Hyderabad: సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఉగ్రవాదులు.. హైదరాబాద్ బి అలెర్ట్!

ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో మళ్లీ చిచ్చు పెట్టడానికి ఉగ్రవాదులు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉన్నారు. హైదరాబాద్‌లో తలదాచుకున్న రాడికల్ ఇస్లామిక్ కార్యకర్తలను ఏటీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో అరెస్టైన వారిలో భోపాల్‌కు చెందిన పదకొండు మంది ఉండగా.. హైదరాబాద్‌కు చెందిన ఐదుగురు ఉన్నట్లు సమాచారం.

Hyderabad: హైదరాబాద్‌లో పేలుళ్లకు కుట్ర పన్నిన పదహారు మంది అరెస్ట్ కావడం.. అందులో ఐదుగురు హైదరాబాదీలే ఉండటంతో.. నగరం మరోసారి ఉలిక్కి పడింది. ఇప్పటికీ దిల్‌సుఖ్‌నగర్, మక్కా మసీద్, గోకుల్ చాట్, లుంబినీ పార్క్ పేలుళ్లను హైదరాబాదీలు పూర్తిగా మర్చిపోలేదు. అంతలోనే మరోసారి హైదరాబాద్‌లో మరోసారి ఉగ్రదాడులకు ప్లాన్ చేసినట్లు వెల్లడికావడం ఆందోళన కలిగిస్తోంది.ఈ సమాచారంతో మధ్యప్రదేశ్, తెలంగాణ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ఇందులో భాగంగా సుమారు 16 మందిని యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అరెస్ట్ చేసింది.
ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో మళ్లీ చిచ్చు పెట్టడానికి ఉగ్రవాదులు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉన్నారు. హైదరాబాద్‌లో తలదాచుకున్న రాడికల్ ఇస్లామిక్ కార్యకర్తలను ఏటీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో అరెస్టైన వారిలో భోపాల్‌కు చెందిన పదకొండు మంది ఉండగా.. హైదరాబాద్‌కు చెందిన ఐదుగురు ఉన్నట్లు సమాచారం. అరెస్ట్ చేసిన వారి నుంచి ఫోన్లు, ల్యాప్ టాప్, కత్తులతో పాటు జిహాదీ సాహిత్యాన్ని సీజ్ చేశారు. 18 నెలలుగా రాడికల్ ఇష్లామ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లుగా గుర్తించారు.
‌హైదరాబాద్‌లో కొన్ని నెలల ముందు కూడా ఉగ్రదాడికి సంబంధించి షాకింగ్ నిజాలు వెల్లడయ్యాయి. దసరా పండుగకి సైదాబాద్ లో నిర్వహించే రావణ దహనాన్ని టార్గెట్‌గా పెట్టుకున్న సంచలన నిజం బయటకు వచ్చింది. అక్కడ విధ్వంసం సృష్టిస్తే ప్రాణ నష్టం భారీగా ఉంటుందని ప్లాన్ చేశారు. పాకిస్థాన్‌లో ఉంటున్న హైదరాబాదీ ఉగ్రవాది ఫర్హతుల్లా ఘోరీ ఆదేశాలతో హైదరాబాద్‌కు చెందిన జాహెద్ అతని టీం విజయదశమి వేళ భారీ విధ్వంసానికి కుట్ర పన్నినట్లు గుర్తించారు. సైదాబాద్ మెయిన్ రోడ్డులోని ఆంజనేయ స్వామి గుడిలో దసరా రోజున రామ్ లీలా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. ఆ సందర్భంగా పేలుళ్లకు కుట్రపన్నిన విషయాన్ని సిట్ వర్గాలు వెల్లడించాయి.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కూడా
హైదరాబాద్‌లో ఉగ్రవాద జాడలు విస్తరిస్తున్నాయి. నిన్నటి వరకు ఐఎస్ఐ, అల్‌ ఖైదా సంస్థల మాటే వినిపించగా… ఇప్పుడు కొత్తగా ఐసిస్ పేరు కూడా వినిపిస్తోంది. సోషల్‌ మీడియా ద్వారా యూత్‌ని ఉగ్రవాదం వైపు మళ్లించేందుకు తీవ్ర వాద సంస్థలన్నీ ప్రయత్నిస్తున్నాయి. ఇటీవల పట్టుబడుతున్న ఉగ్రవాద అనుమానితుల్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కూడా ఉండటం కలకలం రేపుతోంది. అందుకే ఉద్యోగుల్ని రిక్రూట్ చేసేటప్పుడు వారి బ్యాక్‌గ్రౌండ్ కూడా చెక్ చేయాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. జనసమ్మర్ద ప్రదేశాలు.. ముఖ్యంగా షాపింగ్ మాల్స్ లాంటి చోట్ల చుట్టుపక్కల ఉన్నవారిని గమనిస్తుండాలి. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లతో పాటు మెడిసిన్ విద్యార్థుల ఉగ్రవాదం వైపు మళ్లటం ఆందోళన కలిగించే విషయం. హైదరాబాద్‌లో అడపాదడపా బయటపడుతున్న ఉగ్ర లింకులకు ప్రధాన కారణం.. అనుమానితుల్ని స్థానికులు ఎవరూ పెద్గగా పట్టించుకోకపోవడమే.

