Jaahnavi Kandula: అమెరికన్ పోలీస్ కండకావరం.. భారత యువతి ప్రాణానికి విలువ లేదన్న పోలీస్..!

ఏపీకి చెందిన జాహ్నవి కందుల (23) అనే యువతి గత జనవరిలో అమెరికాలోని, సియాటిల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించింది. ఈ ప్రమాదం చేసింది సియాటెల్‌కు చెందిన పోలీస్ ప్యాట్రోల్ వాహనం. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న జాహ్నవిని పోలీస్ వాహనం ఢీకొంది.

  • Written By:
  • Publish Date - September 13, 2023 / 02:24 PM IST

Jaahnavi Kandula: అత్యంత అమానవీయంగా వ్యవహరించే పోలీస్ వ్యవస్థ కలిగిన దేశాల్లో అమెరికా ఒకటి. అక్కడ నల్లజాతివారిపై, విదేశీయులపై అమెరికన్, తెల్లజాతి పోలీసులు హేయంగా ప్రవర్తిస్తుంటారు. తాజాగా అలాంటి ఒక ఘటన వెలుగు చూసింది. అయితే, ఈసారి బాధితురాలు మాత్రం భారతీయురాలు. అందులోనూ ఏపీకి చెందిన యువతి. ఆమె ప్రాణం పోగొట్టుకున్నా.. దానికి పెద్దగా విలువ లేదని చెప్పాడు ఆ పోలీస్. ఏపీకి చెందిన జాహ్నవి కందుల (23) అనే యువతి గత జనవరిలో అమెరికాలోని, సియాటిల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించింది.

ఈ ప్రమాదం చేసింది సియాటెల్‌కు చెందిన పోలీస్ ప్యాట్రోల్ వాహనం. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న జాహ్నవిని పోలీస్ వాహనం ఢీకొంది. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది. దీనిపై విచారణ జరుగుతోంది. ఈ ఘటన సందర్భంగా పోలీసుల మధ్య జరిగిన సంభాషణకు చెందిన ఆడియో ప్రస్తుతం కలకలం రేపుతోంది. స్థానిక పోలీస్ డిపార్ట్‌మెంట్ లీడర్స్ అయిన డేనియల్ ఆడెరర్, కెవిన్ డేవ్ అనే పోలీసుల మధ్య జరిగిన సంభాషణ ఇది. ఈ పోలీసుల డ్రెస్‌‌కు భుజంపైన కెమెరా ఉంటుంది. ఈ కెమెరాలో ఆడియో, వీడియోలు ఆటోమేటిగ్గా రికార్డవుతాయి. జాహ్నవి ప్రమాదం జరిగిన సమయంలో ఇద్దరి మధ్య సంభాషణ తాజాగా వెలుగుచూసింది. దీని ప్రకారం.. డేనియల్ నవ్వుతూ మాట్లాడాడు. అమ్మాయి ప్రాణం పోయినా, నవ్వుతూ, ఆ ప్రాణానికి పెద్దగా విలువ లేదన్నాడు. ”ఆమె (జాహ్నవి) చాలా మామూలు మనిషి. ఆమె ప్రాణానికి పెద్దగా విలువ లేదు. పైగా ఆమె వయసు కేవలం 26 సంవత్సరాలే. 11 వేల డాలర్ల చెక్ రెడీ చేస్తే సరిపోతుంది” అంటూ నవ్వుకుంటూ చెబుతున్న వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

అమ్మాయి ప్రాణానికి విలువ లేదని, నష్ట పరిహారంగా ఒక చెక్ అందజేస్తే చాలు అన్నట్లుగా అతడు మాట్లాడిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై స్థానిక మీడియా కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వీడియో సంభాషణ వైరల్ కావడంతో పోలీసు డిపార్ట్‌మెంట్ కూడా స్పందించింది. దీనిపై విచారణ జరుపుతున్నామని తెలిపింది. జాహ్నవి ప్రమాదానికి గురైన సమయంలో డేనియల్ 119 కిలోమీటర్ల వేగంతో కారు నడపినట్లు తేలింది. దీనిపై విచారణ సాగుతోంది.