Madhya Pradesh: నెల జీతం ముప్పై వేలు.. ఇంట్లో ముప్పై లక్షల టీవీ.. మహిళా అవినీతి అధికారి ఆడంబరమిది!

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్, రాష్ట్ర పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్‌లో హేమా మీనా అనే ఒక మహిళ అసిస్టెంట్ ఇంజినీర్‌గా పని చేస్తోంది. అది కూడా కాంట్రాక్ట్ ఉద్యోగం. ఆమె జీతం నెలకు రూ.30 వేలు. అయితే, ఆమె ఆస్తి మాత్రం అంచనాలకంటే 232 శాతం ఎక్కువగా ఉంది.

  • Written By:
  • Publish Date - May 12, 2023 / 03:47 PM IST

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో ఒక మహిళా అవినీతి అధికారి బండారం బయటపడింది. అక్కడి అవినీతి నిరోధక సంస్థ అయిన లోకాయుక్త జరిపిన దాడుల్లో ఒక మహిళా అసిస్టెంట్ ఇంజనీర్ దగ్గర కోట్ల విలువైన ఆస్తులు దొరికాయి. కానీ, ఆమె నెల జీతం మాత్రం రూ.30 వేలే. ఇంత తక్కువ జీతం తీసుకుంటూ.. అంత అక్రమ సంపాదన కలిగి ఉన్న ఆమె ఆస్తులు చూసి అధికారులే షాకయ్యారు.
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్, రాష్ట్ర పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్‌లో హేమా మీనా అనే ఒక మహిళ అసిస్టెంట్ ఇంజినీర్‌గా పని చేస్తోంది. అది కూడా కాంట్రాక్ట్ ఉద్యోగం. ఆమె జీతం నెలకు రూ.30 వేలు. అయితే, ఆమె ఆస్తి మాత్రం అంచనాలకంటే 232 శాతం ఎక్కువగా ఉంది. అంటే ఆమెకు ఉన్న ఆస్తులు సంపాదించాలంటే నెలకు రూ.18 లక్షల జీతం వచ్చి ఉండాలి. అలాంటిది రూ.30 వేలతోనే ఇంత భారీ ఆస్తి సంపాదించింది అంటే ఏ స్థాయి అవినీతికి పాల్పడిందో అర్థం చేసుకోవచ్చు. ఇంత అవినీతిపరురాలు కాబట్టే ఆమెపై 2020లోనే ఫిర్యాదు నమోదైంది. అప్పటినుంచి నిఘా వేసిన అధికారులు గురువారం ఆమె ఇంటిపై దాడి చేశారు. అక్కడి ఆస్తులు, నగలు వంటి వివరాల్ని సేకరించారు. వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో ఆమె ఆస్తులు, లగ్జరీ లైఫ్ చూసి అధికారులు షాకయ్యారు.
40 గదుల బంగ్లా
హేమ నివసిస్తున్న ఇల్లు అతి ఖరీదైన, విశాలమైన బంగ్లా. 20 వేల చదరపు అడుగుల స్థలంలో నిర్మించిన బంగ్లాలో నివిసిస్తోంది. ఆ ఇంటికి గార్డ్స్ కూడా ఉన్నారు. ఇంట్లో 40 గదులు ఉన్నట్లు తేల్చారు. ఈ ఇల్లు ఆమె తండ్రి పేరు మీద ఉన్నట్లు గుర్తించారు. దీని విలువ రూ.కోటి పైనే ఉంటుంది. ఇంట్లో పిట్‌బుల్, డాబర్‌మ్యాన్ వంటి 50 వరకు విదేశీ జాతి కుక్కలున్నాయి. పక్కనే లక్షల విలువ చేసే ఫాంహౌజ్.. అందులో 60-70 వరకు గోవులు ఉన్నాయి. ఇంట్లో రూ.30 లక్షల విలువైన టీవీ సెట్, రూ.2.5 లక్షల విలువైన రోటీ మేకర్, మహీంద్రా థార్, ట్రక్కులు సహా పది లగ్జరీ కార్లు ఉన్నాయి. వీటన్నింటినీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
అడ్డుకున్న గార్డులు
50 మంది లోకాయుక్త అధికారులు సివిల్ డ్రెస్సుల్లో ఆమె ఇంటిని తనిఖీ చేసేందుకు వెళ్లారు. అయితే, హేమ ఇంటి వద్ద ఉన్న గార్డులు వారిని ఆపారు. తాము జంతువుల సంరక్షణ చూసేందుకు వచ్చామని కొందరు, సోలార్ సిస్టమ్ బాగు చేసేందుకు వచ్చామని ఇంకొందరు చెప్పి లోపలికి వెళ్లారు. ఈ సమయంలో అక్కడి గార్డులు వాకీటాకీలు ఉపయోగించడం విశేషం. లోపలికి వెళ్లేసరికి హేమ ఇంట్లోనే ఉన్నారు. ఆమెను ఒక గదిలో ఉంచి, తన ఫోన్ లాక్కున్నారు. 2011 నుంచి విధులు నిర్వర్తిస్తున్న హేమ ఆస్తులు కోట్లలో ఉండటం చూసి విస్మయపరుస్తోంది. మొత్తంగా రూ.5 కోట్లకుపైగా ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. దీనిపై తదుపరి విచారణ కొనసాగుతుందని లోకాయుక్త అధికారులు చెప్పారు. ఆమె అక్రమ సంపాదనలో ఇతర ఉద్యోగుల భాగస్వామ్యం కూడా ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.