హైదరాబాద్‌కు కొత్తగా వచ్చి ఇక్కడ ఇళ్లు అద్దెకు తీసుకున్న, కొత్తగా ఉద్యోగాల్లోకి తీసుకున్న వారిపై కొన్నాళ్లు నిఘా వేసి ఉంచాల్సిన అవసరం ఉంది. మనం సరిగా దృష్టి పెట్టని వాళ్లే.. రేప్పొద్దున ఉగ్రవాదులుగా తేలొచ్చు.
అసలు ఉగ్రవాదుల కంటే సానుభూతిపరుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వీరిని గుర్తించడం చాలా కష్టం. ఇక స్లీపర్ సెల్స్ సరేసరి. ఉగ్రవాదులు మన కళ్ల ముందే తిరుగుతూ ఉండొచ్చు. మనకు బాగా తెలిసినవాళ్లే సానుభూతిపరులై ఉండొచ్చు. వైట్ కాలర్ జాబ్ చేస్తున్నంత మాత్రాన.. అనుమానించకూడదని ఏం లేదు. స్టూడెంట్స్ అయితే ఉగ్రవాదం జోలికి వెళ్లరు అనుకునే అవకాశం లేదు. హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్ నగర్‌లో 2013 ఫిబ్రవరి 21న బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనను ఇప్పటికీ బాధిత కుటుంబ సభ్యులు ఇంకా మర్చిపోలేకపోతున్నారు. ఈ పేలుళ్లలో దాదాపు 17 మంది చనిపోయారు. మరెందరో గాయపడ్డారు. ఈ పేలుళ్లకు కారకులైన ఐదుగురు ఉగ్రవాదులకు ప్రత్యేక కోర్టు మూడేళ్ల అనంతరం మరణ శిక్ష విధించింది. దిల్‌సుఖ్‌నగర్‌ బస్టాండు ఎదురుగా రద్దీగా ఉండే ప్రాంతంలో సైకిల్‌పై ఉగ్రవాదులు బాంబులు అమర్చారు. టిఫిన్‌ బాక్సులో పెట్టిన బాంబులు పేలడంతో భారీగా ప్రాణనష్టం జరిగింది. 2007 ఆగస్టు 25న కోఠిలోని గోకుల్ చాట్, సచివాలయానికి ఎదురుగా ఉన్న లుంబినీ పార్కులో కొద్ది సమయం తేడాలో బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో మొత్తం 44 మంది ప్రాణాలు కోల్పోగా వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు.

బాంబులోని ఇనుప ముక్కల ధాటికి చాలామంది అవయవాలు కోల్పోయి జీవచ్ఛాలుగా మారిపోయారు. ఇండియన్ ముజాహిద్దీన్ అనే ఉగ్రవాద సంస్థ ఈ దారుణానికి పాల్పడింది. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు పక్కా ఆధారాలతో న్యాయస్థానంలో ఛార్జిషీటు దాఖలు చేశారు. ఈ కేసు విచారణ కోసం చర్లపల్లి న్యాయస్థానంలో ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేశారు. అన్ని ఆధారాలను పరిశీలించిన స్పెషల్ కోర్టు అనిక్ షఫిక్ సయ్యద్, అక్బర్ ఇస్మాయిల్ చౌదరి అనే ఉగ్రవాదులను దోషులుగా నిర్ధారిస్తూ మరణశిక్ష విధించింది. వీరికి ఆశ్రయం ఇచ్చిన తారిఖ్ అంజుమాకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.


