Kenya cult deaths: మూఢ భక్తి! దేవుడి పేరుతో ఆకలి చావులు.. ఈ పాపం ఎవరిది?

ఉపవాసం అంటే పూర్తిగా ఆహారం మానేయకుండా.. నిర్ణీత సమయంలో మాత్రమే ఆహారం తీసుకుంటూ ఉంటారు. అలా కాకుండా పూర్తిగా ఆహారం మానేస్తే చిక్కుల్లో పడాల్సి ఉంటుంది. తాజాగా కెన్యాలో ఇలా దేవుడి పేరుతో ఆహారం మానేసిన 47 మంది ప్రాణాలు కోల్పోయారు.

  • Written By:
  • Updated On - April 24, 2023 / 04:54 PM IST

Kenya cult deaths: భక్తి మనిషికి మానసిక శక్తినివ్వాలి. వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడాలి. మనిషిలో సద్గుణాల్ని పెంపొందించి, చెడు భావాల్ని దూరం చేయాలి. కానీ, కొన్నిసార్లు భక్తి వీటన్నింటికీ భిన్నంగా పక్కదారిపడుతోంది. మానవ సమాజాన్ని మూఢ విశ్వాసంలో ముంచెత్తుతోంది. మనుషుల ప్రాణాలు పోయేందుకు కారణమవుతోంది. ఇప్పుడు కెన్యాలో ఇలాంటి మూఢ భక్తే బయటపడింది. ఇది ఏకంగా 40 మందికిపైగా అమాయకుల ప్రాణాలు బలిగొంది.
దైవానికి దగ్గరయ్యేందుకు మనిషి అనేక మార్గాల్ని అనుసరిస్తుంటాడు. వీటిలో ఉపవాసం కూడా ఉంటుంది. ఉపవాసం అంటే పూర్తిగా ఆహారం మానేయకుండా.. నిర్ణీత సమయంలో మాత్రమే ఆహారం తీసుకుంటూ ఉంటారు. అలా కాకుండా పూర్తిగా ఆహారం మానేస్తే చిక్కుల్లో పడాల్సి ఉంటుంది. తాజాగా కెన్యాలో ఇలా దేవుడి పేరుతో ఆహారం మానేసిన 47 మంది ప్రాణాలు కోల్పోయారు. కెన్యాలోని మలిండి పట్టణ పరిధిలో ఈ ఘటన జరిగింది. దీనంతటికీ కారణం ఒక పాస్టర్.

స్వర్గానికి వెళ్లొచ్చని
గుడ్ న్యూస్ ఇంటర్నేషనల్ చర్చ్‌కు చెందిన పాల్ మెకెంజీ అనే పాస్టర్ చేసిన నిర్వాకమిది. మలిండి ప్రాంతంలోని ఈ చర్చికి చాలా మంది భక్తులు వస్తుంటారు. అయితే, వీరిని పాల్ మెకెంజీ తప్పుదోవపట్టించాడు. దేవుడి కోసం ఉపవాసం చేసి, ఆకలితో మరణిస్తే స్వర్గానికి వెళ్తారని నమ్మించాడు. దీని ద్వారా యేసును కలవొచ్చని చెప్పాడు. దీంతో ఈ చర్చికి వచ్చే ఇతర పాస్టర్లు, భక్తులు ఉపవాసం చేయడం ప్రారంభించారు. ఉపవాసం అంటే ఆహారం తీసుకోకపోవడమే కాదు.. నీళ్లు కూడా తీసుకోలేదు. ఎంతగా ఆకలితో మరణిస్తే అంత త్వరగా స్వర్గానికి చేరుతామని ఆ భక్తులు నమ్మారు. దీంతో చర్చి ఫాదర్ చెప్పినట్లుగా ఉపవాస దీక్షలు మొదలుపెట్టారు. అంతే.. రోజుల తరబడి ఉపవాసం చేసి పదుల సంఖ్యలో ప్రాణాలో కోల్పోయారు.


47 మందికిపైగా మృతి
పాల్ మెకెంజీ మాట ప్రకారం చాలా మంది ఉపవాసం చేయడం ప్రారంభించారాు. ఈ క్రమంలో ఇప్పటివరకు 47 మందికిపైగా మరణించారు. మృతుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వీళ్లంతా మలిండి పట్టణానికి సమీపంలోని 800 ఎకరాల పరిధిలో రహస్యంగా ఉపవాసం చేస్తున్నారు. అలా మరణించిన వారికి అక్కడే అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు, ప్రభుత్వ అధికారులు బాధితుల్ని రక్షించేందుకు సహాయక చర్యలు ప్రారంభించారు. కానీ, అప్పటికే ఆలస్యం అయింది. చాలా మంది రోజుల తరబడి ఆహారం, నీళ్లు తీసుకోకపోవడం వల్ల విషమ పరిస్థితిలో ఉన్నారు. అధికారులు కొంత మందిని గుర్తించి, ఆస్పత్రులకు తీసుకెళ్లేలోపే ప్రాణాలు కోల్పోగా, ఇంకొందరు చికిత్స పొందుతూ మరణించారు. ప్రస్తుతానికి 11 మంది వరకే ప్రాణాలతో బయటపడ్డారు. మొత్తంగా 47 మందికిపైగా మరణించారు. ఇలా మరణించిన వారిలో చిన్న పిల్లలు, మహిళలు కూడా ఉన్నారు. ఇంకా ఎంత మంది బాధితులు ఉన్నారో అని పోలీసులు అటవీప్రాంతం మొత్తాన్ని గాలిస్తున్నారు.
సమాధులమయం
ఈ ప్రాంతాన్ని గాలిస్తున్న అధికారులకు దిమ్మదిరిగే వాస్తవాలు వెలుగుచూశాయి. అటవీ ప్రాంతంలో పలు సమాధులు బయటపడ్డాయి. వాటిని తవ్వి చూస్తే ఒక్కో సమాధిలో ఐదు వరకు శవాలు కనిపించాయి. ఒక్కో సమాధిలో ఒక్కటికంటే ఎక్కువగానే మృతదేహాలు ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. బాధితుల్ని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఈ మారణహోమానికి కారణమైన పాస్టర్ పాల్ మెకెంజీని అధికారులు అరెస్టు చేశారు. అతడిని విచారిస్తున్నారు. గతంలో కూడా తాను ఇలా చేసినట్లు అతడు చెప్పాడు. అయితే, క్రైస్తవాన్ని బాగా నమ్మే కెన్యాలో ఇలాంటి ఘటన జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా చాలా సార్లు ఇలాంటి మూఢ విశ్వాసాలతో అనేక మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. భక్తి పేరుతో ప్రజల్ని తప్పుదోవపట్టిస్తున్న పాల్ లాంటి వ్యక్తులు, విధానాలపై అక్కడి ప్రభుత్వం దృష్టి సారించాల్సి ఉంది.