Apsara Death Case: మహిళతో వివాహేతర సంబంధం.. పెళ్లి చేసుకోమన్నందుకు దారుణంగా హత్య చేసిన పూజారి!

వివాహేతర సంబంధాలు హత్యకో, ఆత్మహత్యకో దారితీస్తాయని అనేక సంఘటనలు నిరూపిస్తున్నాయి. అయినా.. ఇలాంటి విషయాల్లో కొందరు అప్రమత్తం కావడం లేదు. తాజాగా సరూర్ నగర్ పరిధిలో జరిగిన అప్సర హత్య దీనికి మరో ఉదాహరణ. సమాజం అంగీకరించని ఇలాంటి సంబంధాలు విషాదాలతోనే ముగుస్తాయని అప్సర ఘటన మరోసారి రుజువు చేసింది.

Apsara Death Case: హైదరాబాద్ పరిధిలో దారుణ హత్య వెలుగు చూసింది. మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించిన పెళ్లైన పూజారి, ఆమెను దారుణంగా హత్య చేశాడు. పెళ్లి చేసుకొమ్మని అడిగినందుకే ఆమెను హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సరూర్ నగర్ తహసీల్దార్ కార్యాలయానికి దగ్గర్లో ఉన్న గుడిలో వెంకటసాయి సూర్యకృష్ణ పూజారిగా పని చేస్తున్నాడు. అతడికి పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, సాయికృష్ణకు అప్సర అనే యువతి పరిచయమైంది. అప్సర, సాయికృష్ణ ఇద్దరూ బంధువులు అవుతారు. తర్వాత ఇది ఇద్దరిమధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. సాయికృష్ణకు పెళ్లైందని తెలిసినప్పటికీ అప్సర అతడిని ఇష్టపడింది. ఈ క్రమంలో గతంలో అప్సర గర్భం దాల్చినట్లు తెలిసింది. అయితే, సాయికృష్ణ.. అప్సరకు అబార్షన్ చేయింంచాడు. చాలా కాలం నుంచి ఇద్దరిమధ్య సంబంధం కొనసాగడంతో తనను పెళ్లి చేసుకోవాలని సాయికృష్ణపై అప్సర ఇటీవల ఒత్తిడి తెచ్చింది. అయితే, పెళ్లి తప్పించుకునేందుకు సాయికృష్ణ చాలా రకాలుగా ప్రయత్నించాడు. కానీ, అప్సర ఈ విషయంలో పట్టుబట్టింది. దీంతో ఎలాగైనా అప్సరను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాడు.
పక్కా ప్లాన్‌తోనే
పెళ్లి విషయంలో తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో ఎలాగైనా అప్సరను అంతమొందించాలని సాయికృష్ణ నిర్ణయించుకున్నాడు. దీని కోసం పక్కా ప్లాన్ సిద్ధం చేశాడు. ఇంట్లో బెల్లం దంచే దుడ్డు కర్రని వెంట తీసుకుని తన కారులో వెళ్లాడు. అప్సర.. కోయంబత్తూరు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పింది. తర్వాత అప్సరను కారులో ఎక్కించుకుని శంషాబాద్, అక్కడ్నుంచి రాళ్లగూడ వైపు వెళ్లాడు. అక్కడే వాళ్లు భోజనం చేశారు. తర్వాత కారు ఫ‌్రంట్ సీటులో అప్సర నిద్రపోతూ రిలాక్స్ అవుతూ ఉండగా, వెంట తెచ్చుకున్న దుడ్డుకర్రతో ఆమె తలపై గట్టిగా కొట్టాడు. దీంతో అప్సర అక్కడే ప్రాణాలు కోల్పోయింది. తర్వాత అప్సర మృతదేహాన్ని అదే కారులో ఉంచి, సరూర్ నగర్‌లోని ఇంటికి తీసుకెళ్లాడు. అంతేకాదు.. ఆ కారును ఇంటిముందే ఒక రోజంతా పార్కు చేసి ఉంచాడు. తర్వాతి రోజు ఉదయం అక్కడికి దగ్గర్లోని మ్యాన్‌హోల్ వద్దకు డెడ్ బాడీ తీసుకెళ్లి, అందులో పడేశాడు. పైనుంచి మట్టి కప్పాడు. వేరే వాళ్లు గమనించడంతో మ్యాన్‌హోల్ నుంచి దుర్వాసన వస్తోందని, అందుకే మట్టితో పూడుస్తున్నట్లు చెప్పాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