హైదరాబాదే ఎందుకు?
2007, మే 18 మధ్యాహ్నం.. 1.15 సమయంలో మక్కా మసీదు వజుఖానా దగ్గర భారీ పేలుడు సంభవించింది. ఏం జరుగుతుందో ఊహించే లోపే అక్కడంతా అల్లకల్లోలంగా మారింది. ఐఈడీ బాంబు పేలుడుతోనే ఈ ఘోరం సంభవించినట్లు పోలీసులు తర్వాత నిర్ధరించారు. మొత్తం తొమ్మిది మంది చనిపోగా.. 58 మంది గాయపడ్డారు. పేలుడు సంభవించిన స్థలానికి సమీపంలోనే.. పేలని మరో ఐఈడీ బాంబుని గుర్తించారు పోలీసులు. వరుస ఘటనలతో హైదరాబాద్ ఉలిక్కిపడింది. ఈ దుర్ఘటనల తర్వాత పోలీసులు బాగా అలర్ట్ అయ్యారు. ఎప్పటికప్పుడు నిఘా పెంచుతూ.. అనుమానాస్పద వ్యక్తులు, ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. కొత్తగా ఏర్పాటైన కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా మరింతగా ఫోకస్ పెడుతున్నారు. నగరవ్యాప్తంగా ఉన్న సీసీ కెమెరాలను కూడా బాగా ఉపయోగించుకుంటున్నారు. తేలికగా దొరుకుతున్న అద్దె ఇళ్లు, పెద్దగా ఎంక్వైరీ చేయని ఓనర్లు, పోలీసులకు తెలిసేలోపు పని కానిచేయొచ్చనే ధీమాతో ఎక్కడెక్కడో ఉగ్రవాదులు హైదరాబాద్‌లో దిగుతున్నారు. పోలీసులు అరెస్ట్ చేయకపోతే.. మరో గోకుల్ చాట్, దిల్‌సుఖ్ నగర్, మక్కా మసీద్ తరహా బాంబు పేలుళ్లు చూడాల్సి వస్తుందేమోనని జనం వణికి పోతున్నారు. హైదరాబాద్‌లో కొన్నిసార్లు పేలుళ్లు తృటిలో తప్పిపోయాయి.
ఓ దుర్ఘటన జరిగినప్పుడు అది ఎలా జరిగిందని ఎంత చర్చించుకున్నా ఉపయోగం లేదు. కానీ ముందే అప్రమత్తంగా ఉంటే కచ్చితంగా లాభం ఉంటుంది. దేశంలో ఏ ప్రాంతంలో ఉగ్రవాద దాడి జరిగినా దానికి మూలాలు హైదరాబాద్‌లోనే ఉంటున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న హిజ్బుల్ ముజాహిదీన్, తాంజిమ్ ఇస్లాహుల్ ముస్లిమీన్, ఫసి, అల్‌జెహాద్, లష్కరే తోయిబా, ఇండియన్ ముస్లిం ముజాహిదీన్, హర్కుతుల్ జెహాద్ అల్ ఇస్లామీ తదితర సంస్థలు విధ్వంసాలకు పాల్పడుతున్నాయనే ఆధారాలున్నాయి. మెట్రో నగరాల కంటే బెటర్‌గా హైదారాబాద్‌లో ఉద్యోగాలొచ్చాయి. ఆఫీస్ స్పేస్ డిమాండ్ కూడా ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు కూడా అమెరికా తర్వాత రెండో అతిపెద్ద క్యాంపస్‌లు హైదరాబాద్‌లో నెలకొల్పాయి. ఇన్ని ప్రత్యేకతలున్న నగరంలో ప్రశాంతతను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మొన్నీమధ్యే హైదరాబాద్‌లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటైంది. ఓవైపు శాంతిభద్రతల కోసం ఇంత ప్రయత్నం జరుగుతోంటే.. మరోవైపు ఉగ్రవాదులు ఇక్కడే అరెస్ట్ కావడం ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటే.. అది కోట్ల మందికి నష్టం. హైదరాబాద్‌లో ఒక్క నిమిషం బిజినెస్ ఆగినా.. జరిగే నష్టం వందల కోట్లలో ఉంటుంది. హైదరాబాద్ తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు ఆయువుపట్టు. దేశ జీడీపీలో కూడా హైదరాబాద్ కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. ఇలాంటి విలువైన నగరంలో ఎలాంటి అనుకోని ఘటనలు జరగకుండా పోలీసులు కాచుకోవాల్సి ఉంది. కుట్ర వ్యూహం, ఆయుధాల సమీకరణ, బాంబుల తయారీ, ట్రైనింగ్ కోసం ఉగ్రమూకలు హైదరాబాద్‌ను ఎంచుకుంటున్నాయనే సమాచారం కలవరపెడుతోంది.
ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా హైదరాబాద్‌లో బాంబు పేలొచ్చు. మన పక్కింట్లోనే ఉగ్రవాదులు ఉండొచు. అందుకే అప్రమత్తం కావాలి. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల్లో ఎవరు చేరినా.. వారి నియామకానికి ముందే ఎంక్వైరీ చేయాలి. మాల్స్, థియేటర్స్‌లో తనిఖీలు, భద్రత మరింత పెంచాలి.