Rajasthan: రాజస్థాన్‌లో దారుణం జరిగింది. బాలికకు కొత్త ఫోన్ ఇప్పిస్తానని చెప్పి తీసుకెళ్లి, అత్యాచారానికి పాల్పడ్డాడో ప్రభుత్వ ఉద్యోగి. ఈ ఘటన ఈ నెల 10న జరిగింది. టోడాభిమ్ ప్రాంతానికి చెందిన సునీల్ కుమార్ జాంగిడ్ అనే ప్రభుత్వం ఉద్యోగి, హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో క్యాషియర్‌గా పని చేస్తున్నాడు. బాధిత బాలిక ఘటన జరిగిన రోజు ఇంట్లో ఒంటరిగా ఉంది. ఆమె తల్లి పని కోసం బయటకు వెళ్లింది. తండ్రి జైపూర్‌లో పని చేస్తున్నారు. బాలిక ఒంటరిగా ఉండటాన్ని గమనించి, సునీల్ కుమార్ బాలిక ఇంటికి వెళ్లాడు.
ప్రభుత్వం ఒక కొత్త పథకం తీసుకొచ్చిందని, దీని ప్రకారం సెల్‌ఫోన్ ఉచితంగా ఇస్తున్నారని బాలికను నమ్మించాడు. ఈ జాబితాలో బాలిక కూడా ఉందని ఆమెను నమ్మించాడు. తనతోపాటు వస్తే వెంటనే ఆ ఫోన్ ఇప్పిస్తానని చెప్పించాడు. నిజమని నమ్మిన బాలిక తన తల్లికి చెప్పొస్తానని చెప్పింది. దీనికి అతడు అంగీకరించలేదు. ఫోన్ తీసుకున్న తర్వాత తల్లికి చెప్పొచ్చని నమ్మించాడు. అతడు తన మాటలతో ఆమెను బురిడీ కొట్టించి, కారులో ఎక్కించుకెళ్లాడు. అయితే, బాలికను ఒక గదికి తీసుకెళ్లాడు. అక్కడ బాలికను కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక ఎంత ఏడ్చినా వినిపించుకోలేదు. అంతేకాదు.. ఆమెను చంపేస్తానని బెదిరించాడు. గాయపరిచాడు. అత్యాచారం అనంతరం ఆమెను దగ్గర్లోని ఒక ఈద్గా వద్ద వదిలేసి వెళ్లిపోయాడు. తర్వాత ఇంటికి వెళ్లిన బాలిక తల్లికి జరిగిందంతా చెప్పింది. విషయం తెలుసుకున్న బాలిక బంధువులు, స్థానికులు నిందితుడిని పట్టుకున్నారు. ఒక స్తంభానికి కట్టేసి, దాడికి పాల్పడ్డారు. అనంతరం అతడిని వదిలేశారు. దీంతో నిందితుడు అక్కడినుంచి పారిపోయాడు.
తర్వాత బాలిక తన తల్లితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితుడిపై పోక్సోతోపాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. బాధిత బాలికకు పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించారు. బాధితుడు ప్రభుత్వ శాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తుండగా.. విషయం తెలిసిన ఉన్నతాధికారులు అతడ్ని సస్పెండ్ చేశారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.