Shamirpet Fire: ప్రేమ, పగ, మోసం.. శామీర్‌పేట కాల్పుల వెనక సంచలన నిజాలు

శామీర్‌పేట్‌ కాల్పుల ఘటనలో ట్విస్టుల మీద ట్విస్టులు బయపడుతున్నాయి. మొదట వివాహేతర సంబంధం కాల్పులకు కారణమని భావించినా.. తవ్వుతున్న కొద్దీ ఈ కేసులో కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. భర్తను కాదని మనోజ్‌తో లివింగ్‌ రిలేషన్‌లో ఉండటమే కాకుండా.. సినిమాల్లో ఆఫర్ల పేరుతో ఎంతో మందిని స్మిత మోసం చేసినట్టు గుర్తించారు పోలీసులు. మనోజ్‌ స్మిత ఇద్దరూ కలిసి అమాయకులను మోసం చేసి లక్షలు కూడగట్టుకున్నట్టు చెప్తున్నారు.

  • Written By:
  • Publish Date - July 15, 2023 / 06:12 PM IST

కన్న బిడ్డలను దక్కించుకునేందుకు ఓ తండ్రి చేస్తున్న పోరాటం. అడ్డదారిలో డబ్బు సంపాదించేందుకు ఇద్దరు అత్యాశపరుల ఆరాటం. శామీర్‌పేట్‌ కాల్పుల ఘటనలో వెలుగులోకి వస్తున్న నిజాలు త్రిల్లర్‌ సినిమాను తలపిస్తున్నాయి. మొదట వివాహేతర సంబంధమే ఈ ఘటనకు కారణమని అంతా భావించినా.. సిద్ధార్థ్‌పై మనోజ్‌ కాల్పులు జరపడం వెకన ఓ పెద్ద కథే ఉందంటున్నారు పోలీసులు.

వైజాగ్‌లోని హిందూజా థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌లో మేనేజర్‌గా పని చేస్తున్న సిద్ధార్థ్‌ భార్యే ఈ స్మిత. 2009 నుంచి వీళ్ల మధ్య రిలేషన్స్‌ బాలేవు. విభేదాలు ముదరడంతో భర్త నుంచి విడిపోయి ఇద్దరు పిల్లలతో సహా హైదరాబాద్‌కు వచ్చేసింది స్మిత. రీసెంట్‌గానే ఇద్దరూ విడాకులు కూడా తీసుకున్నారు. అయితే పిల్లలు తనకు కావాలంటూ సిద్ధార్థ్‌ పోరాడుతున్నాడు. ఇదే విషయంలో స్మితకు సిద్ధార్థ్‌కు మధ్య వివాదం నడుస్తోంది.

హైదరాబాద్‌ వచ్చిన కొత్తలో మనోజ్‌తో స్మితకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కొద్ది రోజులకే వివాహేతర సంబంధానికి దారితీసింది. 2019 నుంచి సెలబ్రిటీ రిసార్ట్‌లోని విల్లా నెంబర్‌ 21లో మనోజ్‌ స్మిత కలిసే ఉంటున్నారు. మనోజ్‌ తనను కొట్టాడంటూ స్మిత కొడుకు రీసెంట్‌గా చైల్డ్‌ వెల్ఫేర్‌ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ నెల 12న స్మిత కొడుకును సీడబ్లూసీ అధికారులు తమ సంరక్షణలోకి తీసుకున్నారు. తన చెల్లిని కూడా ఆ ఇంట్లో నుంచి తీసుకురావాలంటూ స్మిత కొడుకు సీడబ్లూసీ అధికారులకు తన తండ్రి సిద్ధార్థ్‌కు ఫోన్‌ చేశాడు. ఇదే విషయం మాట్లాడేందుకు సిద్ధార్థ్‌ సెలబ్రిటీ రిసార్ట్‌కు వెళ్లాడు.

సిద్ధార్థ్‌ స్మితతో మాట్లాడుతుండగా ఆవేశంతో ఊగిపోయిన మనోజ్‌ తన ఎయిర్‌గన్‌తో సిద్ధార్థ్‌ మీద కాల్పులు జరిపాడు. కానీ సిద్ధార్థ్‌ తప్పించుకున్నాడు. వెంటనే స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సిద్ధార్థ్‌ను, మనోజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. మనోజ్‌ ఉపయోగించిన గన్‌ను ల్యాబ్‌కు పంపారు. దాని రిపోర్ట్‌ ఆధారంగా మనోజ్‌ మీద పోలీసులు కేసు నమోదు చేసే చాన్స్‌ ఉంది. ఇక్కడిదాకా అంతా బాగానే ఉంది. అసలు ఈ నాలుగేళ్లు పెళ్లి చేసుకోకుండా స్మిత, మనోజ్‌ ఏం చేశారు అని ఆరా తీస్తే మరో స్టోరీ వెలుగులోకి వచ్చింది.

స్మిత మనోజ్‌ ఇద్దరూ లివింగ్‌ రిలేషన్‌లో ఉండటమే కాకుండా సినిమాలంటే ఆసక్తి ఉన్నవారిని మోసం చేయడం ప్రారంభించారు. సినిమాల్లో, సీరియల్స్‌లో ఆఫర్స్‌ ఇప్పిస్తామంటూ అమాయకుల దగ్గర డబ్బులు వసూలు చేశారు. స్మిత ఒరాకిల్‌లో జాబ్‌ చేస్తోంది. మనోజ్‌ ఆల్రెడీ యాక్టర్‌ కావడంతో మనోజ్‌ను చూపించి అమాయకులను ఈజీగా నమ్మించగల్గింది. ఇద్దరూ కలిసి ఆఫర్ల పేరుతో చాలా మందిని మోసం చేసి 50 లక్షల వరకూ పోగేసినట్టు పోలీసులు చెప్తున్నారు. కానీ పిల్లల కోసం సిద్ధార్థ్‌ చేసిన గొడవతో వీళ్ల రిలేషన్‌షిప్‌తో పాటు రియల్‌ టైం దందా కూడా బయటపడింది.

అయితే ఇందులో మనోజ్‌ తండ్రి వాదన మరోలా ఉంది. మనోజ్‌, స్మిత ఇద్దరూ జస్ట్‌ ఫ్రెండ్స్‌ అని చెప్తున్నారు మనోజ్‌ తండ్రి. ఇక్కడ ఎవరూ ఎవరినీ మోసం చేయలేదని సిద్ధార్థ్‌ కత్తితో దాడి చేయడానికి ప్రయత్నిస్తేనే మనోజ్‌ కాల్పులు జరపాల్సి వచ్చిందని చెప్తున్నాడు. స్మిత, మనోజ్‌ కంటే వయసులో పెద్దదని.. వాళ్లిద్దరూ రిలేషన్‌లో ఉండటమేంటని రివర్స్‌ క్వశ్చన్‌ చేస్తున్నారు. సిద్ధార్థ్‌ మాత్రం తనకు ఎవరితో అవసరం లేదని తన పిల్లలను తనకు అప్పగిస్తే చాలంటూ చైల్డ్‌ వెల్ఫేర్‌ అధికారులకు అప్లికేషన్‌ కూడా ఇచ్చాడు. ప్రస్తుతానికి సస్పెన్స్‌ త్రిల్లర్‌ సినిమాను తలపిస్తున్న ఈ కేసు ఇంకెన్ని ములుపులు తిరుగుతుందో చూడాలి.