Falaknuma Express: ఫలక్‌నుమా ప్రమాదానికి కారణం ఇదే.. క్లూస్‌ టీమ్ నివేదికలో కీలక అంశాలు

ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదం చుట్టూ రకరకాల చర్చ జరిగింది. ఈ ఘటన వెనుక కుట్ర కోణం ఉందా అనే అనుమానాలు మొదలయ్యాయి. దీంతో రైల్వే శాఖ అప్రమత్తం అయింది. ప్రమాదానికి కారణాలను తెలుసుకునేందుకు రంగంలోకి దిగింది. 12మంది నిపుణులతో ఓ బృందాన్ని ఏర్పాటు చేసింది.

  • Written By:
  • Publish Date - July 8, 2023 / 06:36 PM IST

Falaknuma Express: ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగిన ఘటన.. దేశవ్యాప్తంగా టెన్షన్ పుట్టించింది. సరిగ్గా వారం రోజులకు ముందు ఓ లేఖ రావడం.. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చే రైళ్లపై ఎటాక్ చేస్తామని ఆ లెటర్‌లో ఉండడంతో.. ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదం చుట్టూ రకరకాల చర్చ జరిగింది. ఈ ఘటన వెనుక కుట్ర కోణం ఉందా అనే అనుమానాలు మొదలయ్యాయి.

దీంతో రైల్వే శాఖ అప్రమత్తం అయింది. ప్రమాదానికి కారణాలను తెలుసుకునేందుకు రంగంలోకి దిగింది. 12మంది నిపుణులతో ఓ బృందాన్ని ఏర్పాటు చేసింది. ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకున్న ఆ టీమ్‌ దగ్దమైన బోగీలను పరిశీలించింది. కీలక ఆధారాలు సేకరించింది. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే ప్రమాదం జరిగిందని అధికారులు అంచనాకు వచ్చారు. దీనికి సంబంధించి ఆధారాలను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు కూడా పంపించారు. ఎస్‌ 4 కోచ్‌లోని బాత్రూం దగ్గర మంటలు చెలరేగినట్లు అధికారులు గుర్తించారు. దీనికి తగిన ఆధారాలను కూడా సేకరించారు. సైంటిఫిక్‌ రిపోర్టు వచ్చాక మరిన్ని విషయాలు బయటపెట్టే అవకాశం ఉంది. సిగరెట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు మొదటి నుంచి చెప్తున్నారు.

సిగరెట్ నిప్పు రవ్వలు చెలరేగి, అవి కాస్త వైర్లకు అంటుకోవడంతో మంటలు వ్యాపించాయని, దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని చెప్పారు. అటు ఇటుగా ఇప్పుడు వాళ్లు చెప్పిందే నిజం అయింది. అయితే, ఏమైనా కుట్ర కోణం ఉందా అని టెన్షన్‌ పడిన జనాలు ఈ నివేదికతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో 6 బోగీలకు మంటలు వ్యాపించగా 5 బోగీలు పూర్తిగా కాలిపోయాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.