UK Nurse: రోగుల ప్రాణాలు కాపాడటంలో వైద్యుల తర్వాత నర్సులదే ప్రధాన పాత్ర. ప్రాణాలు కాపాడాల్సిన అలాంటి ఒక నర్సు ఏడుగురు చిన్నారుల ప్రాణాలు తీసేసింది. చిన్నారుల్ని ఒక నర్సు చంపడం బ్రిటన్‌నే కాదు.. ప్రతి ఒక్కరినీ షాకింగ్‌కు గురి చేస్తోంది. ఈ దారుణ ఘటన ఇంగ్లండ్‌లోని చెస్టర్‌లో కౌంటెస్ ఆఫ్ చెస్టర్ ఆస్ప్రతిలో 2015-16లో జరిగింది. లూసీ లెబ్దీ అనే నర్సు ఈ ఆస్పత్రిలోని చిన్నారుల వార్డులో పని చేసేది. అనారోగ్యంతో, ప్రాణాపాయ స్థితిలో ఇంక్యుబేటర్‌లో ఉన్న చిన్నారుల్ని కంటికి రెప్పలా కాపాడుతూ.. వారిని రక్షించాల్సిన బాధ్యత లూసీది.
కానీ, ఆమె మాత్రం తనకున్న క్రూర లక్షణం, సైకోయిజంతో ఆ చిన్నారుల ప్రాణాలు తీసింది. ఇంజెక్షన్ ఇచ్చి, వారి రక్తంలోకి గాలిని నింపడం, నాసోగ్యాస్ట్రిక్ గొట్టాల ద్వారా పాలు, నీళ్లను పంపేది. అవసరానికంటే ఎక్కువగా పాలుపట్టేది. దీని ద్వారా వారి శ్వాస నాళాలు, రక్తనాళాల్లో ఇబ్బందులు కలిగి చిన్నారులు ప్రాణాలు కోల్పోయేవాళ్లు. ఇలా మొత్తంగా ఏడుగురు చిన్నారుల్ని లూసీ చంపేసింది. మరో ఆరుగురిని కూడా చంపేందుకు ప్రయత్నించినప్పటికీ.. వాళ్లు సరైన సమయంలో చికిత్స అందడం ద్వారా ప్రాణాలతో బయటపడ్డారు.
ముందే గుర్తించిన భారత సంతతి వైద్యుడు
లూసీ నర్సుగా పనిచేస్తున్న ఇదే ఆస్పత్రిలో భారత సంతతికి చెందిన చిన్నారుల వైద్య నిపుణుడు రవి జయరాం ఈ విషయాన్ని ముందుగానే గుర్తించారు. 2015 జూన్‌లోనే ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. వరుసగా చిన్నారుల మరణిస్తుండటంతో ఆస్పత్రి వారికి ఏదో అనుమానం కలిగింది. ఇదే సమయంలో చిన్నారుల వార్డులోని ఇంక్యుబేటర్ వద్ద లూసీ అనుమానాస్పదంగా కనిపించింది. ఈ విషయాన్ని రవి జయరాం గుర్తించి, ఆస్పత్రి యాజమాన్యానికి చెప్పాడు. కానీ, వాళ్లు నమ్మలేదు. పైగా తమతోపాటే పని చేస్తున్న లూసీపీ నిందలు వేయద్దని హెచ్చరించారు. తిరిగి ఆమెకే క్షమాపణలు చెప్పించారు. ఈ ఘటన తర్వాత మరో నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఒకవేళ లూసీ ప్రవర్తనపై రవి ఫిర్యాదు చేసినప్పుడే స్పందించి ఉంటే.. మరో నలుగురు పిల్లలైనా బతికుండేవారు. తన ఫిర్యాదును పట్టించుకోకపోవడంపై తాజాగా రవి జయరాం ఆవేదన వ్యక్తం చేశారు.
రెండేళ్ల తర్వాత కదలిక
2015-16లో చిన్నారులు మరణిస్తే 2017లో కానీ, రవి జయరాం బృందానికి ఫిర్యాదు చేసే అవకాశం రాలేదు. చివరకు తమ సంస్థ అనుమతితో రవి బృందం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వాళ్లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా, లూసీ చేసిన ఘోరాలు బయటపడ్డాయి. విచారణ అనంతరం 2018 జులైలో లూసీని పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై ఇంతకాలం విచారణ జరిగింది. 2020లో ఆమెపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. తాజాగా ఆమెను కోర్టు దోషిగా తేల్చింది. సోమవారం ఆమెకు కోర్టు శిక్ష విధించనుంది.