Australia: పార్లమెంట్‌లోనే లైంగిక దాడి జరిగింది.. మహిళా ఎంపీ సంచలన వ్యాఖ్యలు..

దేశాన్ని పరిరక్షించాల్సిన ఒక మహిళా ఎంపీ.. స్వయంగా తనకు రక్షణ లేదంటూ పార్లమెంట్‌ వేదికగా కన్నీరు పెట్టుకుంది. రాజకీయంగా శక్తివంతమైన వ్యక్తి తనపై లైంగిక దాడికి యత్నించాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో కనిపించిన సీన్‌ ఇది.

  • Written By:
  • Publish Date - June 15, 2023 / 04:18 PM IST

Australia: పార్లమెంట్‌ అంటే ప్రజాస్వామ్యానికి దేవాలయం. పార్లమెంట్‌ సభ్యులు ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు. అలాంటి పార్లమెంట్ లైంగిక వేధింపులకు అడ్డాగా మారింది. ఈ ఘటన జరిగింది ఆస్ట్రేలియాలో. దేశాన్ని పరిరక్షించాల్సిన ఒక మహిళా ఎంపీ.. స్వయంగా తనకు రక్షణ లేదంటూ పార్లమెంట్‌ వేదికగా కన్నీరు పెట్టుకుంది.

రాజకీయంగా శక్తివంతమైన వ్యక్తి తనపై లైంగిక దాడికి యత్నించాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో కనిపించిన సీన్‌ ఇది. ఇండిపెండెట్‌గా గెలిచిన మహిళా సెనెటర్‌.. కన్జర్వేటివ్‌ పార్టీకి చెందిన సెనెటర్‌ డేవిన్‌ వాన్‌ గురించి చేసిన ఆరోపణలివి. డేవిన్‌ రోజూ పార్లమెంట్‌లో తనను ఫాలో అయ్యేవాడని, మాట్లాడే నెపంతో ఇష్టం వచ్చిన చోట చేతులు వేస్తూ మాట్లాడేవాడని చెప్పింది ఆ సెనెటర్‌. “ఇండైరెక్ట్‌గా రూమ్‌కు పిలిచేవాడు. అసభ్యంగా తాకేవాడు. ఆఫీసు గదిలో నుంచి బయటకు రావాలంటేనే భయపడేదాన్ని. డోర్‌ కొంచెం తెరిచి బయట ఆయన లేరని నిర్ధరించుకున్న తర్వాతే వచ్చేదాన్ని. పార్లమెంట్ ప్రాంగణంలో నడవాల్సి వచ్చినప్పుడు తోడుగా ఎవరో ఒకరు ఉండేలా చూసుకున్నా.

నాలాగే ఇంకొందరు కూడా ఇలాంటి వేధింపులు అనుభవిస్తున్నారని తెలుసు. కానీ, కెరీర్‌ పోతుందని భయపడి వారు బయటకు రావట్లేదు. ఈ భవనం మహిళలకు సురక్షిత ప్రదేశం కాదు’’ అంటూ ఏకంగా మహిళా సెనెటర్‌ కన్నీటిపర్యంతమైంది. డెవిన్‌పై తాను కేసు పెట్టేందుకు కూడా సిద్ధమౌతున్నట్టు చెప్పింది ఆ మహిళా సెనెటర్‌. అయితే, ఈ ఆరోపణలను డేవిన్‌ వాన్‌ తీవ్రంగా ఖండించారు. అవన్నీ అవాస్తవాలేనని కొట్టిపారేశారు. దీనిపై తాను కూడా న్యాయపరంగా పోరాడుతాన్నారు. అయితే ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో ఇలాంటి ఘటనలు జరగడం ఇది తొలిసారి కాదు. గతంలో ఓ మహిళ కూడా పార్లమెంట్‌లో తనపై అత్యాచారం జరిగిందని ఆరోపించింది.

2019 మార్చిలో పార్లమెంట్‌లో.. నాటి రక్షణమంత్రి లిండా రెనాల్డ్‌ ఆఫీస్‌లో పనిచేసే ఓ సీనియర్‌ సిబ్బంది.. తనను సమావేశం ఉందని పిలిచి అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆరోపించింది. ఈ ఘటన అప్పట్లో తీవ్ర వివాదాస్పదమైంది. దీంతో నాటి ప్రధాని స్కాట్‌ మారిసన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. బాధిత మహిళకు క్షమాపణలు చెప్పారు. ఇప్పుడు ఏకంగా ఓ సెనెటర్‌ లైంగిక ఆరోపణలు చేయడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.