RTC Bus: మెహిదీపట్నంలో ఆర్టీసీ బస్‌ చోరీ.. డిపో నుంచి ఎత్తుకెళ్లిన దొంగలు..

రాత్రి 10 గంటల 30 నిమిషాలకు మెహిదీపట్నం డిపో మందు బస్ నిలిపి వెళ్లాడు. తిరిగి ఉదయం డ్యూటీ ఎక్కేందుకు బస్సు పార్క్ చేసిన ప్రాంతానికి రాగా బస్ కనిపించలేదు. దీంతో బస్సు గురించి చుట్టుపక్కల వాళ్లను ప్రశ్నించాడు.

  • Written By:
  • Updated On - November 1, 2023 / 07:22 PM IST

RTC Bus: కాదేదీ చోరీకి అనర్హం అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు కొందరు దొంగలు. ఇప్పటి వరకూ బైక్‌లు, కార్లు ఎత్తుకెళ్లిన ఘటనలే చూశాం. కానీ ఇప్పుడు ఏకంగా ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లాడు ఓ దొంగ. హైదరాబాద్‌ మెహిదీపట్నంలో జరిగింది ఈ ఘటన. బస్సు డిపో ముందు పార్క్‌ చేసి ఉంచిన బస్సును ఎత్తుకెళ్లారు దొంగలు. అక్టోబర్‌ 30న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఆర్టీసీ బస్సు డ్రైవర్ సోమవారం రాత్రి డ్యూటీ దిగే సమయంలో.. అంటే రాత్రి 10 గంటల 30 నిమిషాలకు మెహిదీపట్నం డిపో మందు బస్ నిలిపి వెళ్లాడు.

తిరిగి ఉదయం డ్యూటీ ఎక్కేందుకు బస్సు పార్క్ చేసిన ప్రాంతానికి రాగా బస్ కనిపించలేదు. దీంతో బస్సు గురించి చుట్టుపక్కల వాళ్లను ప్రశ్నించాడు. తోటి డ్రైవర్లను అడిగినా ఫలితం లేకపోవడంతో.. డిపో మొత్తం గాలించారు. అయినా బస్సు కనిపించలేదు. దీంతో.. ఎవరో బస్సును ఎత్తుకెళ్లారని గుర్తించి.. డిపోలో సమాచారం అందించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి మెహిదీపట్నం పరిసర ప్రాంతాల్లో అమర్చిన సీసీ కెమెరాలను పరిశీలించారు. విచారణ అనంతరం తుండవల్లి సమీపంలో శంషాబాద్ దగ్గర పోలీసులు బస్సును గుర్తించారు. దొంగ మాత్రం దొరకలేదు. దీన్ని అక్కడకు ఎవరు తీసుకెళ్లారా అని విచారిస్తున్నారు పోలీసులు. గతంలో కూడా ఇలాంటి ఘటన తెలంగాణలో జరిగింది.

సెప్టెంబర్‌లో సిద్దిపేటలో ప్రయాణికులు ఉండగానే.. ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లి అందరికీ షాకిచ్చాడు ఓ దొంగ. తరువాత బస్సును రోడ్డుపై వదిలేసి పారిపోయాడు. ఆ వార్త అప్పట్లో వైరల్‌గా మారింది. ఇప్పుడు అలాంటి సంఘటనే మరోటి జరగడం చర్చనీయాంశంగా మారింది.