Hen Issue At Police Station: నా కోడిని చంపేశారు.. న్యాయం చేయండి.. పోలీస్‌స్టేషన్‌లో కోడి పంచాయితీ..

ఇద్దరు తిట్టుకోవడానికి.. రెండు వర్గాలు కొట్టుకోవడానికి పెద్దగా కారణాల అవసరం లేదు. గడ్డిపోచ కోసం కూడా యుద్ధాలు జరుగుతాయ్. ఇలాంటి ఘటనే జరిగింది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో.

  • Written By:
  • Publish Date - May 26, 2023 / 05:33 PM IST

తన కోడిని చంపేశారని.. న్యాయంచేయాలి అంటూ ఓ వ్యక్తి పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయించాడు.. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తను ఎంతో అపురూపంగా పెంచుకుంటున్న కోడిని చంపేశారంటూ ముబ్బ షీర్ అనే వ్యక్తి.. అదే ప్రాంతానికి చెందిన సాబిర్‌తో గొడవకు దిగారు. ఇద్దరి పంచాయితీ కాస్త.. రెండు వర్గాల కొట్లాటగా మారింది. దీంతో ఇద్దరిని స్టేషన్‌కు పిలిపించారు పోలీసులు. టర్కీ కోడిని కొనుగోలు చేసి అల్లారుముద్దుగా పెంచుకుంటున్నానని.. ఐతే సాబిర్‌ దాన్ని కట్టెతో కొట్టి చంపాడని ముబ్బషీర్‌ బోరున విలపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తానేమీ చేయలేదని సాబిర్‌ ముందు బుకాయించాడు. ఐతే సీఐ గట్టిగా అడిగే సరికి.. కట్టెతో మెల్లిగా కొట్టానని.. కొద్దిదూరం బాగానే పరుగెత్తిన కోడి.. తర్వాత కుప్పకూలిందని వివరించాడు. ఇంతలో సాబిర్‌ కొడుకు అక్కడికి వచ్చి.. తన తండ్రి వల్ల తప్పు జరిగిందని.. చనిపోయిన కోడికి పరిహారం ఇస్తానని చెప్పాడు. కోడి ఏడుకిలోల బరువు ఉంటుందని.. 7 వేల పరిహారం ఇవ్వాలని బాధితుడు ముబ్బషీర్‌ పట్టుబట్టాడు. చివరికి వెయ్యి పరిహారం ఇచ్చేందుకు రాజీ కుదరడంతో పంచాయితీ ముగిసింది. అప్పుడే కంప్లైట్‌ చేయడానికి పీఎస్‌కు వచ్చిన మిగతా వ్యక్తులు.. ఈ కోడి పంచాయితీ తెలుసుకొని కడుపు పగిలేలా నవ్వుకున్నారు. ఈ కోడి లొల్లి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.