Odisha Train Accident: ఒడిశాలో జరిగిన కోరమండల్ రైలు ప్రమాదంలో 275 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. మరో వెయ్యి మందికి పైగా గాయాల పాలై.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కొందరి ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. ఏమయ్యారో తెలియదు. ఒడిశా ఆస్పత్రుల్లో మాత్రం.. గుట్టలుగుట్టలుగా శవాలు కనిపిస్తున్నాయి. మృతదేహాలను గుర్తు పట్టడానికి అవకాశం లేకుండా పోయింది. తమ కుటుంబసభ్యుల గురించి తెలుసుకునేందుకు.. ఎంతో మంది ఒడిశా ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు.
అత్యంత కీలకమైన ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ వ్యవస్థలో మార్పులు చేయడంతో ప్రమాదం జరిగినట్లు తేలిపోయింది. అయితే ఇది ఉద్దేశపూర్వకంగా చేశారా ? ప్రమాదం వెనుక కుట్ర దాగుందా ? విధ్వంసం సృష్టించే ఆలోచనతోనే ఇలా చేశారా ? అన్నది సీబీఐ దర్యాప్తులో తేలనుంది. రైలు పట్టాలు మారుతూ వెళ్లడంలో ఇంటర్‌లాకింగ్ వ్యవస్థే ప్రధానం. ఇంటర్ లాకింగ్ పాయింట్ మెషీన్ సెట్టింగ్‌ను మార్చారు.
ఇంటర్‌లాకింగ్‌లో మార్పును ఎవరు.. ఎందుకు చేశారు? భారీ కుట్ర కోణంతోనే.. ప్రమాదానికి ఒడిగట్టారా ? ప్రమాదం వెనుక కుట్ర ఏమైనా ఉందా? అనే ప్రశ్నలు రైల్వే అధికారులకు తలెత్తుతున్నాయ్. విధ్వంసక చర్యకు పాల్పడేందుకే కొందరు వ్యక్తులు ఇంటర్‌లాకింగ్ వ్యవస్థలో మార్పు చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.
ఒకే పట్టాలపై ఏకకాలంలో రెండు రైళ్లు రాకుండా మార్గం సుగమం చేసేందుకు ఉద్దేశించిన సమగ్రమైన సిగ్నల్ వ్యవస్థనే ఇంటర్‌లాకింగ్ అంటారు. రైలు ప్రయాణాలు సురక్షితంగా జరిగేలా చేయడం, సిగ్నల్స్‌లో ఎటువంటి అవాంఛిత మార్పులు రాకుండా చూడటమే దీని ప్రాథమిక విధి. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రయాణించే మార్గం పూర్తిగా సురక్షితం అని తేలేవరకు రైలుకు సిగ్నల్స్ ఇవ్వకుండా ఈ వ్యవస్థ కాపాడుతుంది.
ఇంటర్‌లాకింగ్ వ్యవస్థలో ఏమైనా తప్పు జరిగితే వెంటనే రెడ్ సిగ్నల్స్ వచ్చి రైళ్ల రాకపోకలన్నీ ఆగిపోతాయి. ఇంటర్‌లాకింగ్ వ్యవస్థ సెట్టింగ్స్ మార్చడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులు నిర్దరణకు వచ్చారు. ఎవరైనా చూడకుండా ఆ ప్రాంతంలో కేబుల్స్‌ను తవ్వడం, ఏదైనా యంత్రాన్ని నడపడం కూడా వ్యవస్థ వైఫల్యానికి కారణం కావచ్చని చెబుతున్నారు. ముందున్న మార్గంలో వేరే రైలు ఉందా? రైలు మెయిన్ లైన్లో వెళ్లనుందా ? లూప్‌లైన్‌లోనా ? అనేది డ్రైవరుకు స్పష్టంగా తెలుస్తుందని రైల్వే అధికారులు అంటున్నారు.
