Pakistan Man: జీవిత భాగస్వాముల కోసం దేశాలు దాటుతున్న ఘటనలు ఈ మధ్య పెరిగిపోతున్నాయి. ఇప్పుడు అలాంటిదే మరో స్టోరీ హైదరాబాద్‌లో జరిగింది. భార్య కోసం పాకిస్థాన్ నుంచి నేపాల్ ద్వారా హైదరాబాద్‌కు వచ్చాడు ఓ యువకుడు. అడ్డదారిలో ఆధార్ కార్డ్ సంపాదించే క్రమంలో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. పాకిస్థాన్‌కు చెందిన ఫయాజ్ అహ్మద్ ఉపాధి కోసం 2019లో షార్జా వెళ్లాడు. అదే టైంలో హైదరాబాద్ కిషన్ బాగ్ ప్రాంతానికి చెందిన నేహా ఫాతిమా అనే మహిళ కూడా ఉపాది కోసం షార్జా వెళ్లింది.
అక్కడే వీళ్లిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కొద్దిరోజులు ప్రేమగా మారడంతో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీళ్లిద్దరికి ఓ బాబు కూడా ఉన్నాడు. గతేడాది ఫాతిమా ఒక్కతే హైదరాబాద్‌కు వచ్చింది. తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పింది. దీంతో ఫయాజ్‌ను ఇండియాకు వచ్చేయమని చెప్పారు నేహా తల్లిదండ్రులు. టూరిస్ట్ వీసా ద్వారా పాకిస్థాన్ నుంచి నేపాల్ వచ్చిన ఫయాజ్.. రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ చేరుకున్నాడు. ఇక్కడే ఫయాజ్‌కు ఆధార్ కార్డ్ తయారు చేయించేందుకు నేహా తల్లిదండ్రులు ప్రయత్నించారు.
కానీ ఈ విషయాన్ని పసిగట్టిన పోలీసులు ఫయాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఫయాజ్‌ను పోలీసులు అరెస్ట్ చేయగానే అతని అత్త, మామ పారిపోయారు. పాకిస్థానీ పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకుని ఫయాజ్ మీద కేసు నమోదు చేశారు పోలీసులు.