Libya Floods: లిబియాలో జలప్రళయం.. 20 వేల మంది మృతి..?

డేనియల్ తుఫాన్ ప్రభావంతో సోమవారం నుంచి కుండపోతగా వర్షాలు కురిశాయి. ఊహించని స్థాయిలో వర్షపాతం నమోదైంది. దీంతో పలు డ్యాంల వద్ద నీటిమట్టం భారీగా పెరిగిపోయింది. ఈ క్రమంలో లిబియలోని ప్రధాన నగరమైన డెర్నాను వరద ముంచెత్తింది.

  • Written By:
  • Publish Date - September 14, 2023 / 02:52 PM IST

Libya Floods: డేనియల్ తుఫాను ధాటికి ఆఫ్రికా దేశమైన లిబియా వణికిపోయింది. తుఫాను ప్రభావంతో తలెత్తిన ఆకస్మిక వరదల కారణంగా అనేక ప్రాంతాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఈ ఘటనల్లో దాదాపు 20 వేల మందికిపైగా మరణించి ఉంటారని అంచనా. ఇప్పటికే 5,000కుపైగా మృతదేహాల్ని అధికారులు గుర్తించారు. మొత్తంగా 30,000 మంది గల్లంతయ్యారని అధికారులు తెలిపారు.
లిబియా ఎప్పుడూ చూడని కల్లోలాన్ని ఎదుర్కుంటోంది. డేనియల్ తుఫాన్ ప్రభావంతో సోమవారం నుంచి కుండపోతగా వర్షాలు కురిశాయి. ఊహించని స్థాయిలో వర్షపాతం నమోదైంది. దీంతో పలు డ్యాంల వద్ద నీటిమట్టం భారీగా పెరిగిపోయింది. ఈ క్రమంలో లిబియలోని ప్రధాన నగరమైన డెర్నాను వరద ముంచెత్తింది. దగ్గర్లోని రెండు డ్యాంలు కొట్టుకుపోవడంతో అనేక ప్రాంతాల్ని వరద ముంచెత్తింది. పైగా బురద ఎక్కువగా ఉండటంతో స్థానికులకు బయటపడే అవకాశం కూడా లేకుండాపోయింది. లక్ష మందికిపైగా నివసించే డెర్నా నగరంతోపాటు చుట్టుపక్కల బేడా, సుసా ప్రాంతాలు వరద ప్రభావానికి గురయ్యాయి. అనేక ఇండ్లు నీట మునిగాయి. వేల సంఖ్యలో ఇండ్లు నేలమట్టమయ్యాయి. పర్వతాల నుంచి డ్యాం ధ్వంసం కావడం వల్ల వేగంగా వచ్చిన వరద.. అక్కడి ప్రజల్ని మధ్యధరా సముద్రంలోకి నెట్టుకెళ్లింది. దీంతో వేల మంది ప్రజలు వరదతోపాటే సముద్రంలోకి కొట్టుకుపోయారు. డెర్నా చుట్టుపక్కల ప్రాంతమంతా ధ్వంసమైంది.

అధికారులు ఈ విపత్తును అంచనా వేసి, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ భారీ విపత్తు సంభవించిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం సహాయక చర్యలు కొనసాగిస్తోంది. సముద్రంతోపాటు తీరంలో శవాలు గుట్టలుగుట్టలుగా కొట్టుకొస్తున్నాయి. 5,300కుపైగా మృతదేహాల్ని అధికారులు వెలికితీశారు. సముద్రంలో ఇంకా మృతదేహాలు కనిపిస్తున్నాయి. అక్కడి ప్రాంతమంతా శవాల దిబ్బగా మారింది. అంత్యక్రియలు నిర్వహించడం కూడా కష్టమవుతోంది. గంటల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. ఐక్యరాజ్యసమితితోపాటు ప్రపంచ దేశాలు లిబియాకు సాయం అందించేందుకు ముందుకొస్తున్నాయి. అధికారుల అంచనా ప్రకారం.. డెర్నా ప్రాంతంలో దాదాపు 30 వేల మందికిపైగా గల్లంతయ్యారు. ఇంకా మృతదేహాల వేట కొనసాగుతోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు స్థానిక ప్రభుత్వం సంతాప దినాలను ప్రకటించింది. అసలే అంతర్యుద్ధంతో సతమతమవుతున్న లిబియాను ఈ వరదలు మరింత సంక్షోభంలోకి నెట్టాయి.