Online Scam: స్కాన్‌ చేస్తే ఖతం.. ఇలాంటి ఆఫర్స్‌తో జాగ్రత్త..

ఈ వస్తువు కొత్తది. జస్ట్‌ అన్‌బాక్స్‌ చేశామంతే ఒక్కసారి కూడా వాడలేదు. అవసరం ఉండి అమ్మేస్తున్నాం. ఈ వస్తువు అయితే కనీసం ఓపెన్‌ కూడా చేయలేదు. కానీ డబ్బు అవసరం ఉంది కాబట్టి సగం రేటుకే ఇచ్చేస్తున్నాం.

  • Written By:
  • Publish Date - June 7, 2023 / 12:31 PM IST

ఓఎల్‌ఎక్స్‌, క్వికర్‌ లాంటి సెకండ్‌ హ్యాండ్‌ సెల్లింగ్‌ సైట్స్‌ ఓపెన్‌ చేయగానే మీకు కనిపించే రిక్వెస్ట్‌లు ఇవి. వీటిని చూసి టెంప్ట్‌ ఐతే ఇక అంతే సంగతి. నైస్‌గా మోసం చేసి సైలెంట్‌గా సైడ్‌ ఐపోతారు. వస్తువులు కొనాలనుకుంటేనే కాదు.. అమ్మాలనుకున్నా కూడా జాగ్రత్త చాలా అవసరం. మీరు అమ్మాలి అనుకున్న వస్తువు తెలిసిన వాళ్లకు అమ్మితేనే బెటర్‌. వేరే స్టేట్స్‌ను నుంచి కాల్‌ చేసి ఎంతైనా సరే ఆ వస్తువు కొంటాం అనేవాళ్లను అస్సలు నమ్మొద్దు. మీరు అమ్మే వస్తువు ఎంత డ్యామేజ్‌ ఐనా సరే కొంటాం అని వస్తుంటారు కొందరు వ్యక్తులు. డబ్బుల విషయంలో వెనకాడకుండా బేరమాడకుండానే ఓకే చేస్తారు. అబ్బా ఆఫర్‌ భలే దొరికింది అని టెంప్ట్‌ అవుతుంటారు చాలా మంది. కానీ ఇక్కడే అసలు మోసం మొదలౌతుంది.

డబ్బులు డైరెక్ట్‌గా చెల్లించకుండా ఓ క్యూఆర్‌ కోడ్‌ను పంపిస్తారు కేటుగాళ్లు. నేను క్రెడిట్‌ కార్డ్‌ నుంచి పేమెంట్‌ చేయాలి.. దానికోసం మీరు నా క్యూఆర్‌ కోడ్ స్కాన్‌ చేయాలి అని చెప్తారు. స్కాన్‌ చేసి వస్తువు ప్రైజ్‌ ఎంతో అంత అమౌంట్‌ పంపిస్తే వెంటనే మీకు తిరిగి క్రెడిట్‌ అవుతుంది. ఆ తరువాత నా క్రెడిట్‌ కార్డ్‌ నుంచి మళ్లీ మీకు తిరిగి డబ్బు పంపిస్తాను అని చెప్తారు. నమ్మించేందుకు ముందుగా పది రూపాయలు స్కాన్‌ చేయించి వెంటనే ఆ డబ్బు తిరిగి క్రెడిట్‌ చేస్తారు. డబ్బు వస్తుంది అనుకుని చాలా మంది ఇలా స్కాన్ చేసి తమ వస్తువు ప్రైజ్‌ ఎంతో అంత పంపిస్తుంటారు.

ఒకసారి డబ్బు పంపిన తరువాత అవతల వ్యక్తి ఫోన్‌ పని చేయదు. లొకేషన్‌ ఎక్కడో యూపీలోనో, బిహార్‌లోనో చూపిస్తుంది. ఇలాంటి కేసులు రోజూ వందల్లో పెరుగుతున్నాయి. ఈ ఆన్‌లైన్‌ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మీకు తెలిసిన పద్ధతిలోనే ట్రాన్జాక్షన్స్‌ చేస్తే బెటర్‌. గుర్తు తెలియని వ్యక్తులు పంపిన క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేస్తే మీ డబ్బు పోవడమే కాకుండా మీ అకౌంట్‌ డిటెయిల్స్‌ కూడా సైబర్‌ నేరస్థుల చేతికి వెళ్లిపోతాయి. దీంతో ఫ్యూచర్‌లో కూడా వాళ్లు మీ అకౌంట్‌ నుంచి డబ్బు దోచే చాన్స్‌ ఉంటుంది. ఆన్‌లైన్‌లో వస్తువులు కొనే ముందు చాలా నమ్మకమైన సైట్ల నుంచి కొనడమే బెటర్‌. తక్కువ ధరకు వస్తుంది కదా అని ఏ సైట్‌లో పడితే ఆ సైట్‌లో కొంటామంటే మోసాలు పొంచి ఉండటం పక్కా.