North India Rains: భారీ వర్షాలు, వరదలు ఉత్తర భారతదేశాన్ని వణికిస్తున్నాయి. ప్రళయం వస్తోందా అన్నట్టుగా ఉంది అక్కడ పరిస్థితి. దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. కానీ ఉత్తర భారతంలో మాత్రం అదే వర్షం ఇప్పటి వరకూ 44 మంది ప్రాణాలు తీసింది. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. హిమాచల్ ప్రదేశ్‌లో దాదాపు 3 వందల మంది వరదల్లో చిక్కుకున్నారు. యమునా నది సహా అన్ని ఉత్తరాది నదులు పొంగి పొర్లుతున్నాయి.
అటు రాజస్థాన్‌లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అక్కడ కూడా అన్ని ప్రాంతాలు నదులను తలపిస్తున్నాయి. గ్రామాలు, పట్టణాలు, నగరాలు అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో మోకాళ్లలోతు నీరు ప్రవహిస్తోంది. హిమాచల్‌ప్రదేశ్, జమ్మూకశ్మీర్, పంజాబ్, హర్యాణా, ఉత్తరాఖండ్‌లో చాలా ప్రాంతాల్లో రోడ్లు తెగిపోయాయి. బ్రిడ్జ్‌లు కూలిపోయాయి. చాలా పురాతణ భవనాలు నేలమట్టమయ్యాయి. వరదల్లో కార్లు కొట్టుకుపోయాయి. వరదల కారణంగా జరిగిన ప్రమాదాల్లో ఇప్పటి వరకూ 37 మంది చనిపోయారు. పంజాబ్‌లోని స్కూళ్లకు ఈ నెల 13 వరకూ సెలవు ప్రకటించారు. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.
గత 50 ఏళ్ల కాలంలో ఇంలాటి భారీ వర్షాన్ని చూడలేదని హిమాచల్ సీఎం సుఖ్విందర్ సిగ్ సిక్కూ అన్నారు. వర్షాల కారణంగా ఇప్పటి వరకూ ప్రభుత్వానికి రూ.3 వేల కోట్లకు పైగా నష్టం జరిగిందని చెప్పారు. మరో రెండు రోజుల పాటు నార్త్‌లో ఇదే పరిస్థితి కొనసాగే చాన్స్ ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు.