Shreyas Hareesh: చిన్నారి ప్రాణం బలిగొన్న రేసింగ్.. పదమూడేళ్ల బాలుడి మృతి

బెంగళూరుకు చెందిన కొప్పరం శ్రేయస్ హరీష్ అనే పదమూడేళ్ల బాలుడు రేసింగ్‌లో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. చెన్నైలో శనివారం ఎమ్మారెఫ్ ఎంఎంఎస్‌సీ ఎఫ్‌ఎంఎస్‌సీఐ ఇండియన్ నేషనల్ మోటార్ సైకిల్ రేసింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలు జరిగాయి.

  • Written By:
  • Publish Date - August 6, 2023 / 09:20 AM IST

Shreyas Hareesh: ఇండియన్ నేషనల్ మోటార్‌‌సైకిల్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో విషాదం చోటు చేసుకుంది. బెంగళూరుకు చెందిన కొప్పరం శ్రేయస్ హరీష్ అనే పదమూడేళ్ల బాలుడు రేసింగ్‌లో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. చెన్నైలో శనివారం ఎమ్మారెఫ్ ఎంఎంఎస్‌సీ ఎఫ్‌ఎంఎస్‌సీఐ ఇండియన్ నేషనల్ మోటార్ సైకిల్ రేసింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలు జరిగాయి.

శ్రేయస్ అనే బాలుడికి రేసింగ్ అంటే చాలా ఇష్టం. దీంతో బైక్ రేసింగ్ నేర్చుకుని, జాతీయ స్థాయికి ఎదిగాడు. ఎన్నో పోటీల్లో విజేతగా నిలిచాడు. ఇటీవల పెట్రోనాస్ టీవీఎస్ ఛాంపియన్‌షిప్‌లో నాలుగు రేసుల్లో విజయం సాధించాడు. దీంతో శ్రేయస్ హరీష్ స్టార్‌‌గా గుర్తింపు పొందాడు. శనివారం మద్రాస్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో తాజా ఛాంపియన్‌షిప్ పోటీ జరిగింది. దీనిలో ఉదయం పోల్ పొజిషన్‌కు శ్రేయస్ అర్హత సాధించాడు. అనంతరం రూకీ రేసులో పాల్గొంటుండగా, మూడో రౌండ్‌లో అదుపు తప్పి కింద పడ్డాడు.

ఈ క్రమంలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ముఖ్యంగా తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే నిర్వాహకులు రేస్ ఆపించి, శ్రేయస్‌ను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. దీంతో క్రీడా రంగంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటన తర్వాత శని, ఆదివారాల్లో జరగాల్సిన టోర్నీని నిలిపివేస్తున్నట్లు నిర్వాహకులైన మద్రాస్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్ తెలిపింది.

కొంతకాలంగా వరుస విజయాలతో చాంపియన్‌గా ఎదుగుతున్న శ్రేయస్ ప్రాణాలు కోల్పోవడం రేసింగ్ ప్రపంచాన్ని విషాదంలో ముంచింది. రేసింగ్ ప్రమాదకరమైందే అయినా.. అరుదుగా ఇలాంటి ఘటనల జరుగుతుంటాయి. గత ఏడాది కేసీ కుమార్ అనే రేసర్ ప్రమాదానికి గురయ్యాడు. అతడు చికిత్స పొందుతూ గత జనవరిలో కన్ను మూశాడు.