France Protests: యూరప్ దేశమైన ఫ్రాన్స్.. ఆందోళనలు, హింసతో అట్టుడుకుతోంది. దేశవ్యాప్తంగా వేలాది మంది జనం హింస, దోపిడీ, ఘర్షణలకు పాల్పడుతున్నారు. మంగళవారం 17 ఏళ్ల యువకుడి మృతితో మొదలైన హింస నాలుగు రోజులు దాటిపోయినా కొనసాగుతోంది. ఈ ఘర్షణల్ని అదుపు చేయడానికి దాదాపు 45,000 మందికిపైగా సైన్యం రంగంలోకి దిగింది.
ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ నగరంలో 17 ఏళ్ల అల్జీరియన్-మొరాకో సంతతికి చెందిన నహేల్ అనే యువకుడిని ట్రాఫిక్ పోలీసు మంగళవారం కాల్చి చంపాడు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించాడన్న కారణంతో అతడిపై పోలీసు కాల్పులు జరిపాడు. కారులో ఉన్న నహేల్ గతంలో కూడా ట్రాఫిక్ పోలీసులకు సహకరించలేదని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో నహేల్ మళ్లీ కారుతో ఎవరిమీదకైనా ఎక్కిస్తాడేమో అన్న అనుమానంతో ట్రాఫిక్ పోలీసు అతడిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆ యువకుడు మృతి చెందాడు. దీంతో స్థానిక ప్రజలు ఆందోళనకు దిగారు. ముందుగా పారిస్ నగరంలో నహేల్ స్మారక ర్యాలీ నిర్వహించగా, అది హింసకు దారి తీసింది. దీంతో ఆందోళనకారులకు, ప్రభుత్వానికి, పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది.
హింసాత్మకంగా ఆందోళనలు
నహేల్ మృతిని నిరసిస్తూ మొదలైన ఆందోళనలు మిన్నంటాయి. పారిస్ నగరంతోపాటు దేశవ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దేశమంతా ఘర్షణ వాతావరణమే కనిపిస్తోంది. ఆందోళనకారులు పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం నిర్వహిస్తున్నారు. అనేక చోట్ల షాపింగ్ మాల్స్, కార్లు, ఇతర వాహనాలను ధ్వంసం చేస్తున్నారు. అనేక చోట్ల నిప్పుపెట్టి పలు ఆస్తుల్ని దహనం చేస్తున్నారు. దోపిడీలు, దొంగతనాలు కూడా పెరిగిపోయాయి. స్ట్రాస్‌బర్గ్‌లోని యాపిల్ స్టోర్‌లోకి చొరబడ్డ ఆందోళనకారులు అక్కడి ఉత్పత్తుల్ని తీసుకెళ్లారు. మార్సెల్లి పట్టణంలోని ఒక షాపులోకి చొరబడి, గన్స్ ఎత్తుకెళ్లారు. లియోన్ పట్టణంలోనూ ఆందోళనకారులు హింసకు పాల్పడుతున్నారు. అనేక వాహనాలు, షాపుల్ని ధ్వంసం చేస్తూ ముందుకు కదులుతున్నారు. పోలీసులపై రాళ్లు రువ్వుతున్నారు. కొన్నిచోట్ల పోలీసులపై కాల్పులు కూడా జరుపుతున్నారు. ఈ ఘటనల్లో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. పలుచోట్ల పోలీసులతో ఆందోళనకారులు ఘర్షణలకు దిగుతున్నారు. పరిస్థితిని అదుపు చేసేందుకు దాదాపు 45,000 మంది సిబ్బందిని సైన్యం రంగంలోకి దింపింది. ఘర్షణల్ని ఆపేందుకు పోలీసులు టియర్ గ్యాస్, లాఠీఛార్జి ప్రయోగిస్తున్నారు. మంగళవారం మొదలైన ఆందోళనలు శనివారం కూడా కొనసాగుతున్నాయని స్థానిక మీడియా వెల్లడించింది. ఇప్పటివరకు పోలీసులు 600 మందికిపైగా ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనల్లో 200 మందికిపైగా పోలీసులకు గాయాలయ్యాయి. ఒక పౌరుడు మరణించాడు. ఆందోళనకారుల్లోనూ కొందరు గాయపడ్డారు.
