Jail to Guntur Municipal Commissioner : గుంటూరు మున్సిపల్ కమిషనర్ కీర్తికి జైలు శిక్ష విధించింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. నెల రోజుల శిక్షతో పాటు 2 వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. 2024 జనవరి 2లోపు హైకోర్టు రిజిస్ట్రారు ఆఫీసులో లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. గుంటూరు కొత్తపేటలో యడవల్లివారి సత్రం లీజు చెల్లింపులో హైకోర్టు ఆదేశాలు పాటించలేదు మున్సిపల్ కమిషనర్ కీర్తి. దాంతో కోర్టు ధిక్కరణ కింద ఆదేశాలు ఇచ్చింది ఏపీ హైకోర్టు. గుంటూరు ( Guntur) కార్పొరేషన్ పరిధిలోని యడవల్లి వారి సత్రాన్ని అక్రమంగా ఆక్రమించుకొని ఎలాంటి లీజ్ చెల్లించకుండా స్కూల్ నడుపుతున్నారంటూ హైకోర్టులో పిటిషన్ ఫైల్ అయింది. దీనిపై గతంలో విచారణ చేపట్టిన హైకోర్టు.. పిటిషనర్లకు 25 లక్షల రూపాయలు వెంటనే చెల్లించాలని ఆదేశించింది.
ఆ ఆదేశాలను మున్సిపల్ కమిషనర్ కీర్తి (Guntur Municipal Commissioner) అమలు చేయలేదు. దాంతో కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని పిటిషనర్ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. మున్సిపల్ కమిషనర్ కీర్తికి నెల రోజుల జైలు శిక్ష, 2వేల రూపాయల జరిమానా విధించింది. జనవరి 2న హైకోర్టు రిజిస్ట్రార్ దగ్గర లొంగిపోవాలని న్యాయస్థానం ఆదేశించింది.
కొన్ని రోజుల క్రితం కూడా ఇద్దరు ఐఏఎస్ అధికారులకు హైకోర్టు జైలుశిక్ష విధించింది. శ్యామలరావు, భాస్కర్ కు నెల రోజుల శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధించింది. ఎయిడెడ్ నియామకంపై గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయలేదని పిటిషనర్లు హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. దాంతో హైకోర్టు ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష విధించింది. వీళ్ళు డివిజనల్ బెంచ్ కు వెళ్ళి అప్పీలు చేసుకున్నారు. దాంతో తీర్పు అమలు వాయిదా పడింది.