Pinduoduo: చైనా యాప్స్ అంటేనే యూజర్లకు భయం. తమ డేటా ఎక్కడ చోరీకి గురవుతుందేమో అని. నిజంగానే చైనా యాప్స్ చాలా వరకు యూజర్ల డేటాను చోరీ చేస్తుంటాయి. అందుకే ఇండియా సహా అనేక దేశాలు పలు చైనా యాప్స్‌పై నిషేధం విధించాయి. అయినప్పటికీ చైనా యాప్స్ ఈ విషయంలో వెనక్కితగ్గడం లేదు. తాజాగా లీడింగ్ చైనా యాప్ ఒకటి యూజర్ల డేటా చోరీ చేస్తున్నట్లు తేలింది. దీంతో ఈ యాప్‌ను తమ ప్లే స్టోర్ నుంచి తొలగిస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. అదే.. పిండువోడువో యాప్. అయితే, ఈ యాప్ చోరీ చేసిన డేటా గురించి తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం. నిబంధనలు అతిక్రమించి అక్రమాలకు పాల్పడింది ఈ యాప్. అయినా, దీనిపై చర్యలు తీసుకునేందుకు చైనా ప్రభుత్వం ముందుకు రావడం లేదు.
టాప్ షాపింగ్ యాప్
చైనా యూజర్లలో నాలుగింట మూడొంతుల మంది వాడే టాప్ షాపింగ్ యాప్ పిండువోడువో. ప్రముఖ షాపింగ్ యాప్ ఈబే కంటే దీని విలువ మూడు రెట్లు ఎక్కువ. 2015లో గూగుల్ మాజీ ఉద్యోగి కోలిన్ హువాంగ్ ఈ యాప్ ప్రారంభించారు. మొదట్లో గ్రామీణ ప్రాంతాలే లక్ష్యంగా ఈ యాప్ పని చేసింది. భారీ డిస్కౌంట్లతో వినియోగదారులకు దగ్గరైంది. తర్వాత నెమ్మదిగా పట్టణ వినియోగదారుల్ని కూడా ఆకట్టుకుంది. చైనాలో టాప్ ఈ-కామర్స్ సంస్థలైన అలీబాబా, జేడీ.కామ్ సంస్థలకు పోటీగా మారింది. ఆ తర్వాత నెమ్మదిగా టాప్ షాపింగ్ యాప్స్‌లో ఒకటిగా నిలిచింది.
డేటా చోరీ బయటపడిందిలా..
పిండువోడువో యాప్‌లో మాల్‌వేర్ ఉన్నట్లు గత ఫిబ్రవరిలో అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇది నిజమేనని నిర్ధరిస్తూ చైనా సెక్యూరిటీ సంస్థ డార్క్ నేవీ ఒక నివేదిక విడుదల చేసింది. అయితే, నేరుగా యాప్ పేరు ప్రకటించలేదు. కానీ, తర్వాత ఇతర సైబర్ నిపుణులు దీనిపై మరింత లోతుగా పరిశోధన చేసి పిండువోడువో యాప్ యూజర్ల డేటా చోరీ చేస్తున్నట్లు గుర్తించారు. ప్రత్యేక మాల్‌వేర్‌తో డేటా దొంగిలిస్తున్నట్లు తేల్చారు. ఇది షాపింగ్ యాప్ కాదు.. డేటా చోరీ యాప్ అని తేల్చారు.
75 కోట్ల మంది డేటా చోరీ..
పిండువోడువో యాప్ వాడుతున్న యూజర్ల అందరి డేటా సంస్థ చేతిలోకి వెళ్లింది. దాదాపు 75 కోట్ల మంది డేటాను ఈ సంస్థ చోరీ చేసింది. మాల్‌వేర్ ద్వారా యూజర్ల ఫోన్‌లోని మొత్తం సమాచారాన్ని ఈ యాప్ సేకరించింది. యూజర్ల ఫోన్ లొకేషన్, కాంటాక్ట్స్, క్యాలెండర్స్, నోటిఫికేషన్లు, గ్యాలరీ, ఇతర సమాచారం మొత్తాన్ని యాక్సెస్ చేసింది. ఇతర యాప్స్ సమాచారాన్ని సేకరించింది. ఇంకా చెప్పాలంటే యూజర్ల ఫోన్లలోని మొత్తం సమాచారాన్ని ఈ యాప్ ద్వారా యాక్సెస్ చేసింది.