సోషల్ మీడియాపై ఆంక్షలు
ఈ ఘర్షణలు చెలరేగిపోవడానికి ప్రధాన కారణం.. సోషల్ మీడియా. టిక్‌టాక్, స్నాప్ చాట్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో జరుగుతున్న దుష్ప్రచారం, హింసాత్మక ఘటనల వీడియోలు, అంశాల ప్రచారంతో ఆందోళనలు మరింత పెరుగుతున్నాయి. దీంతో వీటిని అదుపు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలో సోషల్ మీడియాపై ఆంక్షలు విధించింది. ఈ ఘర్షణలు మొదలైన సమయంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్ బ్రస్సెల్స్‌లో ఉన్నారు. అక్కడ ఈయూ శిఖరాగ్ర సదస్సులో ఆయన పాల్గొంటున్నారు. ఫ్రాన్స్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో ఆయన తన పర్యటను అర్ధాంతరంగా ముగించుకుని, స్వదేశం చేరుకున్నారు. శాంతి భద్రతలపై అధికారులతో సమీక్ష జరిపారు. పరిస్తితిని అదుపులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. దేశంలో శాంతి పనరుద్ధరణ కోసం అవసరమైతే ఎమర్జెన్సీ కూడా ప్రకటిస్తామని ఫ్రాన్స్ ప్రధాని ఎలిజబెత్ బోర్న్ వివరించారు. ఈ ఆందోళనల్లో ఎక్కవగా పాల్గొంటుంది యువతే అని అక్కడి ప్రభుత్వం నిర్ధరణకు వచ్చింది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఇంట్లోనే, అదుపులో ఉంచుకోవాలని ప్రభుత్వం సూచించింది. అరెస్టైన ఆందోళనకారుల్లో ఎక్కువ మంది యువతే ఉన్నారని పోలీసులు తెలిపారు.
పోలీసుపై కొనసాగుతున్న విచారణ..
నహేల్‌ను కాల్చిచంపిన ట్రాఫిక్ పోలీసుపై అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. పోలీసు ఉన్నతాధికారులు అతడిపై హత్య కేసు నమోదు చేశారు. కాగా, ఆ పోలీసు.. మృతుడి కుటుంబానికి క్షమాపణలు చెప్పినట్లు అతడితరఫు న్యాయవాది తెలిపారు. నిందితుడు ఉద్దేశపూర్వకంగా కాల్చి చంపలేదని, పొరపాటుగా ఈ ఘటన జరిగిందని ఆయన కోర్టుకు తెలిపారు. పోలీసు.. యువకుడి కాళ్లపై కాల్చాలనుకున్నప్పటికీ, పొరపాటుగా ఛాతిలోకి బుల్లెట్ దూసుకెళ్లిందని, దీంతో నహేల్ ప్రాణాలు కోల్పోయాడని చెప్పాడు. ఈ ఘటనపై నహేల్ తల్లి మౌనిమా స్పందించారు. తమ కుమారుడు అరబ్ యువకుడిలాగా కనిపించినందుకే పోలీసు అతడిపై కాల్పులు జరిపాడని ఆమె ఆరోపించారు.
కాల్పులు సాధారణమే
ఫ్రాన్స్‌లో ట్రాఫిక్ రూల్స్‌ను కఠినంగా అమలు చేస్తారు. ట్రాఫిక్ పోలీసులు చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు. కొన్నిసార్లు దూకుడుగా కూడా వ్యవహరిస్తారు. దీంతో ట్రాఫిక్ తనిఖీల సమయంలో వారికి సహకరించకుంటే కాల్చి చంపిన ఘటనలు అనేకం ఉన్నాయి. గతంలో కూడా పోలీసులు కొందరు డ్రైవర్లు, రైడర్లను కాల్చి చంపారు. గత ఏడాది ఇలా తనిఖీల పేరుతో 13 మందిని పోలీసులు కాల్చి చంపారు. రెండు వారాల క్రితం కూడా ఒక ట్రాఫిక్ పోలీసు అధికారి 19 ఏళ్ల డ్రైవర్‌ను కాల్చి చంపాడు. తన కాళ్లను తన్నాడన్న కారణంతో ఆ పోలీసు ఈ పని చేశాడు. ఇలాంటి ఘటనలు అనేకం జరుగుతుండటంతో స్థానికుల్లో ఒక్కసారిగా ఆగ్రహం పెల్లుబికింది. దీంతో తీవ్ర ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై పోలీసు శాఖ కూడా క్షమాపణలు తెలిపింది.