Delhi Yamuna River: రాజధాని ఢిల్లీలో వరద ఉగ్రరూపం దాలుస్తోంది. భారీవర్షాల కారణంగా యమునా నది ప్రమాదకర స్థాయి దాటి ప్రవహిస్తోంది. ఢిల్లీలోని చాలా ప్రాంతాలు ఇప్పటికే జలమయం కాగా.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటిని కూడా వరదలు ముంచెత్తాయి. ఇక అటు ముంపు ప్రాంతాల్లో జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అటు యమునా నది వరదలో ఢిల్లీ నగరం జలదిగ్బంధం అయింది.
భారీ వర్షాల కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో యమునా నది ప్రమాదస్థాయి దాటి ప్రవహిస్తోంది. యుమునా నదికి ఇంత పెద్ద ఎత్తున వరద రావడం ఇదే తొలిసారి. 1978లో యుమునా నదికి వరదలొచ్చాయి. అయితే, దానితో పోలిస్తే ఇప్పటివరకూ ఇదే అత్యధికం. 1978లో యుమునా నదిలో అత్యధికంగా 207.49 మీటర్ల వరకూ వరద ప్రవహించింది. ఐతే ఈసారి మాత్రం ఏకంగా 208.46 మీటర్లు దాటేసింది. గురువారం సాయంత్రం నాటికి యుమునా నదిలో నీటి మట్టం మరింత పెరిగి 210 మీటర్లకు చేరుకోవచ్చని అంచనా. దీంతో కేంద్ర జల సంఘం ఎమర్జెన్సీ ప్రకటించింది. యుమునా నది ఉగ్రరూపం దాల్చడంతో ఢిల్లీలోని చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి.
రోడ్లపై నీళ్లు చేరుకున్నాయి. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. రాజ్‌ఘాట్ నుంచి సెక్రటేరియట్ వెళ్లే రోడ్డు పూర్తిగా నీటితో నిండిపోయింది. సెక్రటేరియట్ క్యాంపస్‌లోనే సీఎం అరవింద్ కేజ్రీవాల్, రాష్ట్ర మంత్రులు, సీనియర్ అధికారుల ఇళ్లు ఉండగా.. అవి కూడా వరద నీటిలో మునిగిపోయాయి. కేజ్రీవాల్ ఇంటిని భారీగా వరద చుట్టుముట్టేసింది. యమునా నది ఉగ్రరూపంతో ఢిల్లీలోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. ఢిల్లీ అసెంబ్లీ కూడా వరద నీటిలో మునిగింది. సివిల్ లైన్స్ ప్రాంతంలోని రింగ్ రోడ్‌కు వరద నీరు చేరింది. కశ్మీరీ గేట్ ప్రాంతంలో, లాల్ ఖిలా ప్రాంతంలో వరద నీరు ప్రవహిస్తోంది. యమనా నది మహోగ్రరూపం కారణంగా స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
స్కూళ్లు, కళాశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. యుమునా నది వరద ప్రవాహం పెరగడంతో వజీరాబాద్, చంద్రవాల్, ఓఖ్లాలోని వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లను మూసివేశారు. దీంతో ఢిల్లీలోని చాలా ప్రాంతాలకు మంచి నీటి కొరత ఏర్పడనుంది. హర్యానాలోని హత్నికుడ్ బ్యారేజ్ నుంచి నీటిని వదలడంతో ఢిల్లీకి ఈ పరిస్థితి తలెత్తింది.