Morocco Earthquake: మొరాకోలో మరణ మృదంగం.. 2,000 దాటిన భూకంప మృతుల సంఖ్య..

భూకంప తీవ్రతతో ఈ ప్రాంతంలోని అనేక గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి. పలు ఇండ్లు, భవనాలు ఉన్నట్టుండి కుప్పకూలిపోయాయి. వేల మంది కూలిన శిథిలాల కింద చిక్కుకుపోయారు. వీరిలో రెండువేల మందికిపైగా మరణించారు.

  • Written By:
  • Publish Date - September 10, 2023 / 01:34 PM IST

Morocco Earthquake: మొరాకోలో శుక్రవారం అర్ధరాత్రి సంభవించిన భూకంపం తీవ్ర విషాదాన్ని కలిగించింది. ఈ భూకంపంలో ఇప్పటివరకు 2,000 మందికిపైగా మరణించినట్లు స్థానిక ప్రభుత్వం వెల్లడించింది. ఆదివారం ఉదయం నాటికి వెలికి తీసిన మృత దేహాల సంఖ్య 2012కు చేరింది. మొరాకోలోని పర్యాటక నగరమైన మరాకేష్‌కు నైరుతి దిశలో 72 కిలోమీటర్ల దూరంలో, పర్వత ప్రాంతంలో శుక్రవారం అర్థరాత్రి తర్వాత 6.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రతతో ఈ ప్రాంతంలోని అనేక గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి. పలు ఇండ్లు, భవనాలు ఉన్నట్టుండి కుప్పకూలిపోయాయి.

వేల మంది కూలిన శిథిలాల కింద చిక్కుకుపోయారు. వీరిలో రెండువేల మందికిపైగా మరణించారు. భూకంప తీవ్రత ఎక్కువగా ఉన్న అల్​-హౌజ్​ రాష్ట్రంలోనే 1,293మంది మరణించినట్టు తెలుస్తోంది. 2,059మందికిపైగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. టఫెఘాటే గ్రామం పూర్తిగా ధ్వంసమై, శిథిలాలతో నిండిపోయింది. కొన్ని ఇళ్లు మాత్రమే సురక్షితంగా ఉన్నాయి. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ సహాయక బృందాలు శిథిలాల్ని తొలగిస్తున్నాయి. మృతదేహాల్ని వెలికి తీస్తున్నారు. క్షతగాత్రుల్ని గుర్తించి, ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. బాధితుల్లో పిల్లలు కూడా ఉన్నారు.

పలువురు విదేశీయులు కూడా మరణించినట్లు తెలుస్తోంది. అక్కడి దృశ్యాలు భయంకరంగా ఉన్నాయి. శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. ఇక్కడ భూకంప తీవ్రత ఊహించని స్థాయిలో ఉందని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని రెడ్ క్రాస్ సంస్థ తెలిపింది. ప్రస్తుతం జరిగిన నష్టాన్ని పూడ్చి, ఈ ప్రాంతాన్ని తిరిగి యథాతథ స్థితికి తేవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుందని ఆ సంస్థ తెలిపింది. మొరాకోలో చివరగా ఈ స్థాయిలో భూకంపం 1960లో సంభవించింది. అప్పట్లో ఇక్కడ 12 వేల మంది వరకు మరణించారు. తాజా భూకంపంతో అక్కడి వాతావరణం భీతిగొల్పేలా, విషాదకరంగా ఉంది. మృతదేహాలకు సామూహిక అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.