కోల్‌కతా హత్యాచార ఘటనతో పాటు బద్లాపూర్ దారుణం.. ఇప్పుడు దేశాన్ని ఊపేస్తోంది. ఈ రెండు కేసుల్లో శిక్షలు.. కామాంధుల వెన్నులో వణుకు పుట్టేలా ఉండాలంటూ.. దేశవ్యాప్తంగా డిమాండ్లు వినిపిస్తున్నాయ్. బద్లాపూర్ మూడు, నాలుగేళ్ల చిన్నారి బాలికలపై జరిగిన ఘోరం.. మహారాష్ట్రతో పాటు దేశాన్ని కదిలించింది. స్కూల్ టాయిలెట్‌లో ఒక స్వీపర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై ఆందోళనలతో బద్లాపుర్ ప్రాంతం స్తంభించింది. ఈ కేసు విచారణకు ప్రముఖ సీనియర్ న్యాయవాది, పద్మశ్రీ పురస్కార గ్రహీత ఉజ్వల్ నికమ్‌ను ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ప్రభుత్వం నియమించింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎన్నో కేసుల్ని వాదించిన అనుభవం ఆయన సొంతం. 1993 ముంబై సీరియల్ బ్లాస్ట్, టీ సిరీస్ మ్యూజిక్ సంస్థ అధినేత గుల్షన్ కుమార్ హత్య కేసు… 2008 ముంబై దాడుల కేసుల్లో నిందితులను కటకటాల్లోకి పంపడం వెనక ఉజ్వల్ నికమ్ కృషి ఉంది. 2008 ముంబై దాడుల కేసులో ఆయన రిపోర్ట్ చేసిన వివరాలతోనే.. అజ్మల్ కసబ్‌కు ఉరిశిక్ష పడింది. పూనమ్ తండ్రి ప్రమోద్ మహాజన్ హత్య కేసును ఆయనే వాదించారు. 2006లో కుటుంబ కలహాల కారణంగా తన సోదరుడు ప్రవీణ్ చేతితో ప్రమోద్ ప్రాణాలు కోల్పోయారు.
2007లో ప్రవీణ్‌కు న్యాయస్థానం జీవితఖైదు విధించింది. 2013 ముంబయి గ్యాంగ్ రేప్ కేసు, 2016 కోపర్దీ సామూహిక అత్యాచారం, హత్య కేసుల్లో ప్రత్యేక ప్రాసిక్యూటర్‌గా పని చేశారు. ఆయన విశేష సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం 2016లో పద్మశ్రీతో సత్కరించింది.ఇప్పుడు బద్లాపూర్ కేసు కూడా ఆయన చేతికే వెళ్లింది. దీంతో కామాంధుడు తప్పించుకునే అవకాశమే లేదు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. ఇద్దరు బాలికలు మూత్రవిసర్జనకు వెళ్లిన టైంలో.. టాయిలెట్ శుభ్రం చేసే వంకతో వారి దగ్గరకు వెళ్లి స్వీపర్ లైంగిక దాడి చేశాడు. అంతర్గత అవయవాల దగ్గర నొప్పిగా ఉందని ఒక బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పాఠశాలకు వెళ్లడానికే భయపడిపోతున్న మరో బాలికను డాక్టర్ల దగ్గరకు తీసుకెళ్లినప్పుడు ఆ చిన్నారిపైనా ఇలాంటి దారుణం జరిగినట్లు తేలింది. ఈ కేసు నమోదు చేసే విషయంలో తొలుత పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని వార్తలు రావడం తీవ్ర ఆగ్రహానికి కారణమైంది.