ఏమీ ఎరుగనట్లు పోలీసులకు ఫిర్యాదు
అప్సరను హత్య చేసిన సాయికృష్ణ ఏమీ ఎరుగనట్లు తనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్సర తనకు కోడలు అవుతుందని.. ఆమె కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్సర తల్లిదండ్రులు కూడా పోలీసుల్ని ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. నిందితుడితో కలిసి పోలీసులు కూడా చాలా చోట్ల వెతికారు. తర్వాత సీసీ కెమెరాలు, సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా విచారణ జరపగా.. సాయికృష్ణ, అప్సర సెల్‌ఫోన్లు ఒకేచోట ఉన్నట్లు అనుమానం రావడంతో అతడిపై పోలీసులకు అనుమానం వచ్చింది. గురువారం సాయికృష్ణను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా నిందితుడు తన నేరం అంగీకరించాడు. జరిగిన ఘటనను మొత్తం వివరించాడు.
ఈ నెల 3నే హత్య
అప్సరను సాయికృష్ణ ఈ నెల మూడో తేదీనే హత్య చేశాడు. ఆ తర్వాతి రోజు మ్యాన్‌హోల్‌లో పడేయడం.. పోలీసులకు ఫిర్యాదు చేయడం వంటివి చేశాడు. తనకు అప్సరతో వివాహేతర సంబంధం ఉందని, పెళ్లి చేసుకోవాలని తనను హింసకు గురి చేసిందని సాయికృష్ణ పోలీసుల విచారణలో వెల్లడించాడు. సాయికృష్ణ చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు మ్యాన్‌హోల్‌ నుంచి అప్సర మృతదేహాన్ని వెలికితీసి, పోస్టుమార్టం కోసం తరలించారు. హత్యలో ఉపయోగించిన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టమ్ తర్వాతే అసలు విషయాలు వెల్లడవుతాయి.
ఇరు కుటుంబాలకు తెలియదా?
అప్సర, సాయికృష్ణ వ్యవహారం ఇంతవరకు రెండు కుటుంబాలకు తెలియకపోవడం విశేషం. ముఖ్యంగా సాయికృష్ణ ఇంట్లో.. అసలు అప్సర ఎవరో కూడా తెలియదని, తాము ఆమెను ఎప్పుడూ చూడలేదని అంటున్నారు. అయితే, అప్సర కుటుంబానికి సాయికృష్ణ పరిచయమే. అప్పడప్పుడూ తను వాళ్లింటికి వెళ్లేవాడు. కొన్నిసార్లు అర్ధరాత్రి వరకు అక్కడే ఉండేవాడు. కొన్నిసార్లు ఇద్దరూ కలిసి బయటకు కూడా వెళ్లేవాళ్లని అప్సర తల్లి, ఇంటి ఓనర్ చెబుతున్నారు. చివరగా అప్సర బయటకు వెళ్లేముందు.. తాను కోయంబత్తూరు వెళ్తున్నట్లు, సాయికృష్ణ తనను శంషాబాద్‌లో దింపుతాడాని ఇంట్లో చెప్పింది. తర్వాత ఆమె కుటుంబ సభ్యులు సాయికృష్ణకు ఫోన్ చేయగా.. పొంతనలేని సమాధానాలు చెప్పాడని ఆమె తల్లి తెలిపింది. అయితే, సాయికృష్ణ-అప్సర మధ్య ఇంత వ్యవహారం జరుగుతున్నా.. వారి సంబంధం గురించి కుటుంబ సభ్యులకు తెలియకపోవడం గమనార్హం. కాగా, అప్సర గతంలో ఒక తమిళ చిత్రంలో కూడా నటించింది. తర్వాత సినిమాలు వద్దనే ఉద్దేశంతోనే ఆ కుటుంబం హైదరాబాద్ వచ్చినట్లు తెలుస్తోంది.