Train Tragedy: వందేభారత్‌పై పెట్టిన శ్రద్ధ కవచ్‌పై లేదేందుకు? మోదీకి ప్రయాణికుల సేఫ్టీ అంటే లెక్కలేదా?

ఈ 9 ఏళ్లలో కవచ్‌ని దేశవ్యాప్తంగా ప్రమాద రూట్లలో విస్తరించేందుకు మోదీ సర్కార్‌ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పరీక్షలు, పర్యవేక్షణలతోనే కాలం వెళ్లదీశారు. అదే సమయంలో వందే భారత్‌ ట్రైన్లకు నిధులు భారీగా కేటాయించారు.

  • Written By:
  • Publish Date - June 3, 2023 / 03:57 PM IST

Train Tragedy: రాజకీయాలకు ఇది సమయం కాకపోవచ్చు. కానీ చేసిన తప్పులను ఎత్తిచూపకపోతే అదే తప్పు పదేపదే చేస్తారు. ఒడిశాలో రైళ్ల ప్రమాద ఘటన తర్వాత కవచ్‌ సిస్టమ్‌పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ప్రమాదాలను నివారించే ఈ వ్యవస్థను మోదీ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రమాదాలు ముందుగా చెప్పి రావు.. మృత్యువు కూడా అంతే..! కానీ అవి జరగకుండా అరికట్టడం.. అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకొని వాటి తీవ్రతను తగ్గించడం ప్రభుత్వ కర్తవ్యం.

మానవ తప్పిదమో.. వ్యవస్థలోనే లోపముందో తెలియదు కానీ.. ఒడిశా రైళ్ల ప్రమాద ఘటన ట్రైన్ సేఫ్టీపై చర్చకు దారి తీసింది. టెక్నాలజీ అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో మూడు ట్రైన్లు ఢీకొనడంపై నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఒకప్పటితో పోలిస్తే ట్రైన్ యాక్సిడెంట్లు చాలా వరకు తగ్గాయి. ఇవి అప్పుడప్పుడు జరుగుతున్నా వాటి తీవ్రత మాత్రం తక్కువగానే ఉంటోంది. ఈ సారి మాత్రం ప్రమాద తీవ్రత మునుపెన్నడూ లేని విధంగా కనిపిస్తోంది. దీనికి కేవలం రైల్వే అధికారులను నిందించి లాభం లేదు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.
కవచ్‌ అభివృద్ధి ఏదీ?
ఆసియాలోనే అతి పెద్ద రైల్వే వ్యవస్థ కలిగిన దేశం మనది. భారతీయ రైల్వేల మొత్తం రూట్ పొడవు 68,043 కిలోమీటర్లు. ఇంతటి నెట్‌వర్క్‌ కలిగిన మన దేశంలో ట్రైన్ సేఫ్టీ మాత్రం అంతంతమాత్రమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కవచ్‌ సిస్టమ్‌ని దేశవ్యాప్తంగా విస్తరించడంలో మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైనట్టు గణాంకాలు చూస్తే అర్థమవుతుంది. 68వేల కిలోమీటర్ల పొడవున్న రైల్వే రూట్‌లో కేవలం 1,445 కిలోమీటర్లలో మాత్రమే కవచ్‌ సిస్టమ్‌ అందుబాటులో ఉంది. ఇది మొత్తం రైల్వే రూట్లలో 2శాతం మాత్రమే.
రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చి ఢీకొనడాన్ని కవచ్‌ సిస్టమ్‌ నివారిస్తుంది. 2011-12లో అప్పటి రైల్వేశాఖ మంత్రిగా ఉన్న పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈ సిస్టమ్‌ను ప్రవేశపెట్టారు. “ట్రైన్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్ (TCAS)” వ్యవస్థను అభివృద్ధి చేశారు. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వ్యవస్థ పేరును ‘కవచ్‌’గా మార్చారు. ఈ 9 ఏళ్లలో కవచ్‌ని దేశవ్యాప్తంగా ప్రమాద రూట్లలో విస్తరించేందుకు మోదీ సర్కార్‌ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పరీక్షలు, పర్యవేక్షణలతోనే కాలం వెళ్లదీశారు. అదే సమయంలో వందే భారత్‌ ట్రైన్లకు నిధులు భారీగా కేటాయించారు. ఈ హై స్పీడ్‌ ట్రైన్లను ప్రారంభించేందుకు మోదీ దాదాపు ప్రతి రాష్ట్రానికి వస్తున్నారు. భవిష్యత్తను దృష్టిలో ఉంచుకొని ఈ తరహా ట్రైన్లను అభివృద్ది చేయడం మంచి విషయమే. కానీ అదే సమయంలో రైలు ఎక్కిన వాళ్లకి భద్రత కల్పించాల్సిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వంపై ఉంటుంది. కానీ బీజేపీ ప్రభుత్వానికి అవేవీ పట్టవు. అటు రైల్వేలు ప్రైవేటికరణ దిశగా వేగంగా అడుగులు వేస్తున్న సమయంలో కేంద్రం నుంచి ఈ తరహా సేఫ్టీని ఆశించడం మన అత్యాశే అవుతుంది.