Dog Attacks: హైదరాబాద్, అంబర్‌పేటలో వీధి కుక్కల దాడిలో చిన్నారి బాలుడు మరణించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కుక్కల దాడుల ఘటనలు అనేకం జరిగాయి. కొన్ని ఘటనల్లో బాధితులు చనిపోతున్నారు. ఈ పరిస్థితి తెలంగాణలోనో.. తెలుగు రాష్ట్రాల్లోనో కాదు.. దేశవ్యాప్తంగా ఉంది. దేశంలో సగటున ప్రతి రెండు సెకండ్లకో వీధి కుక్క దాడి లేదా కుక్క కాటు ఘటన నమోదవుతోంది. కుక్కల దాడిలో ప్రతి అరగంటకో మనిషి మరణిస్తున్నాడంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వీధి కుక్కల దాడులపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), ఢిల్లీకి చెందిన ఎయిమ్స్ సంస్థ కలిపి నిర్వహించిన సర్వేలో ఈ సంచలన విషయాలు వెలుగు చూశాయి.
రెండు కోట్ల కుక్కలు.. 20 వేల మంది మరణాలు
ఐసీఎంఆర్ అంచనా ప్రకారం.. దేశవ్యాప్తంగా రెండు కోట్ల కుక్కలు ఉన్నాయి. వీటిలో వీధి కుక్కల సంఖ్యే ఎక్కువ. అందులోనూ మరణాలకు కారణమవుతున్న వాటిలో వీధి కుక్కల వాటా 70 శాతం. దేశంలో ప్రతి రెండు సెకండ్లకో కుక్క కాటు ఘటన జరుగుతోంది. కుక్కల దాడిలో అరగంటకొకరు మరణిస్తున్నారు. సగటున ప్రతి ఏడాది 18 వేల నుంచి 20 వేల మంది వరకు ప్రాణాలు కోల్పోతున్నారు. వీధి కుక్కల్లో ఉన్న రేబిస్ వైరస్ కారణంగా ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి. 93 శాతం మరణాలు రేబిస్ వ్యాధి కారణంగానే జరుగుతున్నాయి.
పట్టణాల్లో 60 శాతం, గ్రామాల్లో 64 శాతం వీధి కుక్కల ద్వారా రేబిస్ సోకుతోంది. వీధి కుక్కల వల్ల ఇతర ఇన్ఫెక్షన్లు కూడా సోకుతున్నాయి. ఈ కుక్కల వల్ల బాధితులు బ్రుసిల్లోసిస్, బబేసియోసిస్, క్యాంపల్లో బ్యాక్ర్టోసిస్, క్రిప్టోపోరిడియాసిస్, క్యాపినోసైటో ప్యాగోసిస్, ఎకినోకొకోసిస్, ఎర్లికోసిస్, జియార్డియాసిస్, లెఫ్ర్టాస్పైరోసిస్, లైమ్ డిసీజ్ తదితర బ్యాక్టీరియా, ఫంగస్ జబ్బులకు గురవుతున్నారు. కుక్కల ప్రభావం మనుషులపైనే కాదు.. ఇతర జంతువులు, పక్షులపై కూడా ఉంటోంది. వీధి కుక్కలతోపాటు బయటి ఆహారం తీసుకునే ఇతర జీవులు కూడా రేబిస్ వంటి వ్యాధులకు గురవుతున్నాయి. రెండు రకాల బ్యాక్టీరియాలు, ఐదు రకాల వైరస్‌లు కుక్కల ద్వారా ఇతర జీవులకు సోకుతున్నాయి.
భయం పుట్టిస్తున్న ఘటనలు
వీధి కుక్కల దాడుల ఘటనలు ఆగడం లేదు. అంబర్‌పేటలో బాలుడి మృతి తర్వాత ఖమ్మం జిల్లాలో మరో బాలుడు మరణించాడు. హైదరాబాద్, చైతన్యపురిలో బాలుడిపై కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. ఆ తర్వాత కరీంనగర్ జిల్లా, శంకరపట్నం ఎస్సీ హాస్టల్‌లోకి చొరబడిన వీధి కుక్క అక్కడి విద్యార్థిపై దాడి చేసింది. తాజాగా సిద్ధిపేట అడిషనల్ కలెక్టర్‌తోపాటు ఇతర సిబ్బందిపై కూడా కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. ప్రస్తుతం బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఏపీలోని అన్నమయ్య జిల్లాలో కుక్కల దాడిలో ఒక రైతు మరణించాడు. ఇలాంటి ఘటనలు చూసి సామాన్యులు వీధి కుక్కలు అంటేనే భయపడే పరిస్థితి తలెత్తింది. కొన్ని చోట్ల ఇంట్లోంచి బయటకు అడుగుపెట్టాలంటేనే వణికిపోతున్నారు. ముఖ్యంగా పిల్లల తల్లిదండ్రులైతే తమ పిల్లల్ని బయటకు పంపాలంటేనే భయపడుతున్నారు. వీధుల్లో గుంపులుగా తిరుగుతున్న కుక్కల్ని చూసి హడలెత్తుతున్నారు. ఇక రాత్రిపూట.. అందులోనూ ఒంటరిగా ఉన్నవాళ్ల భయం వర్ణనాతీతం.
మూడు రకాల కుక్కలు.. ఆస్పత్రుల వద్దే మకాం
సాధారణంగా కుక్కల్ని నిపుణులు మూడు రకాలుగా చూస్తారు. మొదటి రకం ఇంట్లో పెంపుడు జంతువులుగా ఉండేవి. రెండో రకం సామాజిక భద్రతకు ఉపయోగపడేవి. అంటే పోలీసు విభాగం, లేదా ఇతర రక్షణ అవసరాల్లో ఉపయోగపడేవి. మూడోది వీధి కుక్కలు. వీటిలో వీధి కుక్కలే ఎక్కువ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. వీధి కుక్కల్లో ఎక్కువగా ఆస్పత్రుల వద్ద ఉంటున్నాయి. అక్కడికి రోగులు బయటి నుంచి తెచ్చుకుని పడేసే ఆహార పదార్థాలు తింటూ అక్కడే జీవిస్తున్నాయి. ఈ క్రమంలో అక్కడికి వచ్చి, వెళ్లేవాళ్లపై దాడులు చేస్తున్నాయి. అందులోనూ ఆహారం దొరక్కపోతే ఎక్కువసార్లు దాడికి పాల్పడుతున్నాయి. కొన్నిసార్లు ఆస్పత్రుల్లోకి చొరబడి అక్కడి పేషెంట్లపై, శిశువులపై దాడులు చేయడం వంటివి చేస్తున్నాయి.
నియంత్రణా చర్యలు
ఏదైనా ఘటన జరిగినప్పుడే ప్రభుత్వం కుక్కల విషయంలో స్పందించి తాత్కాలిక చర్యలు తీసుకుంటోంది. అంతేకాని.. వీటి నియంత్రణ విషయంలో శాశ్వత ప్రణాళికలు చేపట్టడం లేదు. వ్యర్థాల నిర్వహణ సరిగ్గా లేకపోవడం కూడా వీధికుక్కల పెరుగుదలకు కారణమవుతోంది. అవి చెత్తకుప్పల వద్ద దొరికే ఆహారం తింటూ బతికేస్తున్నాయి. కుక్కల్ని నియంత్రించాలంటే వాటికి కుటుంబ నియంత్రణ చర్యలు చేపట్టాలి. దీనికి అనుగుణంగా టీకాలు అభివృద్ధి చేసి, వినియోగించాలి. గ్రామ పంచాయతి, మున్సిపాలిటీ, స్థానిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ఇతర ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పని చేసి వీధి కుక్కల్ని అరికట్టాలి. ప్రజల్లో అవగాహన కల్పించాలి. ప్రమాదకర వీధి కుక్కల్ని గుర్తించి, వేరు చేయాలి.
2030 లక్ష్యం నెరవేరేనా?
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల వరకు కుక్కలు ఉన్నట్లు అంచనా. అందులోనూ వీధి కుక్కలు 70 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా. అయితే, కుక్కల వల్ల కలిగే మరణాల్ని నివారించాలని ప్రపంచ దేశాలు లక్ష్యంగా నిర్ణయించుకున్నాయి. 2030 వరకల్లా రేబిస్ వల్ల కలిగే మరణాలను పూర్తిగా నివారించాలని ఇండియాతోపాటు ప్రపంచ దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. అయితే, ఇప్పుడున్నపరిస్థితుల్లో ఇది ఎంతవరకు నెరవేరుతుందో చూడాలి.