అమ్మా..! నేను ఈ తప్పు చేస్తున్నందుకు నన్ను క్షమించు. ఇది తాజాగా శ్రీచైతన్య కళాశాలలో చదువుతున్న ఇంటర్ విద్యార్థి సాత్విక్ రాసిన సూసైడ్ లేఖలోని మొదటి వాఖ్యం. అంటే ఇలా చేసుకోవడం అతనికి కూడా ఇష్టం లేదు. ఆ విద్యార్థికి ఎదురైన పరిస్థితులే అతనితో ఇలా చేయించాయి అని స్పష్టంగా అర్ధమవుతుంది. ఇంతకూ ఇంతటి తీవ్ర డిప్రెషన్ కి లోనవ్వడానికి కారణం ఏమిటో తెలుసా..? యాజమాన్యం చదవండి, చదవండి అని పెట్టిన టార్చర్. చదువు ముఖ్యమే.. అయితే ప్రాణాలు తీసుకునే చదువు అవసరం అంటారా. పేరెంట్స్ మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి. మీ పిల్లవాడి బంగారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మీ కలలను వారిపై రుద్దకండి.
ఎదురింటి అబ్బాయి ఐఐటీకి ఎంపిక అయ్యాడు.. పక్కింటి పిల్లవాడు జేఈఈ మెయిన్స్ కి ప్రిపేర్ అవుతున్నాడు.. మనకు తెలిసిన వాళ్లు గొప్ప చదువులు చదువుతున్నారు.. మన బంధువుల పిల్లలు పెద్ద స్థాయిలో రాణిస్తున్నారు అనే ఆలోచనలను పక్కన పెట్టండి. మనవాడు కూడా ఏదో ఒకరోజు ప్రయోజకుడు అవుతాడు అనే భావనను ముందు మీరు కలిగించుకొని, తరువాత మీ అబ్బాయికి కలిగించండి. అప్పుడే మన సమాజం మారుతుంది. సమాజంలో మార్పు ఎక్కడి నుంచో రాదు. మన నుంచే మొదలౌతుంది అన్న విషయాన్ని గమనించండి. ముందు మనం మారితే సమాజంలో ఒక శాతం మార్పు మొదలైనట్లే. గతంలో మీరు ఇందరిని ప్రేరణగా తీసుకొని మీ అబ్బాయి చదువుకు ఎలా ప్రోత్సహించారో.. అలాగే మిమ్మల్ని కూడా స్పూర్తిగా తీసుకునే వారు ఉంటారు. గుర్తుంచుకోండి.
ఇక పాఠశాల యాజమాన్యాల దగ్గరకి వస్తే వారు కేవలం డబ్బులే లక్ష్యంగా పాఠశాలలను నడుపుతున్నారు. దీనిపై ప్రభుత్వాలు ఎన్ని సంస్కరణలు చేసినప్పటికీ మురుగు నీరులా మారిపోతున్నాయి. కనీసం మురుగు నీరైనా మంటలను ఆర్పేందుకు సహాయ పడుతుంది. ఈ కార్పోరేట్ కళాశాలల పరిస్థితి అయితే ఇంతకన్నా దారుణం. పిల్లలను కోర్సుల్లో చేర్చుకునే ముందే వారి మేధో శక్తిని అంచనా వేయండి. అతను ఇందులో రాణించగలడా లేదా అనే విధంగా కొన్ని పరీక్షలను నిర్వహించేలా ప్రణాళికలు రచించండి. లేకుంటే ఇలాగే విద్యార్థులు ఒక్కొక్కరిగా తనువు చాలించాల్సి వస్తుంది. దీని వల్ల మీ విద్యా వ్యవస్థకే తీవ్ర నష్టం. డబ్బు సంపాధించడం ముఖ్యమే విలువలు లేకుండా సంపాధిస్తే ఇలాగే ఉంటుంది. ఆ అబ్బాయి అడ్మిషన్ తీసుకున్నప్పుడు మీరు చెప్పిన మాటలు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. మంచి భవిష్యత్తును అందిస్తామని చెప్పి ఉంటారు. ఇప్పుడేమైంది మీరు ఇచ్చిన మాట. భవిష‌్యత్తు కాదు కదా.. తల్లిదండ్రులకు బిడ్డనే దూరం చేశారు. మీరు అడిగినంత ఫీజు చెల్లించి ఎవరైనా తమ పిల్లావాడి మరణాన్ని కోరకుంటారా..? ఇప్పుడు అదే జరిగింది. మీకు డబ్బులిచ్చి వారి కొడుకుని వారే చంపుకునేలా చేశారు మీరు, మీ యాజమాన్యం. ఇప్పటికైనా మేలుకోండి. గత రెండు దశాబ్ధాలుగా జరుగుతున్న ఈ ఆత్మహత్యలకు పులిస్టాప్ పెట్టండి.
ఎవరు ఎంత మాట్లాడుకున్నా పోయిన పసివాడి ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేము. ఇక్కడ తప్పు ఎవరిది అనే అంశం కంటే మరోసారి ఏ ఒక్క తల్లికి ఇలాంటి కంటసోశ పడకుండా ఉండేలా చూడండి. సమాజంలో విద్య కన్నా ముఖ్యమైనది విలువలు వాటిని పాటిస్తూ విద్యావ్యవస్థలను కొనసాగించుకోండి. అంతేతప్ప తల్లిదండ్రుల ఆశల జ్వాలకు లేని పోని మాటల ఆజ్యంపోసి ఇలాంటి దురాగతాలకు ఒడిగట్టకండి.