KAVACH Technology: ఒడిశా రైలు ప్రమాదంలో కవచ్ టెక్నాలజీ పని చేయలేదా? అసలేంటీ టెక్నాలజీ..?

దేశంలో రైలు ప్రమాదాల్ని సున్నా స్థాయికి తగ్గించడానికి.. అంటే అసలు ప్రమాదాలు జరగకుండా నివారించడానికి ఈ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. ఈ టెక్నాలజీకి ఎస్ఐఎల్4 సర్టిఫికేషన్ కూడా లభించింది. ఈ టెక్నాలజీ ఎంత బాగా పనిచేస్తుందంటే.. 10,000 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే పొరపాటు జరిగే ఛాన్స్ ఉంటుంది.

  • Written By:
  • Publish Date - June 3, 2023 / 01:35 PM IST

KAVACH Technology: దేశంలో రైల్వే ప్రమాదాల్ని నివారించేందుకు తీసుకొచ్చిన కొత్త టెక్నాలజీ కవచ్. దీన్ని ట్రైన్ కొల్లిసన్ అవాయిడెన్స్ సిస్టమ్ (టీసీఏఎస్) లేదా ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ (ఏటీపీ) అంటారు. దేశంలో రైలు ప్రమాదాల్ని సున్నా స్థాయికి తగ్గించడానికి.. అంటే అసలు ప్రమాదాలు జరగకుండా నివారించడానికి ఈ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. ఈ టెక్నాలజీకి ఎస్ఐఎల్4 సర్టిఫికేషన్ కూడా లభించింది. ఈ టెక్నాలజీ ఎంత బాగా పనిచేస్తుందంటే.. 10,000 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే పొరపాటు జరిగే ఛాన్స్ ఉంటుంది. అలాంటిది కవచ్ టెక్నాలజీ ఉండగా ఒడిశాలో మూడు రైళ్లు ప్రమాదానికి ఎలా గురయ్యాయి అన్నది ఇప్పుడు చాలా మందిని వేధిస్తున్న ప్రశ్న.
ఈ టెక్నాలజీ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.400 కోట్లు ఖర్చు చేసింది. ఈ టెక్నాలజీని ట్రాకులకు అమర్చేందుకు కేంద్రం భారీగా నిధులు ఖర్చు చేస్తోంది. అయితే, ఒడిశా రైలు ప్రమాద ఘటనలో ఈ టెక్నాలజీ పనిచేయలేదు. కారణం.. ఈ రైల్వే ట్రాకులో ఇంకా ఆ టెక్నాలజీ లేకపోవడమే. ఈ మార్గంలో ప్రయాణించే రైళ్లలో కవచ్ టెక్నాలజీ లేదు. దీంతో భారీ రైలు ప్రమాదం జరిగింది. ఈ టెక్నాలజీ సాధారణంగా రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చి ఢీకొనడాన్ని నివారిస్తుంది. ఒక ట్రాకుపై రెండు రైళ్లు ఎదురెదురుగా వస్తుంటే గుర్తించి కవచ్ సిస్టమ్ అలర్ట్ చేస్తుంది. దీంతో లోకోపైలట్ బ్రేక్ వేస్తాడు. ఒకవేళ లోకో పైలట్ బ్రేక్ వేయలేకపోయినా.. ఆటోమేటిగ్గా బ్రేకులు పడిపోతాయి. ఈ వ్యవస్థను ఇంతకుముందు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ నేరుగా పరీక్షించి చూశారు. అప్పుడు ఎదురెదురుగా వచ్చిన రైళ్లు 380 మీటర్ల దూరంలోనే ఆగిపోయాయి. దీంతో కవచ్ టెక్నాలజీ బాగా పనిచేస్తుందని రుజువైంది. అయితే, ఒడిశా మార్గంలో కవచ్ టెక్నాలజీ ఇంకా అప్‌డేట్ కాలేదని రైల్వే శాఖ ఉన్నతాధికారి అమితాబ్ శర్మ తెలిపారు.
రెండు రైళ్ల ఇంజిన్లు ఎదురెదురుగా వస్తే కవచ్ టెక్నాలజీ గుర్తిస్తుంది. రైలు ఇంజిన్లలో కవచ్ టెక్నాలజీకి సంబంధించిన డివైజ్ అమరుస్తారు. ఇది రేడియో టెక్నాలజీ, జీపీఎస్ ఆధారంగా పనిచేస్తుంది. రైలు పట్టాలు ఊడిపోయినా ఈ టెక్నాలజీ అలర్ట్ చేస్తుంది. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా అభివృద్ధి చేసిన ఈ టెక్నాలజీని గత ఏడాది బడ్జెట్లో కేంద్రం ప్రవేశపెట్టింది. ఇప్పుడిప్పుడే ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తోంది. ఇప్పటివరకు 2,000 కిలోమీటర్ల రైల్వే నెట్‌వర్క్ పరిధిలో ఈ టెక్నాలజీ అందుబాటులో ఉంది. మరిన్ని మార్గాల్లో దీన్ని తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. మరో ఏడాదిలో దేశంలో అత్యంత రద్దీగా ఉండే మార్గాల్లో ఈ టెక్నాలజీని ప్రవేశపెట్టాలని కేంద్రం లక్ష్యంగా నిర్ణయించుకుంది.