Odisha Train Crash: ఒడిశా రైలు ప్రమాదం.. పట్టాలపై డైరీ.. గుండెల్ని పిండేస్తున్న ప్రేమ కవితలు!

గుర్తు తెలియని ఒక వ్యక్తికి సంబంధించిన డైరీ, అందులోని కాగితాలు గుండెల్ని పిండేస్తున్నాయి. ఆ డైరీలో రాసుకున్న ప్రేమ కవితలు మనసును హత్తుకుంటున్నాయి. ఆ రైలులో ప్రయాణించిన వారిలో ఒక వ్యక్తి తన డైరీలో ప్రేమ కవితలు రాసుకున్నారు.

  • Written By:
  • Publish Date - June 5, 2023 / 02:28 PM IST

Odisha Train Crash: ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటన ప్రతి ఒక్కరినీ కలచివేసింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు, క్షతగాత్రులు, వస్తువుల తీరు కూడా బాధించింది. అక్కడి వస్తువులను కూడా అధికారులు సేకరించారు. వాటిలో గుర్తు తెలియని ఒక వ్యక్తికి సంబంధించిన డైరీ, అందులోని కాగితాలు గుండెల్ని పిండేస్తున్నాయి. ఆ డైరీలో రాసుకున్న ప్రేమ కవితలు మనసును హత్తుకుంటున్నాయి.

ఆ రైలులో ప్రయాణించిన వారిలో ఒక వ్యక్తి తన డైరీలో ప్రేమ కవితలు రాసుకున్నారు. కవితలతో పాటు అందమైన బొమ్మలు కూడా ఉన్నాయి ఆ డైరీలో. రైలు ప్రమాదం జరగడంతో ఇతర వస్తువులతోపాటు డైరీ కూడా పట్టాలపై పడిపోయి ఉంది. చెల్లాచెదురుగా ఉన్న వస్తువుల మధ్యలో ఆ డైరీ ప్రత్యేకంగా కనిపించింది. అందులోని ప్రేమ కవితలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ డైరీ బెంగాలీ ప్రయాణికుడికి చెందింది. అందులో బెంగాలీ భాషలో చేతితో రాసిన కవితలున్నాయి. వాటిని అనువందించి చూస్తే అద్భుతమైన కవితలే అనిపిస్తాయి. “అల్పో అల్పో మేఘ్ తేకే హల్కా బ్రిస్తీ హోయ్, ఛోట్టో ఛోట్టో గోల్పో థేకే భలోబాసా సృష్టి హోయ్” అని బెంగాలీ భాషలో రాసుంది.

చెదురుమదురు మేఘాలు తేలికపాటి వర్షాలను కురిపిస్తాయి.. (అయితే) మనం వినే చిన్న కథల నుంచి ప్రేమ వికసిస్తుంది అని ఈ కవితా పంక్తికి అర్థం. అలాగే “భలోబాషి టోకే చాయ్ సారాఖోన్, అచిస్ తుయ్ మోనేర్ సాథే” అనే ఇంకో కవిత కూడా ఉంది. అన్ని వేళలా ప్రేమతో నువ్వు నాకు కావాలి, అన్ని వేళలా నువ్వు నా మనసులో ఉన్నావు అని దీని అర్థం. ఇలాంటి ఎన్నో కవితలు, పద్యాలు, బొమ్మలు ఆ డైరీలో ఉన్నాయి. ఈ డైరీ రాసిన ప్రయాణికుడు ఎవరో.. ప్రమాదంలో అతడి పరిస్థితి ఏంటో తెలియదు. కానీ, అతడి కవితలు మాత్రం చాలా మందికి నచ్చాయి. ఈ కవితలకు సంబంధించి ఉన్న పేజీలు, డైరీలను రెస్క్యూ టీం సేకరించి ప్రత్యేకంగా భద్రపరిచింది.