సీతారాములు కలిసి 14 ఏళ్లు వనవాసం చేశారానాడు ! భార్యాభర్తల బంధానికి, అర్థం చేసుకోవడానికి ప్రతీక ఆ త్రేతాయుగం కథ. కలియుగంలో భార్యను 14 ఏళ్లు బంధించాడో శాడిస్ట్ భర్త. అసలు ఆమె బతికి ఉందో లేదో కూడా బయటి ప్రపంచానికి తెలియనీయలేదు. పద్నాలుగేళ్లు అజ్ఞాతవాసంలో మగ్గిపోయింది ఆ అభాగ్యురాలు. చివరికి పోలీసుల జోక్యంతో ఆమె బయటి ప్రపంచాన్ని చూడగలిగింది..
విజయనగరంలో జరిగిన ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఏపీలోని సత్యసాయి జిల్లా పుట్టపర్తికి చెందిన సాయి సుప్రియకు.. విజయనగరం పట్టణానికి చెందిన లాయర్ గోదావరి మధుసూదన్‌తో 2008లో వివాహం జరిగింది. వారికి ముగ్గురు సంతానం ఉన్నారు. భార్య సాయిసుప్రియను ఏకంగా పద్నాలుగేళ్లపాటు ఇంట్లోనే నిర్బంధించాడు లాయర్ మధు. ఎప్పుడూ బయటకు వెళ్లనిచ్చింది లేదు. భర్తే అనుకుంటే.. మెట్టినింటి వాళ్లది ఇదే పరిస్థితి. పిల్లల్ని కూడా భార్య సుప్రియ దగ్గరకు వెళ్లనిచ్చేవాళ్లు కాదు. తమ బిడ్డ సంగతి ఏంటని సాయిసుప్రియ తల్లిదండ్రులు ఆరా తీస్తే.. లాయర్‌నంటూ బెదిరించి సైకో ఆనందం పొందేవాడా లాయర్. తమ కూతురు బతికుందో లేదో తెలియని స్థితిలో సాయి సుప్రియ తల్లిదండ్రులు తల్లిడిల్లిపోయారు. దిక్కుతోచని స్థితిలో కూతురు ఏమైందో తెలియక 14ఏళ్లు నరకయాతన అనుభవించారు. చివరికి న్యాయపోరాటం చేయాలని నిర్ణయించుకొని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
ఫిబ్రవరి 28న ఎస్పీ ఆదేశాలతో పోలీసులు వెళ్లినా.. ఇంట్లోకి వచ్చేందుకు అనుమతి లేదని పోలీసులను వెనక్కు పంపాడు మధుసూదన్. దీంతో కోర్టుకు వెళ్లారు సుప్రియ తల్లిదండ్రులు. కోర్టు నిన్న సెర్చ్ వారెంట్ జారీ చేయడంతో మధుసూదన్ ఇంట్లో తనిఖీలు చేపట్టారు. పోలీసులు సెర్చ్ వారెంట్ చూపించి ఇంట్లోకి వెళ్లగా.. బక్కచిక్కిపోయి గుర్తు పట్టలేని విధంగా సాయి సుప్రియ కనిపించింది.
మధుసూదన్ కుటుంబ సభ్యులతో మాట్లాడి.. బాధితురాలు సుప్రియను కోర్టులో హాజరుపరిచారు. 14 ఏళ్ల తర్వాత బయటి ప్రపంచాన్ని చూసిన సాయిసుప్రియ ఆనందానికి అవధుల్లేవు. చాలాకాలం తర్వాత తల్లిదండ్రులను కలవడంతో సంతోషం వ్యక్తం చేస్తోంది సాయిసుప్రియ. అత్తింటి నిర్బంధం నుంచి విడిపించినందుకు పోలీసులకు కృతజ్ఞతలు తెలపింది సాయి సుప్రియ. భార్యను ప్రపంచం చూడకుండా.. ప్రపంచం అతని భార్యను చూడకుండా బంధించి, రాక్షసానందం పొందిన లాయర్ మధుసూధన్‌పై ఇప్పుడు సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది.