Online Crime: ఆన్‌లైన్‌ మాయా ప్రపంచం.. బీ కేర్‌ఫుల్..!

ఆన్లైన్.. ఆన్లైన్.. ఆన్లైన్.. నేటి సమాజంలో ఎక్కడ చూసినా ఈ పదం ఊతపదంలా మారిపోయింది. శరీరానికి ధరించే వస్తువుల మొదలు సహాయానికి పిలిపించే ప్యాకర్స్ మూవర్స్ వరకూ ప్రతి ఒక్కరూ ఆన్లైన్ మీదే ఆధారపడుతున్నారు. మనుషులు తమ అవసరాన్ని ఒక మాయాలోకం ద్వారా ఆస్వాదిస్తున్నారు. ఇలా కొందరు వింతానుభూతులు పొందితే.. మరకొందరు మోసపోయారు. ఇందులో మధురానుభూతి పొందిన వారు వేళ్లల్లో లెక్కించేలా ఉన్నాయి సర్వేలో తెలిపిన గణాంకాలు.

  • Written By:
  • Publish Date - May 4, 2023 / 07:45 PM IST

ఈ ఆన్లైన్ మోసాలు పలురకాలా మాధ్యమాల్లో విరివిగా జరుగుతూ ఉంటాయి. ఇందులో ప్రప్రదమంగా క్రెడిట్.. డెబిట్ కార్డులకు సంబంధించిన మొసాలు. ఇవి చాలా రకాలుగా ఉంటాయి. కొందరికి బ్యాంక్ మేనేజర్లమని మరికొందరికి మీరు క్రెడిట్ కార్డు లిస్ట్లో ఎలిజిబుల్ అయ్యారని ఆర్థిక నేరాలకు పాల్పడుతూ ఉంటారు. ఇంకొందరికి అయితే మీకు లక్షరూపాయలు లోన్ మంజూరు అయ్యిందని చెప్తారు. అకౌంట్.. కార్డ్ వివరాలతోపాటూ ఓటీపీ చెబితే మీ అకౌంట్లో నగదు జమ అవుతుందని మాయమాటలు చెప్పి మంచినీళ్లు తాగినంత సులభంగా మనుషుల బ్యాంక్ ఖాతాల్లోని నగదును దోచేస్తున్నారు. ఇలా మొసపోయిన వారి శాతం మన భారతదేశంలో గడిచిన మూడేళ్లుగా చాలా పెద్దమొత్తంలోనే ఉంది. కేవలం ఈ వేదిక ద్వారా 23 శాతం మంది నష్టపోయినట్లు లోకల్ సర్కిల్స్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఇక వ్యక్తిగతంగా చూస్తే ప్రతి పదిమందిలో నలుగురు మోసాల బారిన పడినట్లు వెల్లడైంది.

ఇక ఆన్లైన్ మార్కెట్, ఈ కామర్స్, గ్రోసెరీస్ లను మరో సైబర్ నేరాల ప్లాట్ ఫాం గా చెప్పవచ్చు. ఇందులో ఏమాత్రం ఏమరపాటుగా ఉంటే మన ఖాతాలనే కాదు మనల్ని కూడా అమ్మకానికి పెట్టేస్తారు. మసి పూసి మారేడు కాయ చేయడం అనే సామెత దీనికి బాగా అన్వయం అవుతుంది. చూపించేది ఒకటి.. డెలివరీ చేసేది మరోకటి. రిటర్న్ పాలసీ ఉండకుండా ముందుగానే మోసానికి మనల్ని బాధ్యున్ని చేసేలా కొన్ని ఈ కామర్స్ సైట్లు వెలుగులోకి వచ్చాయి. ఇలా ఇందులో మొసపోయిన వారి శాతం 13గా తేల్చింది ఈ సర్వే. ఇలా మొసపోవడానికి ప్రధాన కారణం మనం యూట్యూబ్, లేదా వెబ్ సైట్లు చూస్తున్నప్పుడు వచ్చే ప్రకటనలు, ఆకర్షణీయమైన వస్తువులు చూసి వాటిపై టచ్ చేస్తారు. ఇలా చేసినప్పుడు మనల్ని ఆకర్షించి బుకింగ్ చేసేలా ఆద్భుతమైన ఆఫర్లు పెడతారు. దీంతో వీటి మాయలోపడి ఆర్డర్ పెడతారు. వచ్చాక తెలుస్తుంది అది ఎలాంటి క్వాలిటీ వస్తువో అని. ఇలా జరిగినప్పుడు వినియోగదారునికి ఒక చిన్నపాటి తృప్తిని కూడా కలుగజేస్తారు. మనం పెట్టింది తక్కువ ధరే కదా.. దానికి తగ్గట్టుగానే వస్తువు వచ్చింది అనుకునేలా పిండికొద్ది రొట్టే అనే నానుడిని నెమరువేసుకునేలా చేస్తారు.

ఇప్పుడు అసలైన డబుల్ ధమాకా మొసం గురించి తెలుసుకుందాం. ఇప్పటి వరకూ గుడ్డికన్నా మెల్ల మేలు అనేలా వ్యవహరించిన ఆన్లైన్ వెబ్ సైట్లు ఇప్పుడు పూర్తిగా దోచేసే ప్రయత్నం చేస్తాయి. ఆర్డర్ పెట్టిన వస్తువును అస్సలుకే మొసం అనేలా డెలివరీ చేయకుండా డబ్బులు మాత్రం ఆన్లైన్ లో చెల్లించమంటాయి. డెలివరీకి 5 రోజుల నుంచి వారం గడువు ఉండేలా నిబంధనలు పెడతాయి. వారం తరువాత డెలివరీ అవ్వని వ్యక్తి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా ఈ లోపూ నేరగాడు మకాం మార్చేసే వెసులుబాటు ఉండేలా వ్యూహాలు రచిస్తున్నాడు. ఇక బాధితుడికి వస్తువు లేక.. అటు కంప్లైంట్ చేసే వీలు లేక అంతటితో జాగ్రత్తపడి పోయిన డబ్బును వదిలేసుకుంటున్నాడు. ఇలా మోసపోయిన వారు దాదాపు 10శాతం ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది.

Online Crime

పైవన్నీ కాకుండా మరికొన్ని వెలుగులోకి వచ్చాయి. అందులో ఏటీఎం మోసాలు, మరికొన్ని బ్యాంకు మోసాలు ఉన్నట్లు తెలిసింది. నగదు డిపాజిట్ చేసుకొని బ్యాంకులు బోర్డ్ తిప్పేయడం, ఏవో ఒక ఛార్జీల పేరుతో నగదు అకౌంట్లో నుంచి కట్ చేయడం లాంటివి కూడా 10శాతం వరకూ జరిగినట్లు లోకల్ సర్కిల్ సర్వేలో తేలింది.

సర్వే వివరాలు ఇలా..

దేశవ్యాప్తంగా సర్వే చేసిన జిల్లాలు 331, అందులో అభిప్రాయాలు సేకరించిన వారి సంఖ్య 32వేలు, ఇందులో పురుషుల శాతం 66 కాగా మహిళల శాతం 34గా ఉంది. ఇందులో మోసపోయి డబ్బు తిరిగిపొందిన వారు 24 శాతం ఉన్నారు. పూర్తిగా మోసపోయి ఏ పరిష్కారం లభించని వారు 76 శాతం మంది ఉన్నారు. ఈ సర్వేలో పాల్గొన్న కుటుంబ సభ్యుల సంఖ్య 30శాతం. అందులో ఒక్కో కుటుంబంలో ఒక సభ్యుడు సైబర్ నేరగాళ్ల బారిన పడ్డట్లు గుర్తించారు. అలాగే 9 శాతం కుటుంబాల్లో అయితే ఒకరికి మించి మోసపోయిన వాళ్లు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. ఇలాంటి సైబర్ కేటుగాళ్ల బారినుంచి తప్పించుకున్న వాళ్లూ లేకపోలేదు. దేశ వ్యాప్తంగా చేసిన సర్వేలో 57 శాతం మంది వీరి వలకు చిక్కకుండా జాగ్రత్తపడినట్లు తెలిపారు.

ఇలా సైబర్ నేరగాళ్లు కొంతో గొప్పో సాంకేతిక పరిజ్ఞానాన్ని పొంది దానిని దుర్వినియోగం చేస్తున్నారని చెప్పాలి. ఇలాంటి ఆన్లైన్ మార్కెట్ లో మోసాలు పునరావృత్తం కాకుండా ప్రభుత్వాలు కఠినమైన నిబంధనలు అమలుచేయాలని చెప్పక తప్పదు.

 

T.V.SRIKAR