PM Modi: ఒడిశా రైలు ప్రమాద ఘటన ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది. అత్యంత విషాదకర ఘటన ఇది. దాదాపు 260 మందికిపైగా మరణించినట్లు అధికారులు ప్రకటించారు. వెయ్యి మందికిపైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా అత్యవసర సమావేశం నిర్వహించారు. ఘటన తీవ్రత నేపథ్యంలో ప్రధాని మోదీ ఒడిశాలోని ఘటనాస్థలాన్ని సందర్శించబోతున్నారు. మొదట బాలాసోర్‍లోని ప్రమాద స్థలాన్ని పరిశీలించిన అనంతరం, కటక్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శిస్తారు. కొద్దిసేపట్లో మోదీ.. భువనేశ్వర్ చేరుకుంటారు. అక్కడి నుంచి బాలాసోర్ వెళ్తారు. ప్రస్తుతం క్షతగాత్రులకు కటక్, భువనేశ్వర్‌లోని ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గురైన రైళ్లలో 200 మందికిపైగా తెలుగు వాళ్లు ఉంటారని అంచనా. రిజర్వేషన్ జాబితాలో చాలా మంది తెలుగువాళ్ల పేర్లున్నాయి. మృతుల్లో ఎక్కువ మంది తమిళనాడు వాసులే ఉన్నారు.
సహాయక చర్యల్లో 1200 మంది సిబ్బంది
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే 300 మంది వరకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఇతర విభాగాలకు చెందిన మొత్తం 1200 మంది ఈ సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ప్రయాణికుల్ని తరలించేందుకు 200 అంబులెన్సులు, 50 వరకు బస్సుల్ని ఏర్పాటు చేశారు. 45 మొబైల్ ఆరోగ్య కేంద్రాలను కూడా సిద్ధం చేశారు. కటక్ నుంచి వచ్చిన 25 మంది వైద్య బృందాలతోపాటు మరో 50 మంది వైద్యులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. అలాగే ఫోరెన్సిక్ మెడిసిన్ నిపుణులు కూడా ఈ పనుల్లో పాలుపంచుకున్నారు. తీవ్రంగా గాయపడి, అత్యవసర వైద్య చికిత్స అవసరమైన వారి కోసం వైద్య బృందాలున్న రెండు ఆర్మీ హెలికాప్టర్లను కూడా రంగంలోకి దించారు. బాధితులకు నీళ్లు, టీ, ఆహారం వంటివి అందే ఏర్పాట్లు కూడా చేశారు.
పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
రైలు ప్రమాదానికి సంబంధించి రైల్వే శాఖ మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ప్రకటించింది. అలాగే తీవ్రంగా గాయపడ్డవారికి రూ.2 లక్షలు, స్వల్ప గాయాలైన వారికి రూ.50 వేలు అందిస్తామని రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్ ప్రకటించారు. ప్రధాని మోదీ కూడా తనవంతు సాయం ప్రకటించారు. ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు అందజేస్తామని ప్రకటించారు. మరోవైపు ఈ ఘటనపై నిజానిజాలు నిగ్గుతేల్చేందుకు ఉన్నతస్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది.
స్థానికుల రక్తదానం
ప్రమాద సమాచారం అందుకున్న తర్వాత చాలా మంది స్థానికులు సహాయక చర్యలకు ముందుకొచ్చారు. అనేక మంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. క్షతగాత్రులకు వైద్యం అందించేందుకు రక్తం అవసరం కావడంతో.. వందలాది మంది రక్తదానానికి ముందుకొచ్చారు. బ్లడ్ డొనేషన్ సెంటర్లకు క్యూ కట్టారు.