Odisha Train Accident: కష్టంగా మారిన మృతదేహాల గుర్తింపు.. తమవాళ్ల కోసం తల్లడిల్లుతున్న కుటుంబ సభ్యులు!

ఇప్పటివరకు 151కిపైగా మృతదేహాల్ని గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మిగతా మృతదేహాల వివరాల్ని గుర్తించడం మాత్రం కష్టంగా ఉంది. దాదాపు 121కిపైగా మృతదేహాల్ని గుర్తించాల్సి ఉంది. దీంతో ఈ ఘటనలో తమ వారిని కోల్పోయిన కుటుంబ సభ్యుల వేదన వర్ణనాతీతం.

  • Written By:
  • Publish Date - June 5, 2023 / 01:21 PM IST

Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంలో 275 మంది మరణించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే, మృతుల వివరాల్ని గుర్తించడం కష్టంగా మారింది. ఇప్పటివరకు 151కిపైగా మృతదేహాల్ని గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మిగతా మృతదేహాల వివరాల్ని గుర్తించడం మాత్రం కష్టంగా ఉంది. దాదాపు 121కిపైగా మృతదేహాల్ని గుర్తించాల్సి ఉంది. దీంతో ఈ ఘటనలో తమ వారిని కోల్పోయిన కుటుంబ సభ్యుల వేదన వర్ణనాతీతం.

మృతుల్లో తమవాళ్లు ఉన్నారో.. లేరో తెలియక.. ఒకవేళ తమవాళ్లు మరణించినప్పటికీ వారి మృతదేహం ఏదో గుర్తించలేక అనేక కుటుంబాలు తల్లడిల్లుతున్నాయి. ప్రభుత్వానికి మృతదేహాల్ని గుర్తించడం సవాలుగా మారింది. కారణం.. చాలా వరకు మృతదేహాలు గుర్తించలేని స్థితిలో ఉన్నాయి. కొందరి అవయవాలు చెల్లాచెదురైపోయాయి. తమ వారిని గుర్తించేందుకు వచ్చిన కుటుంబ సభ్యులు కూడా వారిని గుర్తించడం కష్టమవుతోంది. తమ వారి మృతదేహాల్ని అప్పగిస్తే వెళ్లి అంత్యక్రియలు నిర్వహించుకుందామనుకుంటే అది వీలవ్వడం లేదు. దీంతో మృతుల కుటుంబ సభ్యులు తీవ్ర వేదనకు గురవుతున్నారు. అక్కడ తమవాళ్ల కోసం పడుతున్న వేదన తీవ్రంగా కలచివేస్తోంది. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌కు దాదాపు 110 మృతదేహాల్ని తరలించారు.

మిగతా మృతదేహాలను క్యాపిటల్ హాస్పిటల్, సమ్ హాస్పిటల్‌తో పాటు స్థానిక ఆసుపత్రులకు తరలించారు. కొద్ది రోజుల పాటు మృతదేహాలను అక్కడే ఉంచనున్నారు. డీఎన్ఏ, ఇతర అంశాల ఆధారంగా గుర్తింపు పూర్తయ్యాక వీటిని కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. మృతదేహాల్ని గుర్తించే విషయంలో అక్కడి సిబ్బంది కూడా సరిగ్గా స్పందించడం లేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కొందరి మృతదేహాలు ఎక్కడా లభించక బాధితులు అవస్థలు పడుతున్నారు. అన్ని ఆస్పత్రులకు తిరిగినా తమ వారి ఆచూకీ దొరకడం లేదని ఆవేదన చెందుతున్నారు. దీనిపై సరైన సమాచారం ఇచ్చేవాళ్లే లేరంటూ అక్కడి వాళ్లు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధితుల ఆవేదనతో అక్కడి పరిస్థితి హృదయవిదారకంగా ఉంది. మరోవైపు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌ను సందర్శించారు. మృతదేహాల అప్పగింత ప్రక్రియపై వైద్య అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. కాగా, 72 గంటల తర్వాత అవసరమైతే సామూహిక ఖననం నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు.
ప్రారంభమైన రైళ్ల రాకపోకలు
ప్రమాదం జరిగిన బాలాసోర్ ప్రాంతంలో రైళ్ల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. పట్టాలపై పడిపోయిన రైళ్లను, సామగ్రిని అధికారులు తొలగించారు. పట్టాలను తిరిగి ఏర్పాటు చేశారు. దాదాపు 51 గంటల తర్వాత రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి. అధికారులు తీవ్రంగా శ్రమించి సేవల్ని పునరుద్ధరించారు. ఆదివారం రాత్రి బాహనాగ్‌ వద్ద పట్టాలు పునరుద్దరించిన తర్వాత గూడ్స్ రైలు ఈ మార్గంలో నడిచింది. అయితే, సాధారణ రైలు సర్వీసులు ప్రారంభించేందుకు అధికారులు మరికొంత సమయం తీసుకోనున్నారు. ఒకట్రెండు రోజుల తర్వాతే ఈ మార్గంలో పూర్తిస్థాయి రైలు సర్వీసులు ప్రారంభిస్తారు. స్వల్ప వ్యవధిలోనే అధికారులు ట్రాకును అందుబాటులోకి తెచ్చారు. ప్రమాదానికి గురైన రైలు భాగాల్ని తొలగించే ప్రక్రియ కొనసాగుతోంది.