Daam Malware: ఆండ్రాయిడ్ ఫోన్లు జాగ్రత్త.. పొంచిఉన్న మరో మాల్‌వేర్ ముప్పు!

మొబైల్ వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని, అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయకూడదని సూచించింది. ది ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ సూచనల ప్రకారం.. దామ్ మాల్‌వేర్ ఆండ్రాయిడ్ ఫోన్లలో వైరస్ చొరబడే అవకాశం ఉంది.

  • Written By:
  • Publish Date - May 27, 2023 / 04:46 PM IST

Daam Malware: స్మార్ట్ ఫోన్ యూజర్లూ.. జాగ్రత్త..! మీ ఫోన్లకు వైరస్ ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దామ్ అనే మాల్‌వేర్‌తో ముప్పు పొంచి ఉందని, ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం కూడా హెచ్చరికలు జారీ చేసింది. జాతీయ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ పలు సూచనలు చేసింది. మొబైల్ వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని, అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయకూడదని సూచించింది.

ది ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ సూచనల ప్రకారం.. దామ్ మాల్‌వేర్ ఆండ్రాయిడ్ ఫోన్లలో వైరస్ చొరబడే అవకాశం ఉంది. వైరస్ సోకిందంటే ఫోన్లలోని సమాచారం మొత్తం హ్యాకర్ల చేతికి వెళ్లిపోతుంది. కాల్ రికార్డులు, కాంటాక్టులు, హిస్టరీ, కెమెరా.. అన్నీ హ్యాకర్ల అధీనంలో ఉంటాయి. మొబైల్ ఫోన్లలో ఉన్న యాంటీ వైరస్ సెక్యూరిటీ ప్రోగ్రామ్స్, యాప్స్‌ను కూడా ఇది తప్పించుకోగలదు. దీనికి అనుగుణంగా రాన్సమ్‌వేర్ అభివృద్ధి చేసుకుని, ఫోన్లలోకి చొరబడుతుంది. మొబైల్ ఫోన్లలో ఒకసారి దామ్ మాల్‌వేర్ చొరబడిన తర్వాత మొబైల్ సెక్యూరిటీ వ్యవస్థను కూడా తప్పించుకుంటుంది. డేటాను సేకరించేందుకు ప్రయత్నిస్తుంది. ఫోన్లలో బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్ చేయకుండా ఆగిపోతుంది. కాల్ డేటా సైతం హ్యాకింగ్‌కు గురవుతుంది. ఇలా మొబైల్ ఫోన్ల నుంచి సేకరించిన సమాచారాన్ని ఎన్‌క్రిప్ట్ చేసుకుని, ఒరిజినల్ డేటాను డిలీట్ చేస్తుంది. దీంతో మొబైల్ డేటా డిలీట్ అయ్యే ఛాన్స్ ఉంది.

దామ్ మాల్‌వేర్ బారిన పడకూడదనుకుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని చెబుతున్నారు నిపుణులు. ప్లే స్టోర్ లేదా ఐస్టోర్ వంటి అధికారిక యాప్ స్టోర్స్ నుంచే యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇతర సోర్సెస్ నుంచి యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోకూడదు. కొత్త యాప్స్ డౌన్‌లోడ్ చేసుకునే ముందు వాటి రివ్యూస్ కూడా చూడాలి. అనవసరమైన పర్మిషన్స్ ఇవ్వకూడదు. ఎప్పటికప్పుడు యాప్స్, మొబైల్ అప్‌డేట్ చేసుకుంటూ ఉండాలి. అన్ ట్రస్టెడ్ బ్రౌజర్స్ వాడకూడదు. తెలియని సోర్సెస్ నుంచి వచ్చే, అనుమానాస్పద లింక్స్, మెసేజెస్‌పై క్లిక్ చేయకూడదు. సరైన వెబ్‌సైట్ డొమైన్స్ సూచించే యూఆర్ఎల్స్ పై మాత్రమే క్లిక్ చేయాలి. సేఫ్ బ్రౌజింగ్ టూల్స్, ఫిల్టరింగ్ టూల్స్ వాడాలి. సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసేముందు ఒకసారి చెక్ చేసుకోవాలి. ఓటీపీలు వంటివి ఎవరికిపడితే వాళ్లకు చెప్పకూడదు.