Prof Haragopal: ఇది ముమ్మాటికీ దుర్మార్గమే! ప్రొఫెసర్‌ హరగోపాల్‌‌పై దేశద్రోహమా? మండిపడుతున్న ప్రజాసంఘాలు

పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్‌పై దేశద్రోహం కేసు నమోదు అయింది. ఉపా చట్టం 2022 కింద గత ఏడాది ఆగస్టు 19న ములుగు జిల్లా తాడ్వాయి పోలీస్‌స్టేషన్‌లో కేసు ఫైల్ అయింది. ఇదే కాకుండా ఆయుధాల చట్టం, సెక్షన్ 10 కింద కేసులు నమోదు అయ్యాయి.

  • Written By:
  • Publish Date - June 16, 2023 / 09:38 AM IST

Prof Haragopal: ప్రొఫెసర్‌ హరగోపాల్‌‌పై ‍‍యూఏపీఏ (UAPA) కింద కేసు పెట్టడంపై ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు భగ్గుమన్నాయి. అత్యంత దుర్మార్గమైన చర్యగా అభివర్ణిస్తున్నాయి.. ఇంతకీ ప్రొఫెసర్‌ హరగోపాల్‌‌పై ఎందుకు ఉపా కేసు నమోదైంది..?
తప్పులను ప్రశ్నిస్తున్న గొంతుకలపై ప్రభుత్వాల అణిచివేత ధోరణి కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా పౌర హక్కుల సంఘాల నేతలపై అటు కేంద్ర ప్రభుత్వం.. ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కక్షపూరితంగా వ్యవహరిస్తుంటాయి. మవోయిస్టుల సానుభూతిపరులంటూ కేసులు పెడుతుంటాయి. అన్యాయంగా ఎవరు ఎవరి చేతిలో హత్యకు గురైనా పౌర హక్కుల సంఘాలు ప్రశ్నిస్తాయి. అది వాళ్ల హక్కు. దేశంలో ఎవరి హక్కులు వాళ్లకి ఉన్నట్టే పౌర సంఘాలకు కూడా ఉంటాయి. దాని అర్థం వాళ్లంతా పోలీస్ వ్యతిరేకులని కాదు. ప్రభుత్వాల వ్యతిరేకులనీ కాదు. ప్రాణనష్టం పోలీసులవైపే ఎక్కువగా ఉన్న ప్రభుత్వాన్ని తప్పుబట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ ఎందుకో తెలియదు లెఫ్ట్ భావజాలమున్న ప్రతిఒక్కరూ ప్రభుత్వాలకు దేశద్రోహులగానే కనిపిస్తారు. నిష్పక్షపాత మేధావిగా గుర్తింపు పొందిన ప్రొఫెసర్‌ హరగోపాల్‌ కూడా అలానే కనిపించారు. అందుకే ఉపా చట్టం కింద హరగోపాల్‌పై కేసు నమోదు చేశారు.
ప్రొఫెసర్ హరగోపాల్ పై దేశ ద్రోహం కేసు
పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్‌పై దేశద్రోహం కేసు నమోదు అయింది. ఉపా చట్టం (Unlawful Activities (Prevention) Act) 2022 కింద గత ఏడాది ఆగస్టు 19న ములుగు జిల్లా తాడ్వాయి పోలీస్‌స్టేషన్‌లో కేసు ఫైల్ అయింది. ఇదే కాకుండా ఆయుధాల చట్టం, సెక్షన్ 10 కింద కేసులు నమోదు అయ్యాయి. హరగోపాల్‌తో పాటు 152 మంది ఉద్యమకారులు, మేధావులు ఎఫ్‌ఐఆర్‌లో నిందితులుగా ఉన్నారు. పీపుల్స్‌ డెమొక్రటిక్‌ మూవ్‌మెంట్‌ (PDM) అధ్యక్షుడు చంద్రమౌళిని రెండు నెలల కింద పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయన బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే అతడిపై మరిన్ని కేసులు ఉన్నాయని, బెయిల్‌పై విచారణ చేపట్టిన రంగారెడ్డి జిల్లా కోర్టుకు పోలీసులు తెలిపారు. మొత్తం అన్ని కేసుల వివరాలూ Zచెప్పాలని కోర్టు ఆదేశించడంతో పోలీసులు ఈ ఎఫ్‌ఐఆర్‌ను కోర్టు ముందు పెట్టారు. దీంతో హరగోపాల్‌పై విషయం బయటపడింది.
చనిపోయిన వారిపై కూడా కేసులు
తనపై దేశ ద్రోహం కేసు పెట్టడంపై స్పందించారు ప్రొఫెసర్ హరగోపాల్. తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లాంటి సందర్భాల్లో ఇలాంటి కేసులు పెట్టడం దురదృష్టకరమన్నారు. దేశద్రోహం, రాజద్రోహం కేసులు పెట్టొద్దని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. తనపై పెట్టిన దేశద్రోహం కేసు చెల్లదన్నారు హరగోపాల్. 152 మందిపై కేసులు పెట్టడం కరెక్ట్ కాదని.. చనిపోయిన వారిపై కూడా కేసులు పెట్టారని ఆరోపించారు. యూఏపీఏ చట్టం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉండాల్సిందేనా అని ప్రశ్నించారు. ఎక్కడో పేరుందని ఎలా కేసు పెడతారని నిలదీశారు. దీనిపై తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు ప్రొఫెసర్ హరగోపాల్‌పై దేశద్రోహం కేసు పెట్టడంపై ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. విద్యావేత్తలపై దేశద్రోహం కేసులు పెడుతున్నారన్న విమర్శలు పెరిగిపోతున్నాయి. హరగోపాల్ లాంటి వ్యక్తులను యూఏపీఏ కేసుల్లో ఇరికించడం వెనుక కుట్ర ఉందని ఆరోపిస్తున్నాయి.