం ఉండదు. అవన్నీ పెద్ద పెద్ద కంపెనీలకు సంబంధించిన సెక్యూరిటీలు, కాన్ఫిడెన్షియల్ సమాచారాన్ని తస్కరించడం వంటి వాటికి సంబంధించింది. అందులో పెద్ద పెద్ద కంపెనీలు తగు జాగ్రత్తలు తీసుకుంటాయి.

7 రకాల సైబర్ నేరాలు:

సామాన్యులకు ఎదురయ్యేవి ముఖ్యంగా ఓటీపీలను చెప్పమని బ్యాంకు మేనేజర్ లాగా మాట్లాడటం, మీకు లాటరీ టికెట్ తగిలిందని మాయమాటలు చెప్పడం, ఒక ఆకర్షణీయంగా ఉండే అమ్మాయి ఫోటోని బ్లర్ చేసి లింక్ పంపించి అది ఓపెన్ చేసేలా చేయడం, ఆన్లైన్ వస్తువులు వచ్చాయని ఓటీపీలు చెప్పమని కాల్ చేయడం, క్రెడిట్ కార్డు ఇస్తామని వివరించి సమాచారాన్ని దొంగలించడం, సామాజిక మధ్యమాల్లో ఉండే అకౌంట్లను ఉపయోగించి వారి ఫ్రెండ్స్ పేరు చెప్పి నమ్మించి డబ్బులు అడగడం, మీ ఫోన్ నంబర్ కు లక్కీ డ్రాలో విలువైన వస్తువు తగిలింది వాటికి కొరియర్ ఛార్జీలు ఈ అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేయమని అడగడం. ఇలా చాలా రకాలుగా ఉంటాయి. దీనికి ప్రత్యేకంగా పోలీసు శాఖ క్రైం ఫ్రీ ఇండియా అనే పుస్తకాన్ని కూడా ప్రచురించింది. ఇంకా మెయిల్ ద్వారా హ్యాక్ చేసి మన సమాచారాన్ని తీసుకొని బ్లాక్ మెయిల్ కు పాల్పడి పరువు తీస్తామని బెదిరింపులకు గురిచేయడం కూడా ఒకరకమైన సైబర్ నేరాలక్రిందకే వస్తాయి.

cyber crime types

ఇలా చేస్తే మీ డబ్బులు సేఫ్:

మీకు తెలియని వ్యక్తుల నుంచి ఎలాంటి మెసేజ్ లు వచ్చినా వాటిని వెంటనే ఎపెన్ చేయకుండా సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం వల్ల వెంటనే వీటికి చెక్ పెట్టవచ్చు. మన ఫ్రెండ్స్ పేరుతో వచ్చిన మెసేజ్ లకు కూడా స్పందించకుండా వెంటనే వారికి ఫోన్ చేసి ఇలా మెసేజ్ పంపించారా అని అడిగి సమాచారాన్ని తెలుసుకోవాలి. అంతేకాకుండా మన అకౌంట్లో నుంచి నగదు పొరపాటున డెబిట్ అయ్యిన వెంటనే 1930 ఈ నంబర్ కు కాల్ చేయడం లేదా www.cybercrime.gov.in లో లాగిన్ అయ్యి కంప్లైంట్ రిజిష్టర్ చేయడం వల్ల మీ అకౌంట్ నుంచి కట్ అయిన నగదును సైబర్ గాళ్ల అకౌంట్ లో పడకుండా బ్యాంకు వారు ఫ్రీజ్ లో ఉంచుతారు. తద్వారా మన నగదును తిరిగి పోందే అవకాశం ఉంటుంది. లోన్ యాప్ ద్వారా కూడా కాల్ వచ్చిన నెంబర్ ను పోలీసులకు అందించడం వల్ల ఆ నంబర్ ను బ్లాక్ చేస్తారు.

నిరుద్యోగమే లక్ష్యంగా:

అమ్మాయిలు కూడా ఏవైనా అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చిన నంబర్లను గుర్తించి వారిని బ్లాక్ చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులకు గురిఅవ్వకుండా ఉండేందుకు వీలుంటుంది. ఈ నేరగాళ్లు నిరుద్యోగులను కూడా ఎర వేస్తున్నారు. మనం తరచూ ఆన్లైన్ లో ఉండటం వల్ల మనకు పనిలేదు అనే విషయాన్ని వాడికి మనమే చెప్పిన వాళ్లమౌతాము. తద్వారా మీకు ఉద్యోగాలు ఉన్నాయంటూ ఒక 1000 నుంచి 5000 మధ్య ఖర్చు చేయగలిగితే లక్షల ప్యాకేజీలో ఉద్యోగాలు మీసొంతమని నమ్మబలుకుతున్నారు. కాబట్టి డబ్బు ఎంతదైనా పోలీసులకు ఫిర్యాదు చేయడం తప్పనిసరి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మనం ఇలా కంప్లైంట్ ఇవ్వడం వల్ల వేరొకరు దీని నుంచి రక్షణ పొందగలుగుతారు.

అవగాహనతో అరికట్టవచ్చు: 

ప్రస్తుత కాలంలో ఓటీపీ స్కాంలు ఎక్కువ వినిపిస్తున్నాయి. దీనిపై అప్రమత్తంగా ఉండాలని ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నా సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. రకరకాల పేరుతో ఈ కామర్స్ కంపెనీలు రావడం ఆఫర్ల వర్షం కురిపించడం వల్ల వాటికి ఆకర్షితులై సైబర్ వలలో చిక్కుతున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితుల నెంబర్ల ద్వారా కూడా మెసేజ్ చేసి ఓటీపీని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎలాంటి వారైనప్పటికీ ఓటీపీని షేర్ చేయవద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఇది చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అని తెలియజేస్తున్నారు. అందుకే ఆన్ లైన్ లావాదేవీలు జరిపేటప్పుడు క్యాష్ ఆన్ డెలివరీ వంటివి సెలెక్ట్ చేసుకోవడం ఉత్తమం. అదే క్రమంలో ఆన్ లైన్ లావాదేవీలు జరిపేటప్పుడు సెక్యూరిటీ ఉన్న ఫ్రాడ్ ప్రొటెక్షన్ క్రెడిట్ కార్డులు వాడాలి. వీటిని ఉపయోగించి సెక్యూర్ పేమెంట్స్ చేయాలి. ఎప్పటికప్పుడు ఆన్లైన్ షాపింగ్ ఆఫర్ల లాగానే సైబర్ నేరాల గురించి కూడా తెలుసుకోవాలి. అప్పుడే వీటి భారిన పడకుండా జాగ్రత్తపడవచ్చు.

 

 

 

T.V.SRIKAR