చివరకు యూజర్ల ఫోన్ సెట్టింగ్స్ కూడా ఈ యాప్ ద్వారా మార్చే వీలుంది. మరోవైపు ఈ యాప్ ఫోన్ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతూనే ఉంటుంది. దీనివల్ల ఈ యాప్ డిలీట్ చేయడం అంత ఈజీ కాదని నిపుణులు అంటున్నారు. నిజానికి ఏదైనా యాప్ ఇలా యూజర్ల సమాచారాన్ని సేకరించాలంటే వాళ్ల అనుమతి తప్పనిసరి. అది కూడా దేనికి అనుమతిస్తే ఆ సమాచారాన్ని మాత్రమే యాప్స్ యాక్సెస్ చేయగలవు. కానీ, పిండువోడువో యాప్ మాత్రం యూజర్ల అనుమతి లేకుండానే ఈ సమాచారాన్ని సేకరించింది. దీని ద్వారా యూజర్లకు వారి అభిరుచికి అనుగుణంగా నోటిఫికేషన్లు, యాడ్స్ ఇచ్చి సొమ్ము చేసుకుంది.
ఆరోపణలపై సంస్థ స్పందన ఇదీ
అయితే, డేటా చోరీ ఆరోపణల్ని పిండువోడువో యాజమాన్యం తోసిపుచ్చింది. తాము డేటా చోరీ చేయడం లేదని బుకాయించింది. ఈ ఆరోపణలు రావడంతో గత నెలలో కొత్త వెర్షన్ రిలీజ్ చేసింది. అయితే, ఈ యాప్ కూడా సురక్షితం కాదని టెక్ నిపుణులు చెబుతున్నారు. కొత్త యాప్‌లో కూడా ఒక అండర్ లైయింగ్ కోడ్ ఉందని, దీని ద్వారా భవిష్యత్తులో ఎప్పుడైనా డేటా చోరీ చేసేందుకు అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక ఈ సంస్థ తమ కంపెనీకి చెందిన పలువురు టెక్ నిపుణుల్ని, తమ అనుబంధ సంస్థ అయిన టెమూకు మార్చింది. టెమూ యాప్‌ను అమెరికాతోపాటు, ఇతర వెస్టర్న్ కంట్రీస్‌లో ఎక్కువగా వాడుతున్నారు. దీంతో ఇప్పడు ఈ దేశాలు కూడా టెమూపై సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. పిండువోడువోపై ఆరోపణల నేపథ్యంలో ఈ యాప్‌ను తమ ప్లే స్టోర్ నుంచి తొలగిస్తున్నట్లు గూగుల్ గత నెలలో ప్రకటించింది.
చైనా ప్రభుత్వ చర్యలు శూన్యం
పిండువోడువోపై ఇన్ని ఆరోపణలు వచ్చినప్పటికీ చైనా ప్రభుత్వం మాత్రం స్పందించలేదు. దీనిపై చర్యలు తీసుకునేందుకు చైనా ముందుకురావడం లేదు. డేటా చోరీకి పాల్పడ్డ పిండువోడువోపై నిషేధం విధించాలని నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. సాధారణంగా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న యాప్స్ జాబితాను చైనా ప్రభుత్వం తరచూ విడుదల చేస్తుంటుంది. వాటిపై చర్యలు తీసుకుంటూ ఉంటుంది. అయితే, ఈ జాబితాలో ఇప్పటివరకు పిండువోడువో మాత్రం లేదు. దీనిపై చర్యలు కూడా లేవు. ఈ అంశంపై అక్కడి నిపుణుల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.