డ్రైవర్ తప్పిదం లేదు. సిగ్నల్ సరిగానే ఉంది. అయినప్పటికీ మెయిన్ లైన్‌లో వెళ్లాల్సిన రైలు లూప్ లైన్‌లోకి వెళ్ళింది. గూడ్స్ రైలును ఎలా ఢీ కొట్టింది? మరి అన్ని బాగుంటే ఈ ప్రమాదం ఎలా జరిగింది? పాయింట్ మిషన్ సెట్టింగ్ మార్చడం వల్లే ప్రమాదం జరిగిందని రైల్వే మంత్రి చెబుతున్నారు. పాయింట్ పుష్ ఫెయిల్యూర్ కూడా జరిగి ఉండవచ్చనే అనుమానం కూడా వ్యక్తవుతోంది. బహనగా రైల్వే స్టేషన్‌లో నాలుగు లైన్లు ఉన్నాయి. ఇందులో రెండు మెయిన్ లైన్లు ఉంటే, అటూ ఇటూ ఉన్నవి లూప్ లైన్లు. మెయిన్ లైన్‌లో రైలు వెళుతున్నప్పుడు స్టేషన్ మాస్టర్ గదిలోని ప్యానెల్ బోర్డులో గ్రీన్ కలర్ చూపిస్తోంది. రైలు పాయింట్ దాటి వెళ్లిపోగానే అక్కడ రెడ్ లైన్ వస్తుంది. ఒకానొక దశలో ఎడమవైపు ఎల్సీ అంటే లెవెల్ క్రాసింగ్ 95 వద్ద గ్రీన్ సిగ్నల్ ఉంది. కుడి వైపున ఉన్న ఈ ఎల్సీ మాత్రం రెడ్ సిగ్నల్ చూపిస్తోంది. వాస్తవానికి రెండు ఎల్సీలు ఒకే కలర్ సిగ్నల్ చూపించాలి. కుడివైపు ఎల్సీ రెడ్ సిగ్నల్ ఉండడమే కాకుండా, పక్కనే ఉన్న పాయింట్ ఆఫ్ లైన్ నుంచి డౌన్ లైన్‌కు కనెక్ట్ అయింది. ట్రైన్ వేగాన్ని లెక్కలోకి తీసుకున్నా ఇంత పెద్ద స్థాయిలో ప్రమాదం జరగకూడదు.
కోరమండల్ ట్రైన్ ప్రమాదానికి ముందు సిగ్నల్ పాయింట్ వద్ద సాంకేతిక మరమ్మతులు చేశారు. అంటే అవి సరిగా చేశారా? లేదా ? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే గూడ్స్ రైలును మెయిన్ లైన్ నుంచి లూప్ లైన్‌లోకి మార్చిన తర్వాత కోరమాండల్‌కు లైన్ క్లియర్ చేశారు. ప్యానెల్ బోర్డులో ఆ మేరకు గ్రీన్ సిగ్నల్ కూడా బాగానే ఉంది. ఫిజికల్‌గా క్రాసింగ్ పాయింట్ దగ్గర అలా లేదు. దీంతో అక్కడి నుంచి కోరమండల్ లూప్ లైన్‌లోకి వెళ్ళిపోయింది. ఇది జరగడానికి రెండు కారణాలు ఉంటాయని రైల్వే అధికారులు చెబుతున్నారు. మెయిన్ లైన్లో వెళ్లినట్లు గ్రీన్ సిగ్నల్ వచ్చినా లూప్ లైన్‌లో రెడ్ కలర్ రాకపోవడమన్నది సాంకేతిక లోపమని నిపుణులు చెబుతున్నారు.
గూడ్స్ రైలును లూప్ లైన్లోకి పంపించిన తర్వాత.. మెయిన్ లైన్‌లోకి వెళ్లేలా ట్రాక్ మార్చాలి. మెయిన్ లైన్‌లో కోరమాండల్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పాయింట్ పుష్ మోటర్ ఆపరేట్ చేసిన తర్వాత ఏం జరిగింది ? రైలు వచ్చేలోగా ఎవరైనా లెవెల్ క్రాసింగ్ వద్ద రివర్స్ క్రాస్ చేసి ఉంటారా ? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయ్. అయితే ఎవరో కావాలని సెట్టింగ్స్ మార్చడం అంటే.. అంత సులభం కాదని నిపుణులు చెబుతున్నారు. ఆ సెక్షన్లో పనిచేసే వారికి మాత్రమే దీని గురించి అవగాహన ఉంటుందని అంటున్నారు.