Assistant Collector: ఉద్యోగానికి వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లిన అసిస్టెంట్ లేడీ కలెక్టర్.. రిజర్వాయల్‌లో శవమై తేలింది. ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఒడిశాలోని రూర్కెలాలో అదనపు కలెక్టర్ ఆఫీస్‌లో అసిస్టెంట్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న సస్మిత మింజ్ మరణంపై రకరకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయ్. అదనపు కలెక్టర్ కార్యాలయంలో కొంతమంది అధికారులు ఆమెను మానసికంగా వేధించడం వల్ల ఆత్మహత్య చేసుకుని ఉంటుందని.. లేదంటే వాళ్లే హత్య చేసి ఆ తర్వాత రిజర్వాయర్‌లో విసిరేసి ఉంటారనే ఆరోపణలు వినిపిస్తున్నాయ్.
ఈ నెల 15న ఆఫీస్‌కు వెళ్లి సుస్మిత.. మళ్లీ ఇంటికి తిరిగి రాలేదు. 17వ తేదీన ఆమె నగరంలో ఒక హోటల్లో ఉన్నట్లు తెలిసింది. తల్లి, సోదరుడు హోటల్‌కి వెళ్లి ఆమెను కలవాలని ప్రయత్నించినా నిరాకరించారు. ఆఫీస్‌లో ఒత్తిడి ఎక్కువగా ఉందని… తనకు విశ్రాంతి కావాలని, తాను ఎవరినీ కలుసుకోనని తెలిపారు. ఆ తర్వాత 19వ తేదీ పట్టణంలో ఉన్న సెంచరీ పార్క్ ప్రాంగణంలోని.. రిజార్వాయర్‌లో సుస్మిత మృతదేహం కనిపించింది. జలాశయంలో మహిళ మృతదేహం తేలుతూ కనిపించడంతో సెక్యూరిటీ గార్డు పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో అగ్నిమాపక సిబ్బందిని తీసుకుని వచ్చి మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. ఆ తర్వాత ఆ మృతదేహాన్ని సస్మితదిగా గుర్తించారు. రిజర్వాయర్ తీరంలో ఆమె హ్యాండ్‌బ్యాగ్, చెప్పులు లభించాయ్. మృతదేహాన్ని పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు కారణం అవుతోంది. రేపోమాపో కలెక్టర్ కాబోయే సుస్మిత.. ఇలా శవమై తేలడం.. అనేక ప్రశ్నలకు తావిస్తోంది. సస్మిత మింజ్ ఆత్మహత్య చేసుకున్నారా.. హత్యకు గురయ్యారా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎలాగూ తమ బిడ్డ ప్రాణాలతో తిరిగి రాదు. ఐతే ఆమె మరణానికి కారణాలు తెలుసుకొని న్యాయం చేయాలని.. తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఇక అటు సస్మిత పనిచేసే ఆఫీస్‌తో పాటు.. ఆమె రెండు రోజులు బస చేసిన.. హోటల్‌లోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఐతే పోస్టుమార్టం రిపోర్ట్ వస్తే మరిన్ని కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.