Haryana Nuh Violence: హరి‍యాణా ఘర్షణలకు వ్యతిరేకంగా ఢిల్లీలో వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ ర్యాలీలు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ఘర్షణలకు వ్యతిరేకంగా ఢిల్లీలో బుధవారం నుంచి వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు చేపట్టారు. ఈ ర్యాలీల వల్ల ఢిల్లీలో కూడా శాంతి భద్రతలు క్షీణించే అవకాశాలున్నాయని, వీటిని నిలిపివేయాలని కోరుతూ.. సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.

  • Written By:
  • Publish Date - August 3, 2023 / 10:31 AM IST

Haryana Nuh Violence: హరియణాలో తలెత్తిన ఘర్షణలకు వ్యతిరేకంగా ఢిల్లీలో వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ చేపట్టిన ర్యాలీలను అడ్డుకోబోమని సుప్రీంకోర్టు స్పష‌్టం చేసింది. ర్యాలీల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనల జరగకుండా చూడాలని ప్రభుత్వాల్ని ఆదేశించింది. ఇటీవల హరియాణాలోని నుహ్ జిల్లాలో వీహెచ్‌పీ చేపట్టిన ర్యాలీని అడ్డుకునేందుకు మరోవర్గం వాళ్లు రాళ్లు రువ్వారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణలు తలెత్తాయి.

ఇవి పూర్తి మత ఘర్షణలుగా మారి.. హరియాణాలోని అనేక ప్రాంతాలకు వ్యాపించాయి. ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఘర్షణలు తలెత్తాయి. ఈ ఘర్షణల్లో ఆరుగురు మరణించారు. ఘర్షణల్ని అదుపు చేసేందుకు పోలీసులు, భద్రతా దళాలు చర్యలు చేపట్టాయి. ఇంటర్నెట్ నిలిపివేత, అదనపు భద్రతా దళాల మోహరింపు, కర్ఫ్యూతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇతర ప్రాంతాలకు ఇంకా ఘర్షణలు వ్యాపించకుండా చూస్తున్నారు. ఈ ఘర్షణలకు వ్యతిరేకంగా ఢిల్లీలో బుధవారం నుంచి వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు చేపట్టారు. ఈ ర్యాలీల వల్ల ఢిల్లీలో కూడా శాంతి భద్రతలు క్షీణించే అవకాశాలున్నాయని, వీటిని నిలిపివేయాలని కోరుతూ.. సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీ భట్టీ ఆధ్వర్యంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ ర్యాలీలను తాము అడ్డుకోబోమని సుప్రీంకోర్టు చెప్పింది.

అయితే, నేతలు విద్వేష ప్రసంగాలు చేయకుండా చూడాలని ప్రభుత్వానికి సూచించింది. హరియాణా, ఢిల్లీ, యూపీ ప్రభుత్వాలకు ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది. ర్యాలీలు జరిగే ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, అదనపు బలగాల మోహరింపు, వీడియో రికార్డింగ్ వంటివి చేపట్టాలని సూచించింది. సీసీ కెమెరా, వీడియో రికార్డ్ దృశ్యాల్ని భద్రపర్చాలని చెప్పింది. విద్వేష ప్రసంగాలు చేస్తే.. ఎవరో ఫిర్యాదు చేసే వరకు చూడకుండా వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అదనపు పోలీసుల్ని, పారా మిలిటరీ బలగాల్ని రంగంలోకి దింపాలని, ఎలాంటి ఆస్తి నష్టం కలగకుండా, విధ్వంసం, హింస జరగకుండా చూడాలని సూచించింది.

ఏ మతాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని నిర్వాహకుల్ని ఆదేశించింది. నిరంతరం అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ సభ్యులు మరిన్ని ర్యాలీలకు సిద్ధమయ్యారు. బుధవారం ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో హనుమాన్ చాలీసా పఠిస్తూ.. ర్యాలీ నిర్వహించారు. హరియాణాలో మత ఘర్షణలకు సంబంధించి ఇప్పటివరకు 116 మందిని ప్రభుత్వం అరెస్టు చేసినట్లు సీఎం ఖట్టార్ తెలిపారు.