Fake Video Calls: ముఖాలు మార్చి వీడియో కాల్‌.. జాగ్రత్త.. లేదంటే బతుకు బస్టాండే..

ఎవరో పేరు మీద ఫేక్ ఐడీ క్రియేట్ చేసి.. వాళ్ల ఫొటోలు ఉపయోగించి.. అర్జెంట్ అంటూ మెసేజ్ పెట్టి డబ్బులు అడిగేవారు ఇన్నాళ్లు. సోషల్‌ మీడియాలో ఇదో దందా అని తెలిసి అంతా అలర్ట్ అయ్యారు. ఇలాంటి పప్పులు ఉడకకపోయే సరికి.. ఇప్పుడు కేటుగాళ్లు కొత్త దారులు వెతుక్కుంటున్నారు.

  • Written By:
  • Publish Date - July 29, 2023 / 07:50 PM IST

వీడియో కాల్స్ చేస్తూ మరీ.. బురిడీ కొట్టిస్తున్నారు. దీనికోసం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌ వాడుకుంటున్నారు. దీనికి సంబంధించి హైదరాబాద్‌ పోలీసులు ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు. దీంతో ఈ దందా మీద కొత్త చర్చ మొదలైంది. బాగా తెలిసిన వ్యక్తి.. ఓ కొత్త నెంబర్ నుంచి వీడియో కాల్ వస్తే జాగ్రత్తగా ఉండాలని.. ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని.. వాళ్లేనా కాదా నిర్దారించుకున్న తర్వాతే డబ్బులు పంపించడంలాంటివి చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇప్పుడు మార్కెట్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాయ నడుస్తోంది. దీన్ని వాడుకుని కొందరు కేటుగాళ్లు మోసాలు చేస్తున్నారు.

ఇప్పటివరకు సోషల్ మీడియాల్లో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి మెస్సేజ్‌లు, కాల్స్ చేసి డబ్బులు అడిగిన సైబర్ మోసగాళ్లు.. ఇప్పుడు డీప్ ఫేక్ ఏఐ టెక్నాలజీని ఉపయోగించి మరో కొత్త మార్గం ఎంచుకున్నారు. ఈ టెక్నాలజీతో.. మనకు తెలిసిన వాళ్ల ముఖాలను ఏమాత్రం అనుమానం రాకుండా క్రియేట్ చేసి.. కొత్త నెంబర్ల నుంచి వీడియో కాల్స్ చేసి.. అర్జెంట్ అంటూ డబ్బులు అడుతున్నారు. వీడియో కాల్‌లో డైరెక్టుగా మనిషే కన్పిస్తున్నప్పుడు ఇందులో మోసం ఏముందని నమ్ముతున్న చాలా మంది.. డబ్బులు వేసి.. ఈజీగా మోసపోతున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఇలానే మోసపోయారు కూడా ! ఇలాంటి మోసాల నుంచి జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. దీనికి సంబంధించి వీడియో రిలీజ్ చేశారు.