Manipur violence: జాతుల మధ్య వైరంతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన మరువక ముందే మరో అమానవీయ ఘటన వెలుగు చూసింది. స్వాతంత్ర్య సమరయోధుడి భార్యను ఒక వర్గానికి చెందిన అల్లరిమూకల గుంపు సజీవదహనం చేసింది. కాక్చింగ్ జిల్లా సెరో గ్రామంలో మే 28న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
స్వాతంత్య్ర సమరయోధుడు ఎస్ చురాచాంద్ సింగ్ భార్య సోరోకైబామ్ ఇబెటోంబి అనే 80 ఏళ్ల వృద్ధ మహిళలను దుండగులు సజీవ దహనం చేశారు. మే 28 తెల్లవారుఝామున ఈ గ్రామంలో భారీ హింస చోటు చేసుకుంది. ఒక వర్గం, మరో వర్గంపై దాడి చేసింది. కాల్పులు కూడా జరిగాయి. ఈ సమయంలో ఇటెబోంబి ఇంట్లో ఉండగా, అటువైపు వెళ్లిన దుండగులు ఆమెను ఇంట్లోనే ఉంచి తలుపు వేసి, బయట గడియ పెట్టారు. అనంతరం ఆ ఇంటికి నిప్పుపెట్టారు. ఈ ఘటనలో ఇంటితోపాటు ఇబెటోంబి సజీవ దహనమైపోయింది. కుటుంబ సభ్యులు ఇది గమనించి వచ్చేలోపే పూర్తిగా ఇల్లు దహనమైపోయిందని ఆమె మనవడు ప్రేమ్ కాంత చెప్పాడు. అప్పుడు తనపై కూడా దుండగులు దాడికి యత్నించారని, కానీ, ఎలాగోలా తప్పించుకున్నానని అతడు వివరించాడు. తనపై కాల్పులు జరిపినట్లు, బుల్లెట్లు తన చేతిలోకి, కాలులోకి దూసుకెళ్లినట్లు చెప్పాడు.
ప్రాణాపాయం నుంచి బయటపడ్డట్లు వెల్లడించాడు. దుండగుల రాకను గమనించిన ఇబెటోంబి తమను అక్కడ్నుంచి వెళ్లిపొమ్మని చెప్పిందని, కానీ, తను మాత్రం వారి చేతిలో బలైపోయిందని ప్రేమకాంత ఆవేదన వ్యక్తం చేశాడు. సజీవదహనమైన ఇబెటోంబి అస్థికలు ఇంకా అక్కడే పడి ఉన్నాయని ప్రేమకాంత తెలిపారు. స్థానికులు తమ ప్రాణాలు కాపాడుకునేందుకు ఇక్కడి నుంచి పారిపోయారు. అప్పటి నుంచి ఇటువైపు రావడానికి కూడా జంకుతున్నారు. పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారడం, ఇంకా ఆందోళనకరంగా ఉండటంతో స్థానికులు ఎవరూ తమ గ్రామాల వైపు చూడటం లేదు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సురక్షిత శిబిరాల్లోనే ఇంకా చాలా మంది తలదాచుకుంటున్నారు. ఇబెటోంబి భర్త చురాచాంద్ సింగ్.. గతంలో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ నుంచి సత్కారం కూడా అందుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటన కూడా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
మణిపూర్‌లో ఎలాంటి హింస జరిగిందో చెప్పేందుకు ఇద్దరు మహిళల నగ్న ఊరేగింపు, ఇబెటోంబి సజీవ దహనం వంటి ఘటనలు సాక్ష్యాలు. ఈ ఘటన జరిగిన సెరో గ్రామం మణిపూర్ రాజధాని ఇంఫాల్‌కు 45 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఒకప్పుడు ఈ గ్రామం చాలా అందంగా ఉండేది. స్థానిక సంస్కృతి ప్రతిబింబించేది. కానీ, ఇప్పుడు ఈ ఊరు చాలా వరకు ధ్వంసమైంది. అనేక ఇండ్లు తగలబడిపోయాయి. ఇండ్లపై బుల్లెట్ గుర్తులు కనిపిస్తున్నాయి. కుకీ-మైతేయి తెగ ఘర్షణల్లో చాలా వరకు ధ్వంసమైన గ్రామాల్లో ఇదీ ఒకటి.