ఇది కేవలం ఒక్క రాష్ట్రానికో ఒక ప్రాంతానికో కాదు దేశం మొత్తం విస్తరించేలా ఉంది. సాధారణంగా పసిపిల్లలు అంటే సాక్షాత్తు పరమేశ్వరుని స్వరూపం అంటారు. ఆ పరమేశ్వరునిపై ఉన్నంత భక్తిని శ్రద్ద రూపంలో పిల్లలపై ఒక్కశాతం పెట్టినా పురిటిలోనే పిల్లలు చనిపోయే ఘటనలను నివారించవచ్చు. ఒకవైపు మాకు పిల్లలు పుట్టడంలేదో.. మొర్రో అని ఆవేదన వ్యక్తం చేస్తున్నవారు ఉన్నారు. మరో వైపు పిల్లలు కనలేకున్నా సంతాన సాఫల్య కేంద్రాలను సంప్రదించి లక్షలు వెచ్చించి పిల్లలను పొందుతున్నారు. అలాంటిది ఇక్కడ అవేవీ లేకున్నా పిల్లలు పుడుతుంటే వారికి విలువ తెలీయడం లేదా లేక ఆసుపత్రి నిర్వాహకుల నిర్లక్ష‌్యమే కారణమా.. తెలియాలి.
తెలుగు రాష్ట్రాల్లోని సంఘటనలు:
ఆంధ్రప్రదేశ్లో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్థ్యలోపం వల్ల ఎలుకలు ఏకంగా పసిపిల్లలు ఉంటున్న వార్డులోనే తిరిగి పుట్టిన బిడ్డను కొరికి కొరికి తీవ్రగాయాలు చేసి చంపేశాయి. దీనిపై అధికారులు తూతూ మంత్రంగా అప్పటికప్పుడు సహాయక చర్యలు జరిపి చేతులు దులుపుకున్నారు. ఇక్కడ మరో విచిత్రం ఏమిటంటే పెద్దగా పేరుమోసిన ఆసుపత్రులను నిర్వహిస్తున్న వారే వైద్యశాఖా మంత్రులుగా బాధ్యతలు చేపట్టినప్పటికీ ఇలాంటి సంఘటనలు జరగడం చాలా హేయమైన చర్యగా చెప్పాలి. అలాగే మరికొన్ని రోజులకు ఆసుపత్రిలో ఆపరేషన్ చేస్తున్న క్రమంలో పాములు లోపలికి వచ్చాయి. దీంతో వైద్యులు భయభ్రాంతులకు గురై శస్త్రచికిత్స మధ్యలో ఆపేశారు. ఇక తెలంగాణ విషయానికొస్తే విషపూరితమైన జంతువులు సంచరించకున్నప్పటికీ ఆసుపత్రి యాజమాన్యమే జంతువుల్లా ప్రవర్తించాయి. కేవలం రూ.100 కోసం హైదరాబాదు నిలోఫర్ ఆస్పత్రిలో ఒక అట్టెండర్ లంచంగా పుచ్చుకొని వెంటిలేటర్ మార్చేశాడు. దీంతో మూడేళ్ళ పసి ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయింది. ఇదంతా ఒకరమైతే సరైన సమయానికి పురుడుపోయక ఆలస్యంగా డాక్టర్లు ట్రీట్మెంట్ చేసిన ఘాతుకాలు చాలా ఉన్నాయి. దీని కారణంగా ప్రపంచ వెలుగును చూడకుండానే గర్భాంధకారంలో పసివాళ్ల ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఇదంతా మన తెలుగు రాష్ల్రాల్లో చోటు చేసుకున్న దుర్ఘటనలు.
దేశంలోని పరిస్థితులు:
ఇక ఆజాదీకా అమృత్ మహోత్సవ్ అంటూ 75 వసంతాలను అట్టహాసంగా జరుపుకున్నాం. అలాంటి దేశంలో వైద్య పరిస్థితి ఎలా ఉందో ఒక లుక్ వేద్దాం. అదికూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లోని స్థితిగతులను మాత్రమే వివరిస్తున్నాం. ఎందుకంటే ప్రైవేట్ ఆసుపత్రుల్లో మినిమం డబ్బున్న వారు వెళతారు కనుక వారికి మెరుగైన సేవలు అందుబాటులో ఉంటాయి. తాజాగా రాజస్థాన్ లోని సిరోహి జిల్లా వైద్యశాలలో చికిత్స కోసం ఒక వ్యక్తి ఆసుపత్రిలో చేరాడు. ఆయనకు తోడుగా తన భార్య, నెల వయసున్న బిడ్డతో కలిసి రాత్రి అక్కడే వార్డులో బస చేశారు. అర్ధరాత్రి సమయంలో సెక్యూరిటీ, వార్డు బాయ్స్ ఎవరూ లేకపోడంతో రెండు వీధికుక్కలు వార్డులోకి వచ్చాయి. తల్లి పక్కనే నిద్రపోతున్న పసిబిడ్డను నోట కరుచుకొని వెళ్లి పొట్టకు తీవ్రమైన గాయాలు చేశాయి. దీంతో బాబు చనిపోయాడు. ఆ తల్లి హృదయరోధన అంతా ఇంతా కాదు. భర్తకు మెరుగైన వైద్యం కోసం ఆసుత్రికి వస్తే బిడ్డను కోల్పోవల్సి వచ్చిదని తీవ్ర మనస్తాపానికి గురైయ్యారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ఆసుపత్రి సీసీ టివీ లో రికార్డ్ అయ్యాయి. ఈ సంఘటన జరుగుతున్న టైంలో ఆసుపత్రి సిబ్బంది కూడా వార్డులో లేకపోవడం గమనించదగ్గ అంశం.
ఇలా దేశంలో వెలుగులోకి వచ్చే కొన్ని సంఘటనలు మాత్రమే తెలుసుకున్నాం. ఇంకా తెరవెనుక బయటకురాని ఉదంతాలు చాలనే ఉంటాయి. దీనికి ప్రభుత్వాలు, ఆసుపత్రి యాజమాన్యాలు, వైద్యాధికారులే బాధ్యత వహించాలి. కఠినమైన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో చాలా దారుణమైన పరిణామాలు చవిచూడాల్సి వస్తుంది. అశ్రద్ద చూపి నిండుప్రాణాన్ని బలిపెట్టే బదులు జాగ్రత్తగా పర్యవేక్షిస్తూ స్త్రీ, శిశు సంక్షేమాన్ని భుజానికెత్తుకుంటే ఇలాంటి దారుణాలు పునరావృతం కావని చెప్పవచ్చు. పరిస్థితి చేజారి పోయాక సారీ చెబితే, బాధ పడితే, కుటుంబంపై జాలి చూపిస్తే పోయిన బిడ్డ ప్రాణం తిరిగిరాదు కదా. ఈ విషయాన్ని సున్నితంగా గమనించి తగు ఏర్పట్లు చేసుకోవాలి. అప్పుడే ఆరోగ్యకరమైన వాతావరణాన్ని భావితరాలకు అందించగలం.
T.V.SRIKAR